మొన్న బన్నీ... ఈసారి ఎన్టీఆర్.. ఏది నిజం?

మరోసారి తెలుగుతెరపైకి మురుగదాస్ పేరు వచ్చింది. మొన్నటికిమొన్న బన్నీతో మురుగదాస్ చర్చలు జరపబోతున్నాడంటూ కథనాలు వచ్చాయి. మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాడనేది దాని సారాంశం. అంతలోనే బన్నీ స్థానంలో ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

అవును.. త్వరలోనే ఎన్టీఆర్ కూడా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాడట. నిన్నట్నుంచి వైరల్ అవుతున్న మేటర్ ఇది. అంతా బాగానే ఉంది కానీ అసలు ఇందులో నిజమెంత? అటు బన్నీ లేదా ఇటు ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు మరో సినిమాకు ఓకే చేసే పొజిషన్ లో ఉన్నారా? ఇంతకీ మురుగదాస్ పరిస్థితేంటి? వీళ్ల ముగ్గురి చుట్టూ తిరుగుతున్న వార్తల్లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదు.

తెలుగు-తమిళ భాషల్లో బన్నీ ఓ సినిమా చేయాలనుకుంటున్న మాట వాస్తవం. దీనికోసం మురుగదాస్ ను సంప్రదించిన మాట కూడా వాస్తవం. కానీ వీళ్లిద్దరూ కలిసి చర్చలు జరిపారనే విషయంలో మాత్రం నిజం లేదు. ప్రస్తుతం రజనీకాంత్ తో చేస్తున్న దర్బార్ సినిమా పనుల్లో మురుగదాస్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ తో అతడొక సినిమా చేస్తాడంటూ ప్రచారం సాగుతోంది. సో.. ఇప్పట్లో ఆయన బన్నీతో సినిమా చేసే ఛాన్స్ లేదు.

ఇటు బన్నీ కూడా ఖాళీగా లేడు. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. తర్వాత సుకుమార్ సినిమా లైన్లో ఉంది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలి. ఈ కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాతే మరో సినిమా. ఇక ఎన్టీఆర్ విషయానికొద్దాం. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ఆర్-ఆర్-ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత లెక్కప్రకారం కొరటాల శివతో సినిమా చేయాలి.

సో.. మురుగదాస్ తో ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదు. దర్బార్ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మేటర్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి  

Show comments