సినిమా రివ్యూ: సామి

రివ్యూ: సామి
రేటింగ్‌: 1/5
బ్యానర్‌:
తమీన్స్‌ ఫిలింస్‌
తారాగణం: విక్రమ్‌, కీర్తి సురేష్‌, బాబీ సింహా, ప్రభు, ఐశ్వర్య రాజేష్‌, ఐశ్వర్య, సూరి, కోట శ్రీనివాసరావు తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: వి.టి. విజయన్‌, టి.ఎస్‌. జయ్‌
ఛాయాగ్రహణం: ప్రియన్‌, వెంకటేష్‌ అంగురాజ్‌
నిర్మాత: శిబు తమీన్స్‌
రచన, దర్శకత్వం: హరి
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 21, 2018

మాస్‌ మసాలా వికటిస్తే ఎలాగుంటుందనే దానికి చక్కని ఉదాహరణ 'సామి'. పదిహేనేళ్ల క్రితం విక్రమ్‌తో హరి తీసిన సామి (తెలుగులో లక్ష్మినరసింహా) పర్‌ఫెక్ట్‌గా రంగరించిన మాస్‌ మసాలాలతో మాస్‌ ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. విక్రమ్‌ స్టార్‌డమ్‌ పెంచడంలో ఆ చిత్రం కూడా దోహదపడింది. అయితే ఇన్నేళ్ల అనంతరం అదే దర్శకుడు, కథానాయకుడు కలిసి చేసిన సీక్వెల్‌ ఆ ఒరిజినల్‌కి తలవంపులు తెచ్చేలాగుంది. ఆరంభం నుంచి అరుపులు, కేకలు, పొలికేకలు, పెడబొబ్బలు... చెవుల తుప్పు వదిలిపోయేలా 'సయ్‌... సయ్‌...' అంటూ సౌండ్‌ ఎఫెక్టులు. 'సింగం' (యముడు) చిత్రంతో హరి పోలీస్‌ పాత్రలకి ఒక విధమైన లౌడ్‌నెస్‌ జోడించి దాంతోను వినోదం పండించాడు. తర్వాత దానికి సీక్వెల్‌, మళ్లీ దానికి సీక్వెల్‌ అని తీస్తూ పోతూ ఆ ఫార్ములా మీదే ఒక విధమైన విసుగు, విరక్తి తెప్పించాడు. 

పేరుకి ఇది 'సామి' సీక్వెల్‌ అయినా కానీ... 'సింగం 4'గా రావాల్సిన సినిమా ఇది. విక్రమ్‌ హీరో అనే కానీ ఆ సామి లక్షణాలు ఏమీ లేని అరుపుల సునామీ ఇది. కెమెరా ముందుకి వచ్చిన ప్రతి ఒక్కరూ 'యాక్షన్‌' అనగానే లౌడ్‌ యాక్టింగ్‌తో పేట్రేగిపోవడం ఈ చిత్రం స్పెషాలిటీ. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్‌ కూడా తానెంత బ్యాడ్‌గా నటించగలనో చూపించడానికి ఈ చిత్రం చేసినట్టుంది. వరుస పరాజయాలతో తనపై తానే కాన్ఫిడెన్స్‌ కోల్పోయి దర్శకుడు చెప్పినదానికల్లా తలాడించేస్తే ఇలాగే తయారవుతుంది. హరి ఈ సీన్లు రాసుకోవడం సరే... అసలు వాటిని తనకి చెబితే విక్రమ్‌ ఎలా ఒప్పుకున్నాడనే ఫీలింగ్‌ చాలా సందర్భాల్లో వస్తుంది. 

హీరో గావుకేకలు పెడుతోంటే, విలన్‌గా నటించిన బాబీ సింహా తన ఉనికి చాటుకోవడానికి ఇంకాస్త బిగ్గరగా అరుస్తుంటాడు. వీళ్ల అరుపులు చాలదన్నట్టు దేవిశ్రీప్రసాద్‌ నేపథ్య సంగీతం శ్రవణ శక్తికి మరింతగా పరీక్ష పెడతాడు. ఎదురెదురు పడి ఒకేసారి కొట్టేసుకుని తేల్చేసుకునే దానికి హీరో, విలన్‌ కలిసి రెండున్నర గంటల పాటు సాగదీస్తారు. సినిమా తీయడమంటే ఏదో వాహనం ఎక్కించి దాని చుట్టూ కెమెరాలు తిప్పడమే అన్నట్టుంటుంది హరి వరస. ఒకప్పుడు స్క్రీన్‌ప్లే పరుగులు పెట్టిస్తాడని కితాబులు అందుకున్న హరికి ఇప్పుడు అలా కథని వేగంగా నడిపించడం ఎలాగో తెలియక పాత్రధారుల్ని కారులు, హెలికాప్టర్లు ఎక్కించి కథ పరుగులు పెడుతోందనే భావన కలిగిస్తున్నాననే భ్రమలో వున్నట్టున్నాడు. 

