రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి.. సినీఫక్కీలో..!

చెప్పినట్టుగానే ఆర్టీసీ కార్మికులు ప్లాన్-బి అమలు చేశారు. ఈరోజు నుంచి వివిధ పార్టీల రాజకీయ నేతలతో కలిసి సమ్మెను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్ ను ముట్టడించడానికి రెడీ అయింది కాంగ్రెస్ పార్టీ. సాధారణంగా ముట్టడి అంటే అంతా కలిసి ఒకేసారి వస్తారు, వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఓ గంటలో ప్రహసనం మొత్తం పూర్తవుతుంది. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పోలీసులకు చుక్కలు చూపించింది. కేసీఆర్ కు షాకిచ్చింది.

అవును.. ప్రగతి భవన్ ను దశలవారీగా ముట్టడించాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. నేతలంతా విడతల వారీగా ప్రగతి భవన్ ముట్టడిలో పాలుపంచుకుంటున్నారు. దీంతో వచ్చిన నేతల్ని అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. ఉదయం 10 గంటల నుంచే ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు సినీఫక్కీలో ప్రగతిభవన్ కు వచ్చి పోలీసులకు చుక్కలు చూపించారు.

అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే నెపంతో కాంగ్రెస్ నేతల్ని రాత్రి నుంచే హౌజ్ అరెస్టులు చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు. ఇలాంటివేవో జరుగుతాయని రేవంత్ రెడ్డి ముందుగానే ఊహించారు. ఎందుకంటే, గత ఎన్నికల సమయంలో సరిగ్గా ఎన్నికలకు ముందు రేవంత్ ఇలానే అరెస్ట్ అయ్యారు. అందుకే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, నిన్ననే పరారయ్యారు రేవంత్. పోలీసులు ఎంత వెదికినా దొరకలేదు. సరిగ్గా కొద్దిసేపటి కిందట ఓ బైక్ పై ప్రగతిభవన్ కు వచ్చి పోలీసుల్ని షాక్ కు గురిచేశారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. తనను పోలీసులు పట్టుకోలేరని, ప్రగతి భవన్ కు వస్తున్నానంటూ ట్విట్టర్ లో కేసీఆర్ కు ఛాలెంజ్ చేసి మరీ వచ్చారు రేవంత్.

మరోనేత జగ్గారెడ్డి కూడా ఇలానే వ్యవహరించారు. పోలీసులు కార్లు తనిఖీ చేస్తున్నారని గ్రహించి, సైలెంట్ గా ఓ ఆటో ఎక్కి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. వచ్చింది జగ్గారెడ్డి అని గ్రహించిన పోలీసులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సీఎల్పీ నేతలు మల్లుభట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబులను ఇప్పటికే హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. ఎందుకైనా మంచిదని బేగంపేట్ వద్ద మెట్రోరైలు స్టేషన్ ను కూడా మూసేశారు.

అయితే ఇంత జరిగినా పోలీసుల్లో టెన్షన్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన నేతలంతా సాయంత్రం 5 గంటల లోపు ఏదో ఒక మార్గంలో ప్రగతి భవన్ ను ముట్టడించే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం వరకు అలెర్ట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పోలీసుల్ని మొహరించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ సమ్మెను ఉధృతం చేశారు. వరుసగా 17వ రోజు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు.

ఈరోజు నుంచి తెలంగాణ అంతటా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నాయి. దీంతో బస్సుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్నాళ్లూ ఆర్టీసీ బస్సుల్ని నడిపించిన ప్రైవేట్ డ్రైవర్లు కూడా విధుల నుంచి తప్పుకున్నారు. మరోవైపు ఆటోలు, ప్రైవేట్ క్యాబ్ లు ఇష్టారాజ్యంగా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రజలంతా తమ సొంత వాహనాలతో బయటకు రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?