ఎమ్బీయస్‌: కశ్మీరులో ప్లెబిసైటు ఎందుకు నిర్వహించలేదు?

ఊహించినట్లుగానే నాపై చాలామంది విరుచుకుపడ్డారు. సబ్జక్టు లేని వాళ్లే దూషణలకు దిగుతారు. వాటిని పక్కకుపెట్టి సందేహాలు వ్యక్తం చేసినవారికి సమాధానాలిచ్చి ఆర్టికల్‌లోకి వెళతాను. ఆంగ్లేయులు వచ్చే ముందు భారత్‌ ఒకే దేశంగా లేదని నేనంటే చాలామంది నొచ్చుకున్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండికా, భారత్‌.. మాటలు ఎలా వచ్చాయి అని లాజిక్‌ లాగారు. అమెరికా అంటాం, ఆఫ్రికా అంటాం, అంత మాత్రాన అవి ఒకే దేశాలా? మనది భరతఖండం. భరతవర్షం. పాతకాలంలో అంగ, వంగ, కళింగ అంటూ ఛప్పన్న దేశాలుండేవి. అయోధ్య రాకుమారుడు, మిథిలా రాకుమారిని పెళ్లాడాడు. కురుక్షేత్రంలో పాల్గొన్న రాజుల పేర్లు తిరగవేయండి, ఎంతమంది రాజులున్నారో తెలుస్తుంది. ఎవరి గొడుగు వాళ్లదే.

మనది యూరోప్‌ వంటి ఉపఖండం. అబ్బే, కాదు, దీన్ని ఒకే రాజు పాలించాడు అంటే ఆ రాజెవరో చెప్పండి. ఆ కాలంనాటి మ్యాప్‌ పంపండి. పెద్ద సామ్రాజ్యం పాలించిన ఔరంగజేబు కాలంలో సైతం దక్షిణ భారతం, మరాఠా అతని అదుపులో లేవు. రాకపోకలున్నంత మాత్రాన, సంస్కృతి ఒకటే అయినంత మాత్రాన ఒకే దేశం అయిపోదు. 2) 'ఎందుకు ఆహ్వానిస్తారండీ, వాళ్లు పాకిస్తానంటే పడిచచ్చే రకం. ఈ దెబ్బతో బుద్ధి వస్తుంది' అంటారా, యిదన్నమాట సాటి 'భారత'పౌరులపై మీ 'ప్రేమ'! - అని నేను రాస్తే పాకిస్తానంటే పడిచచ్చే వాళ్లను ప్రేమించాలా? అని ఒకరు రాశారు. అది కోట్స్‌లో ఉందని గమనించి ఉండరు. మనకు కశ్మీరీయులపై ఉన్న జనరల్‌ అభిప్రాయాన్ని కోట్స్‌లో రాశాను. 3) ఇక పండిట్ల గురించి చాలామంది రాశారు. కాస్త ఓపిక పడితే వారి ప్రస్తావనా వస్తుంది.

4) సైన్యాన్ని, ఉగ్రవాదులను ఒకేగాట కట్టేరేమిటని ఒకరు ఆశ్చర్యపడ్డారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సాధారణ జనాన్ని అడిగితే చెప్తారు - ఆ కష్టాలు ఎలాటివో! మావోయిస్టులు వచ్చి అన్నం పెట్టమంటారు, పెడితే పోలీసులు వచ్చి తంతారు, పెట్టం అంటే కాలుస్తామంటారు. వెళ్లిపోతూపోతూ మా గురించి ఏమైనా చెప్పావో కాలో, చెయ్యో తీసేస్తాం అంటారు. వెంటవెంటనే పోలీసులు వస్తారు. మావోయిస్టులు ఎటు వెళ్లారో చెప్పమంటారు, లేకపోతే నువ్వే మావోయిస్టు వని నేరం ఆరోపించి జైల్లో తోస్తామంటారు. ఇద్దరి మధ్య సామాన్యులు నలుగుతారు. దయాదాక్షిణ్యరాహిత్యంలో సైన్యం, ఉగ్రవాదం ఒక్కటే. ఎటొచ్చీ ఒకరు ప్రభుత్వపక్షాన పనిచేస్తారు, మరొకరు వ్యతిరేకంగా పనిచేస్తారు.