ఈ నసాత్మక మాస్‌ సినిమాలో రొమాన్స్‌ అనే సైడ్‌ డిష్‌ కూడా వుంది. 'మహానటి'గా కనిపించిన కీర్తి సురేష్‌ని ఇలాంటి సగటు వెన్నెముక, వ్యక్తిత్వం లేని కథానాయిక పాత్రలో చూడడం బాధగా అనిపిస్తుంది. పొగరుబోతుగా పరిచయమై, సామి చెంపపై ఒక్కటి కొట్టగానే ఇంక అతడినే ఆరాధిస్తూ తిరిగేస్తుంది. లవ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి లేదా ప్రేమ పుట్టడానికి అవతలి వ్యక్తిని చెంపపై కొట్టాలనే థియరీ ఏమిటనేది హరి వివరించాలి. దాదాపుగా ప్రతి సినిమాలోను ఇది విధిగా ఫాలో అవుతుంటాడు మరి. హీరో-విలన్‌ల ఛాలెంజ్‌లు, ఛేజ్‌ల నడుమ లవ్‌ ట్రాక్‌ వుంటే అది కాస్త ఉపశమనం ఇవ్వాలి. కానీ కీర్తి సురేష్‌ పాత్ర కనిపించినపుడల్లా పాట వస్తుందేమోననే భయంతో గుండెలు ఉగ్గబట్టుకోవాలి. 

హరి సినిమాలో హాస్య రసమంటే బీభత్సం, భీతావహమే. కంటెంట్‌ లేనపుడు తన ఓవరాక్షన్‌తో హింసించేసే సూరి ఈ చిత్రంలో చెలరేగిపోయాడు. అతను తెర మీదకి వచ్చిన ప్రతిసారీ బయటకి పోయేందుకు దగ్గర దారి ఎటో వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించాడు. పైగా ఈ హాస్య హింస ఒక పట్టాన తెమలదు. మొదలైందంటే నవ్వుతారా, ఛస్తారా అన్నట్టు ప్రేక్షకులపై దాదాపు మర్డర్‌ అటెంప్ట్‌ చేస్తోన్న భావనే కలిగిస్తారు. 

నటీనటులు ఎవరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందరూ అవధులు దాటిన అతిని తమ పరిమితుల్లో ప్రదర్శించారు. దీనికి దేవిశ్రీప్రసాదే సంగీత దర్శకుడని పలుమార్లు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు. సినిమాటోగ్రాఫర్లకి మాత్రం చేతి నిండా పని కల్పించారు. అయిన దానికి, కాని దానికీ జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్లు... ఎలాంటి అవసరం లేకపోయినా ఏరియల్‌ షాట్లు, రోడ్ల మీద ఛేజింగులతో సినిమాటోగ్రాఫర్లని పెట్టని యాతన లేదు. ఇక యాక్షన్‌ డైరెక్టర్లయితే బౌన్సింగ్‌ షాట్లతోనే కాలం గడిపేసి జనాలని గాల్లో ఎగరేయడంతోనే సరిపెట్టారు. విపరీతంగా ఖర్చు పెట్టించేసే హరి ఈ చిత్రంలోను ఏమాత్రం తగ్గకుండా తనకి తోచినట్టుగా డబ్బులు పారబోయించాడు.

సున్నితత్వం అనే మాటకి ఆమడ దూరంలో, మృదుత్వం అనే పదానికి దరిదాపుల్లో లేని ఈ చిత్రం కేవలం ఆడియన్స్‌ సెన్సెస్‌పై చేసిన దాడిలా అనిపిస్తుంది. పోలీస్‌ యూనిఫామ్‌ తాకగానే దెయ్యం పూనిన వాడిలా మారిపోయే హీరో చేసే విధ్వంసం, చనిపోయిన గర్భవతి కడుపు కోసి బిడ్డని బయటకి తీసే వైనం... వర్ణనాతీతం. మాస్‌ సినిమాని హరి ఎంత తేలికగా తీసుకుంటాడో, ఆడియన్స్‌ టేస్ట్‌పై అతనికి ఎలాంటి అభిప్రాయముందో చూపిస్తాడు. ట్రెండుకి తగ్గట్టు అందరు దర్శకులు అప్‌డేట్‌ అవుతూ వుంటే, తనకొచ్చిన వాటిని కూడా ఇంకెంత హింసాత్మకంగా చూపించవచ్చో... ఉత్తమ నటుల్ని క్లూలెస్‌గా మార్చేసి తెరపై ఇష్టానికి ఎలా ఆడించవచ్చో తన సినిమాలతో చాటుకుంటున్నాడు.  

బాటమ్‌ లైన్‌: హెడ్డేక్‌ సామీ!

గణేష్‌ రావూరి

Show comments