ఎమ్బీయస్‌: కశ్మీర్‌ కైవసం - ఓ దుస్సాహసం

370 ఆర్టికల్‌ రద్దును ఆహ్వానించకపోతే దేశద్రోహిగా ముద్ర పడే ప్రమాదం ఉందని తెలిసి కూడా నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను.

కశ్మీర్‌ అంశం గురించి నేను అప్పుడప్పుడు - అరుదుగానే - రాస్తూ వచ్చాను. నా అభిప్రాయాలు యిప్పటికీ మారలేదు. కశ్మీర్‌ వ్యవహారాల గురించి రాయడం ఎందుకు బోరంటే, దశాబ్దాలుగా అన్ని కేంద్ర ప్రభుత్వాలూ దాన్ని శాంతిభద్రతల సమస్యగానే చూస్తూ వచ్చాయి.

పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలో వచ్చాక మరో మాట. ఒక్కరు కూడా అక్కడ సైన్యాన్ని ఉపసంహరించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పలేక పోయారు. పైపై రాజకీయాలే తప్ప అక్కడి సామాన్యపౌరుడి మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదు. మోదీ అధికారంలోకి వచ్చాక కశ్మీరు సమస్య మరింత జటిలమైంది తప్ప సానుకూల పడలేదు. 

నోట్ల రద్దు తర్వాత కశ్మీరులో ఉగ్రవాదం పటాపంచలైందని బిజెపి చెప్పుకుంది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రమాదం పొంచి ఉందంటూ, ఎన్నడూ లేని విధంగా అమరనాథ్‌ యాత్ర రద్దు చేశారు. అంటే రెండున్నరేళ్లగా ఉగ్రవాదాన్ని అణచలేక పోయారన్నమాట! పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పలేక పోయారన్నమాట.

ఎన్నికల సమయంలో మాత్రమే పాకిస్తాన్‌కు తడాఖా చూపించి, ఓట్లు సంపాదిస్తారు తప్ప తక్కిన సమయాలలో గత ప్రభుత్వాల కంటె భిన్నంగా ఏమీ లేరన్నమాట. ఇలా అంటారనే యిప్పుడీ దుస్సాహసానికి ఒడి గట్టింది బిజెపి. నోట్ల రద్దు లాగానే యిదీ ఒక దుస్సాహసమే. ఇవాళ్టి కివాళ ఫలితాలు తెలియక పోవచ్చు కానీ రాబోయే సంవత్సరాలలో తప్పక తెలిసి వస్తాయి. 

370 ఆర్టికల్‌ రద్దు ఎంత సమంజసమో, ప్రత్యేక ప్రతిపత్తి ద్వారా కశ్మీర్‌కు ఎన్ని లాభాలు ఒనగూడుతున్నాయో పొద్దుటి నుంచీ వాట్సప్‌లు వచ్చి పడుతున్నాయి. సోషల్‌ మీడియాపై బిజెపి కున్న పట్టుకు యిది మరో నిదర్శనం. ఈ వివరాలన్నీ ఎప్పణ్నుంచో అందరికీ తెలిసినవే. కొత్తగా సృష్టించినవి కావు.

దీనివలన మన కంటె కశ్మీరీయులకు ఏదో ఒరిగిపోతోందని అనుకున్నవాళ్లను ఒక్కటే అడుగుతారు. మీరు కశ్మీరు వెళ్లి కాపురం పెడతారా అని! టూరిస్టులుగా వెళ్లడానికే అడలి చస్తున్నారే! అక్కడ ఆస్తులు కొనుక్కోలేం, అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే యిబ్బంది ఉంది, వంటివి చెప్పకండి. వెళ్లిన చోటల్లా ఆస్తులు కొనడం, పెళ్లాడడం అందరికీ అయ్యే పని కాదు. 

మిమ్మల్ని బదిలీ మీద ఓ మూడేళ్లు పంపుతున్నాం అని ఆఫీసు వాళ్లు అంటే మీరేమంటారు? బాబోయంటారు. ఓ పక్క సైన్యం, మరో పక్క ఉగ్రవాదులు, సౌకర్యాలు లేవు, తప్పదంటే ఒక్కణ్నీ వెళతాను తప్ప ఫ్యామిలీని తీసుకెళ్లను అని బతిమాలతారు. అలాటప్పుడు కశ్మీరీయులు ఏదో బావుకుంటున్నారని ఎలా అనగలం?