ఒకాయన 1981లో పంజాబ్‌ వెళ్లమంటే భయపడేవాణ్ని, ఇప్పుడైతే వెళతాను అన్నారు. అక్కణ్నుంచే మొదలుపెడతాను. 1981లో ఖలిస్తాన్‌ ఉద్యమం నడిచింది. శిఖ్కులు తమకు వేరే దేశం కావాలని ఆందోళన చేశారు. విదేశాలలో ఉన్న శిఖ్కుల సాయంతో పంజాబ్‌ అగ్నిగుండమైంది. కొద్దికాలానికి చల్లారింది. ఎలా? 1971లో మనం పాకిస్తాన్‌ వ్యవహారాల్లో కెలికి, వాళ్లను రెండు ముక్కలుగా చేసిన దగ్గర్నుంచి పాక్‌ మనపై పగబట్టి, మనల్నీ ముక్కలు చేద్దామని ప్రయత్నిస్తూ వచ్చింది. ఖలిస్తాన్‌ ఉద్యమానికి పాకిస్తాన్‌ అండ పూర్తిగా ఉంది. అయినా అది విఫలమైంది. ఎందువలన? ఎందుకంటే ప్రజలల్లో చాలామంది భారత్‌ పక్షాన ఉన్నారు! బంగ్లాదేశ్‌ ఆవిర్భావం ఎందుకు సాధ్యపడింది? తూర్పు పాకిస్తానీయులు భారత్‌ను ఆదరించారు కాబట్టి! ఎమర్జన్సీ సమయంలో ఇందిరాగాంధీ సిక్కింను ఆక్రమించింది. అక్కడ తిరుగుబాటు రాలేదు. ఎందువలన? సిక్కిం ప్రజలు ఆమోదించారు కనుక!

ఇన్ని చేసిన ఇందిర కశ్మీర్‌ జోలికిపోలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, అక్కడ తమకు ప్రజాబలం లేదని. ఈరోజు మోదీ చేసిన దుస్సాహసం నెహ్రూ కూడా గతంలో ఓ మేరకు చేసి విఫలమయ్యాడు. ఇవన్నీ తెలిసి మోదీ తను 56 అంగుళాల ఛాతీ ఉన్న వాడినని చూపుకోవడానికి యివాళ దీనికి ఒడిగట్టాడు. దీన్నే జింగోయిజం అంటారు. ఇందిర హఠాత్తుగా బ్యాంకుల జాతీయకరణ చేసింది కదా అనుకుని తనూ హఠాత్తుగా నోట్ల రద్దు చేశాడు. ఇప్పుడు దాని గురించి బిజెపి వాళ్లు కూడా గొప్పలు చెప్పుకోవటం లేదు. అలాగే జిఎస్‌టి ప్రకటించినపుడు ఎంత ఆర్భాటం చేశారు! ఇప్పడిదాకా సవరణలు జరుగుతూనే ఉన్నాయి, గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ కుదుటబడలేదు. ఈ చర్య చేపట్టేముందు కశ్మీర్‌ లోయలో కూడా ఆరెస్సెస్‌ కార్యకర్తలు వ్యాపించి, వారిని భారత్‌కు సుముఖంగా మార్చి ఉంటే యిది విజయవంతమయే అవకాశాలు ఉండేవి.

ఒకప్పుడు బిజెపికి చొరలేని కీకారణ్యాలుగా ఉన్న ఈశాన్య ప్రాంతాలు, త్రిపుర వంటి కమ్యూనిస్టు కంచుకోటలు, వివిధ రాష్ట్రాలలో ఉన్న అటవీ ప్రాంతాలు అన్నిటిలో యీ రోజు బిజెపి చొచ్చుకుపోతోందంటే దానికి కారణం - అక్కడ ఆరెస్సెస్‌ వివిధ సంస్థల పేరుతో చేపట్టిన కార్యకలాపాలు. గుడ్‌విల్‌ పెంచుకుని, ప్రజలను ఒక రకంగా కలిపి, మరో రకంగా విడగొట్టి, ఓటు బ్యాంకు తయారుచేసి పెట్టారు కాబట్టే బిజెపి నెగ్గుకు వస్తోంది. కశ్మీరు లోయలో యిలాటి పని జరిగినట్లు మీడియాలో రాలేదు. అందుకే కశ్మీరులో స్మశానమౌనం రాజ్యమేలుతోంది. లద్దాఖ్‌, జమ్మూలలో సంబరాలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. అవి కల్లోల ప్రాంతాలు కావు. గొడవంతా కశ్మీరు లోయలోనే. అది అదుపులోకి వస్తుందా లేదా అన్నదే వేచిచూడాలి.

