మరో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమా..?

బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. కత్రినా కైఫ్, అలియా భట్ నుంచి మొదలుపెట్టి చాలామంది ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి పరిణీతి చోప్రా కూడా చేరబోతోందా? అవుననే అంటోంది బాలీవుడ్.

ఉన్నట్టుంది పరిణీతిపై పుకార్లు రావడానికి ఓ వీడియో కారణమైంది. అవును.. ఒక్క వీడియో, ఒకే ఒక్క వీడియో పరిణీతి పెళ్లి పుకార్లను వైరల్ అయ్యేలా చేసింది. ఇంతకీ పరిణీతి చోప్రా పక్కనున్నది ఎవరో తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.

తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో రాఘవ్, పరిణీతి కలిసి కనిపించారు. ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత ఒకే కారులో తమ ఇళ్లకు పయనయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పట్నుంచి పరిణీతి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి.

34 ఏళ్ల రాఘవ్, రాజ్యసభలో పిన్నవయష్కుడిగా గుర్తింపు పొందాడు. పార్టీలో అతడికి మంచి పేరుంది. ఇతడు 34 ఏళ్ల పరిణీతికి దగ్గరయ్యాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీటిపై స్పందించడానికి పరిణీతి అందుబాటులోకి రాలేదు కానీ, రాఘవ్ ను మాత్రం మీడియా పట్టుకుంది.

పార్లమెంట్ నుంచి బయటకొచ్చిన రాఘవ్ ను పరిణీతి విషయంపై మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రాఘవ్, తనను రాజ్ నీతి (రాజకీయాలు) గురించి ప్రశ్నించాలని, పరిణీతి గురించి మాత్రం అడగొద్దంటూ ముసిముసిగా నవ్వుకుంటూ తప్పించుకున్నాడు. ఈ ముసిముసి నవ్వులతో ఇద్దరిమధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.

Show comments