ఇప్పుడు యీ ఆర్టికల్‌ రద్దుతో వాళ్లు బిత్తరపోతున్నారు. దీనికి తక్కినవారి ప్రతిక్రియ ఎలా ఉంటుందో వాళ్లకు తెలియదు. ప్రజాస్వామ్యం వల్లించే పార్టీలు బలహీనపడితే ఉగ్రవాదులది పైచేయి అవుతుందనే భయంతో వణుకుతున్నారు. కశ్మీరు నివాసితులలో కొంత శాతమైనా దీన్ని ఆహ్వానిస్తారేమో చూడాలి.  'ఎందుకు ఆహ్వానిస్తారండీ, వాళ్లు పాకిస్తానంటే పడిచచ్చే రకం. ఈ దెబ్బతో బుద్ధి వస్తుంది' అంటారా, యిదన్నమాట సాటి 'భారత' పౌరులపై మీ 'ప్రేమ'!

కశ్మీరు గురించి నా దగ్గర బాగానే సమాచారం ఉంది. రాస్తే కనీసం పది పేజీలు రాయాలి. కానీ ఎప్పటికీ తేలిని యీ సమస్యపై పాఠకులకు ఆసక్తి ఉండదనే భయంతో రాయలేదు. ఇవాళ్టి ప్రభుత్వాదేశం గురించి వివరాలు క్రమేపీ బయటకు వచ్చాక కావాలంటే చర్చించవచ్చు. ఈ లోపుగా మౌలికంగా సమస్య ఎందుకు వచ్చిందో సాధ్యమైనంత క్లుప్తంగా చెప్తాను.

మొదటగా తెలుసుకోవలసినది - 'కశ్మీరు భారత్‌లో అంతర్భాగం. దాని గురించి చర్చ అనవసరం.' అనే వాదన వట్టిది. అంతర్భాగం అనే మాట అనవలసినది కశ్మీరీయులు, యితర రాష్ట్రాల వారు కారు. బ్రిటిషు వారు ఇండియా వాళ్లదే అనుకున్నారు, మనమూ  చాలాకాలం అనుకున్నాం. కాదని అనుకున్నవాళ్లు క్రమేపీ పెరుగుతూ వచ్చారు కాబట్టి, వాళ్లను బయటకు పంపించారు. కశ్మీరు మనది అనుకునే వాళ్లు చెప్పేదేమిటంటే, అది ఎన్నో శతాబ్దాలుగా భారత్‌లోనే ఉంది. ఆది శంకరాచార్యుడు వెళ్లాడు.' వగైరా. 

మొదటగా తెలుసుకోవలసినది భారత్‌ ఒకే దేశం అనే కాన్సెప్టు ఇంగ్లీషువాళ్లు వచ్చాకనే వచ్చింది. అంతకు ముందు అది విడివిడి రాజ్యాల సమూహం - యిప్పటి యూరోప్‌లా! ఒకళ్లతో మరొకళ్లు కొట్టుకుంటూ ఉండేవారు. ఇంగ్లీషు వాళ్లు వచ్చి మొత్తమంతా కబళించి, ఒకే ముద్ద చేశారు. కొన్ని కలిపారు, కొన్ని తీసేశారు. 1947 నాటికి మిగిలినది భారత్‌ అనుకుంటున్నాం. తర్వాత మనం సిక్కిం ఆక్రమించి, భారత్‌ సైజు పెంచుకున్నాం. పాకిస్తాన్‌కు కశ్మీరులో కొంత భాగాన్ని సమర్పించుకుని సైజు తగ్గించుకున్నాం. తర్వాత చైనాకు కొంత సమర్పించుకుని సైజు మరీ తగ్గించుకున్నాం. ఇదంతా రాజకీయ ప్రక్రియ.

అప్పటికి చేతిలో ఏముందో అదే లెక్క తప్ప గతచరిత్ర తవ్వి తీసి, దాని ప్రకారం క్లెయిమ్‌ చేయబోతే - బర్మా మనదే, అఫ్గనిస్తాన్‌ మనదే, కంపూచియా మనదే, శ్రీలంక మనదే..! అలా యితరులు కూడా క్లెయిమ్‌ చేయడం మొదలుపెడితే భారత్‌లో చాలాభాగం మొఘల్‌ల జన్మస్థలమైన ఉజ్బెకిస్తాన్‌ వాళ్లదే అవుతుంది.