ప్రస్తుతానికైతే విపరీతంగా సైన్యాన్ని దింపి, కమ్యూనికేషన్‌ బంద్‌ చేసి, కర్ప్యూ పెట్టేసి, మాజీ ముఖ్యమంత్రిని ఖైదు చేసి, నాయకులను అదుపులోకి తీసుకుని, దాన్ని ఒక మిలటరీ జోన్‌లా మార్చివేశారు. అక్కడ ఏ వేడుకలూ లేవు. ఇన్నాళ్లకు భారత్‌లో పూర్తిగా విలీనమయ్యాం అంటూ నృత్యాలు లేవు, హర్షధ్వానాలు లేవు. ఈ 370 పీడ వదిలిపోయిందని కశ్మీరీ ప్రజలు అనుకుంటూ ఉంటే టీవీ మైకుల ముందుకు వచ్చి ఆ విషయాన్ని చప్పట్ల మధ్య చెప్పి వుండేవారు. అంతా నివురు కప్పిన నిప్పులా ఉంది. ఇది యిలా వుంటుందని ఊహించే అమరనాథ్‌ యాత్ర రద్దు చేశారు. శ్రీనగర్‌లోని విద్యాలయాల నుంచి యితర ప్రాంతాల వారిని వెనక్కి పంపేశారు. తిరుగుబాటు దారులు, మిలటరీకి మధ్య జరిగే కాల్పులలో పోతే కశ్మీరీయులు పోవచ్చు తప్ప బయటివాళ్లు పోకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నారు.

కశ్మీరు మన దేశంలో అంతర్భాగం అని అనాల్సింది కశ్మీరీయులు కానీ మనం కాదు అన్న మాట చాలా మందికి జీర్ణం కాలేదు. వాళ్ల గురించి నిర్ణయం తీసుకోవడానికి వాళ్లెవరు? మనమే డిసైడ్‌ చేయాలి అనే ధోరణిలో మాట్లాడారు. మనిషి కావలసినది స్వేచ్ఛ. ఎన్ని సౌకర్యాలు కల్పించినా, మనిషి స్వాతంత్య్రం కోసం అలమటిస్తాడు. అందుకే రష్యాతో సహా కమ్యూనిస్టు బ్లాక్‌ అంతా విచ్ఛిన్నమైంది. చైనాలో ఎంత ఆర్థికప్రగతి ఉన్నా, స్వేచ్ఛ కోసం తపించేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నాయకత్వం నీరసించగానే, వాళ్లు తిరగబడతారు. రష్యాలో స్టాలిన్‌ వివిధ ప్రాంతాలను కలిపి వేసి, ఒకరి మీద మరొకరు ఆధారపడే రిపబ్లిక్‌ ఏర్పరచాడు. కానీ ఏమైంది? కమ్యూనిజం బలహీనపడగానే ప్రాంతాలన్నీ విడిపోయాయి. పరస్పరం కలహించుకుంటున్నాయి.

1956లో జరిగిన పెళ్లి బలవంతపు పెళ్లి అని అర్ధశతాబ్ది తర్వాత తెలంగాణ ఉద్యమనాయకులు  పేచీ పెట్టారు. ఆంధ్రులు కలిసి వుందామన్నారు. భార్యాభర్తల్లో ఒకరు కోరినా విడాకులు యివ్వాల్సిందే అంటూ రాష్ట్రవిభజన చేశారు. ఇక భారత్‌కు, కశ్మీరుకు జరిగిన పెళ్లి గురించి చెప్పాలంటే అక్కడ కన్య అస్సలు యిష్టపడటం లేదు. అందువలన ఓలి యింత యిస్తాం, అది చేస్తాం, యిది చేస్తాం అంటూ వరుడు ఆఫర్లు యిచ్చాడు. అవే ఆర్టికల్‌ 370, ద్వంద్వ పౌరసత్వం వగైరా వగైరా. ఇప్పుడు అవేమీ లేదు అంటూ మొండి చెయ్యి చూపిస్తున్నాడు. దీనికి ఆ కన్య ఎలా స్పందిస్తుందో తెలియదు. ఇన్నాళ్లూ మనసు పెట్టి కాపురం చేయలేదు కాబట్టి 'నువ్వూ అక్కరలేదు, నీ ఓలీ అక్కరలేదు, నా మానాన నన్ను బతకనిస్తే చాలు' అంటుందేమో చూడాలి. ఇష్టం లేని భార్యను మురిపించడానికి ఎన్ని నగలు తెచ్చినా ప్రయోజనం లేనట్లే, ఈ 72 ఏళ్లలో కశ్మీర్‌ను మనకు అనుకూలంగా చేసుకోలేక పోయాము.

ఇప్పుడు గణాంకాలు వస్తున్నాయి. సగటు భారతీయుడిపై రూ. 8 వేలు ఖర్చుపెడితే, కశ్మీరీయుడిపై రూ.27 వేలు ఖర్చు పెడుతున్నామట! దశాబ్దాలుగా కోట్లు కుమ్మరించామని లెక్కలున్నాయి. మరి అంత ఖర్చు పెడితే అక్కడ మౌలిక వసతులకు కరువెందుకు? అక్షరాస్యతలో, వైద్యసదుపాయాల్లో, సమస్త హ్యూమన్‌ యిండికేటర్స్‌లో అంత అధమస్థానం దేనికి? అంటే సైన్యం మీద పెట్టిన ఖర్చు కూడా దీనిలో కలిపి చెప్తున్నారా? ఇంతకీ నా మీద యింత ఖర్చు పెట్టి నన్ను మేన్‌టేన్‌ చేయండి అని కశ్మీరీయుడు అడిగాడా? స్వభావసిద్ధంగా కశ్మీరీయులు ముష్టెత్తరు. ఇన్ని నిధులు యిస్తేనే తప్ప మీతో కలిసి వుండం అని చెప్పలేదు. మనమే వాళ్ల నోట్లో బలవంతంగా తిండి కుక్కి, 'మా ఉప్పు తిన్నావ్‌, ఆ మాత్రం విశ్వాసం ఉండనక్కరలేదా?' అని కోప్పడుతున్నాం.