దేశంలోని ప్రాంతాలు కూడా చేతులు మారుతూ వచ్చాయి. ఆంధ్రులు మగధను ఓడించారు, ఒడియా రాజులు రాజమండ్రి దాటి పాలించారు, మరాఠా రాజులు తంజావూరు పాలించారు, కాకతీయులు తమిళ ప్రాంతాలను పాలించారు. అందువలన అవన్నీ మావే అంటే ఎవరు ఒప్పుకుంటారు? 66 ఏళ్ల క్రితం దాకా ఆంధ్రులకు మద్రాసులో స్థానికత ఉంది, ఐదేళ్ల క్రితం దాకా హైదరాబాదులో స్థానికత ఉంది. ఇప్పుడు లేదు. ఇలా ప్రతీదీ ట్రాన్సిషన్‌లో ఉన్నపుడు ఎప్పటివో విషయాలు చెప్పి, యిప్పుడు మాది అనలేము. 1947లో ఇంగ్లీషు వాళ్లు వెళ్లేముందు వదిలేసిన దానిలోంచి భారత్‌ తయారు చేశారు అప్పటి పాలకులు. కొంత బ్రిటిషు పాలిత ప్రాంతం. కొంత సంస్థానాధీశుల పరం. 

570 పై చిలుకు ప్రతీ సంస్థానాధీశుడితో విడివిడిగా బేరాలాడుకుని భారత్‌లో కలుపుకుంటూ వచ్చారు పటేల్‌. దానికి  రెండున్నరేళ్లు పట్టింది. సామదానభేద దండోపాయాలలో ఒక్కోళ్లతో ఒక్కో రకమైన  ఉపాయం అవలంబించాల్సి వచ్చింది. అందరికీ ఒకే మంత్రం పనికి రాలేదు.

రామోజీ ఫిల్మ్‌ సిటీ ఏర్పడేముందు అక్కడున్న భూములకు అనేకమంది యజమానులు. వారందరికీ ఒకే రేటు యిచ్చారని, ఒకే టర్మ్‌స్‌ మాట్లాడుకున్నారని అనుకోలేం. కొంతమంది సంస్థానాధీశులు సులభంగా లొంగిపోతే, జునాగఢ్‌, హైదరాబాదు, కశ్మీర్‌ మరి కొంతమంది యిబ్బంది పెట్టారు. అందువలన వాళ్లకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు యిచ్చారు. ఉదాహరణకి నిజాంకు రాజప్రముఖ్‌ పదవి యిచ్చారు. మాజీ రాజులందరికీ యివ్వలేదా పదవి. 

కశ్మీర్‌ రాజు హరి సింగ్‌ విలీనానికి ఓ పట్టాన ఒప్పుకోలేదు. స్వతంత్ర రాజ్యంగానే ఉంటానన్నాడు. పటేల్‌ పోతే పోనీ అన్నాడు. అలా అయితే అది కూడా ఏ భూటాన్‌లాగానో, నేపాల్‌ లాగానో పొరుగుదేశంగా ఉంటూ ఏ గొడవా లేకుండా ఉండేది. కానీ నెహ్రూ కశ్మీర్‌ కలిపి తీరాలని గట్టిగా అనుకున్నాడు. దాని కోసం హరి సింగ్‌ హిరణ్యాక్ష వరాలన్నీ తీర్చాడు. అదే పొరపాటైంది. చారిత్రాత్మిక తప్పిదమైంది.

నెహ్రూ నిర్ణయం వెనుక అతని కాబినెట్‌, ప్రభుత్వం, యావత్తు భారతప్రజల్లో మెజారిటీ ఉందని మర్చిపోకూడదు. (ఇప్పుడు మోదీ లాగ! ఇవాళ్టి రద్దు నిర్ణయం మరో తప్పిదమో, ఒప్పిదమో భవిష్యత్తు చెపుతుంది) అది నెహ్రూ సొంత ఒప్పందం కాదు. రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం. దాని ప్రకారమే కశ్మీర్‌కు అనేక ప్రత్యేక వసతులు ఏర్పడ్డాయి. ఇప్పుడా ఒప్పందాన్ని ఏకపక్షంగా కాలరాయడం ఒప్పుతుందా లేదా అన్నది కోర్టులు తేల్చాలి. విషయం అంతర్జాతీయ కోర్టుకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే కశ్మీర్‌ అంతర్జాతీయ వేదిక మీద నలుగుతున్న అంశం. అది కూడా నెహ్రూ పొరపాటే. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ప్రమేయంపై కృష్ణ మీనన్‌ సలహా మేరకు యుఎన్‌ఓలో ఫిర్యాదు చేయడం జరిగింది.  దాంతో యితర దేశాలు కూడా దీనిపై తీర్పు యిచ్చేందుకు అవకాశం కలిగింది. అనేక దేశాలు తమ మ్యాప్‌లలో కశ్మీర్‌ను భారత్‌లో భాగంగా చూపటం లేదు. వివాదగ్రస్త భూభాగంగానే చూపుతున్నాయి. ఇప్పుడు భారత్‌ చేపట్టిన దుందుడుకు చర్యపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఆంగ్లేయుల పాలనలో ఉన్నపుడు విదేశాలకు వెళ్లిన భారతీయులు ఆంగ్లేయుల వలస పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, సభ్యసమాజం దృష్టిని ఆకర్షించేవారు. ఖలిస్తాన్‌ ఉద్యమకారులు విదేశభూమిపై కూడా ఆందోళనలు చేశారు, అలాగే ఎల్‌టిటిఇ వారు శ్రీలంక ప్రభుత్వవిధానానికి వ్యతిరేకంగా విదేశాల్లో పోరాడుతూ అక్కడ ఆశ్రయం పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీయులు తమకు అన్యాయం జరిగిందని గొడవ చేయవచ్చు. 

ఇంతకీ హరి సింగ్‌తో అలాటి దిక్కుమాలిన ఒప్పందం ఎందుకు చేసుకోవలసి వచ్చింది? నిజాంతో అలాటి ఒప్పందం అవసరం ఎందుకు పడలేదు? దీనికి సమాధానం సింపుల్‌ - హైదరాబాదు ప్రజలు భారత్‌తో విలీనానికి సుముఖులు. అందువలన నిజాంకు గతి లేకపోయింది. కశ్మీరు ప్రజలు భారత్‌తో విలీనానికి విముఖులు. అందువలన హరి సింగ్‌ అనేక షరతులతో కూడిన ఒప్పందం ముందు పెట్టినా భారత్‌ ఒప్పుకోవలసి వచ్చింది.

'భారత్‌తో విలీనం కాదిది, కాన్ఫెడరేషన్‌ వంటి జస్ట్‌ ఒక ఏర్పాటు మాత్రమే' అని హరి సింగ్‌ కశ్మీరీయులకు చూపించవలసి వచ్చింది. అందుకే ప్రత్యేక పతాకం, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి అనే పేరు, ప్రత్యేక చట్టం.. వగైరా వగైరా. ఆ విధంగా కశ్మీర్‌లో భారత్‌లో యిప్పటిదాకా సంపూర్ణ విలీనం కాకుండా ఉండిపోయింది.

ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసి, విలీనం చేసేసుకుంటున్నారు. హరి సింగ్‌ ఒప్పందం చేసుకునే సమయానికి భారత్‌లో విలీనం కావడానికి యిచ్చగించని కశ్మీరీయులు యీ 72 ఏళ్లలో మనసు మార్చుకుని భారత్‌తో విలీనానికి సుముఖంగా ఉన్నారా అనేదే ముఖ్యమైన ప్రశ్న. వాళ్లు అంగీకరిస్తే యివాళ్టి చర్య సమంజసమౌతుంది. వ్యతిరేకిస్తే అసమంజస మౌతుంది.

ఇవాళ 'కశ్మీర్‌లో ఎవరైనా భూమి కొనవచ్చు' అంటూ మాట్లాడుతున్నారు. అక్కడి ప్రజల గురించి మాట్లాడటం లేదు. రద్దు గురించి, రాష్ట్ర విభజన గురించి వాళ్లను విశ్వాసంలోకి తీసుకోలేదు. రాజకీయ నాయకులతో మాట్లాడితే సరిపోదు, సాధారణ ప్రజలతో కూడిన సంస్థలు, సమాజాలు ఉంటాయి. వాటితో చర్చలు జరిపి, వారి మనోభీష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇదే ఆందోళన కలిగించే అంశం. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2019)
[email protected]