కశ్మీరు లోయలో ఉన్నవాళ్లంతా పాకిస్తాన్‌ సానుభూతిపరులు అని చాలామంది నమ్ముతారు. అది తప్పు. సగటు కశ్మీరీయుడు తను కశ్మీరీ అనుకుంటాడు తప్ప భారతీయుడననో, పాకిస్తానీ అనో అనుకోడు. ఎవరితో కలవకుండా విడిగా స్వతంత్ర రాజ్యంగా ఉందామనే అనుకుంటాడు. 1980లో నేను కశ్మీరు వెళ్లినపుడు ఇండో-కశ్మీరు ట్రేడర్స్‌ వంటి బోర్డులు చూసి తెల్లబోయాను. ఇండో-జపాన్‌.. వంటి బోర్డులు చూస్తాం కానీ, ఇండో-తెలంగాణ.. వంటివి ఊహించగలమా? మాది కశ్మీరు, ఇండియా పొరుగు దేశం అనే భావనలోనే ఆ బోర్డులున్నాయి. మనుషులతో మాట్లాడినా వాళ్లు అదే వ్యక్తం చేశారు. మేం భారతీయులం కాము అని కశ్మీరీయులు అంటే మనకు ఉవ్వెత్తున కోపం వస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమసమయంలో కెసియార్‌ అనలేదా? - తెలుగుతల్లి దయ్యం, మాకు తెలంగాణ తల్లి ఉంది అని. ఆంధ్ర పదం తెలుగుకి సమానార్థకంగా చెల్లింది యిన్నాళ్లూ. ఇప్పుడు కెసియార్‌ మేం ఆంధ్రులం కాదు పొమ్మన్నారు. ఏం చేశాం? రెండోసారి పట్టం కట్టి సన్మానించాం!

కశ్మీరు వాళ్లకు జమ్మూతో కలవడం కూడా యిష్టం లేదు. జమ్మూ, కశ్మీరు మానసికంగా ఎన్నడూ కలిసి లేవు. నేను కదిలించినప్పుడు ఒకళ్ల మీద మరొకళ్లు నేరాలు చెప్పుకున్నారు. నాకు పనసకాయల బస్తా గుర్తుకు వచ్చింది. కందుల బస్తా అయితే కుదిమట్టంగా ఉంటుంది. రెండు పెద్ద పనసకాయలు, ఓ గోనెసంచెలో వేసి తెస్తూ ఉంటే మోయడం కష్టం. పనసకాయలకున్న ముళ్లు ఒకదానితో మరొకటి కలవనీయవు. సంస్కృతిపరంగా, మతపరంగా, భాషపరంగా యిద్దరి పద్ధతీ వేరు. లద్దాఖ్‌ గురించి నేను విశేషంగా రాయటం లేదు. ఎందుకంటే అక్కడున్నది మూడు లక్షల మంది మాత్రమే. వాళ్ల భాష వేరు. వాళ్లు జమ్మూ వాళ్లతో కానీ, కశ్మీరు వాళ్లతో కానీ కలుస్తారని అనుకోను. అందువలన ఫోకసంతా జమ్మూ, కశ్మీరు మీదనే ఉంది. కశ్మీరులో ముస్లిములు ఎక్కువ, కశ్మీరీ, ఉర్దూ భాషలు మాట్లాడతారు. జమ్మూలో హిందువులు ఎక్కువ, డోగ్రీ, హిందీ వగైరా మాట్లాడతారు. 1947 దేశవిభజన తర్వాత పంజాబ్‌ నుంచి శరణార్థులు వచ్చి పడి, డోగ్రీల శాతాన్ని గణనీయంగా తగ్గించివేశారు. ఈ పంజాబీ కల్చర్‌ కశ్మీరీయులకు అస్సలు పడదు.

జమ్మూ మన దేశంలోని యితర ప్రాంతాల్లానే ఉంటుంది. అందువలన భారత్‌లో విలీనం కావడానికి వారికి ఏ అభ్యంతరమూ ఉండదు. వచ్చిన చిక్కల్లా కశ్మీరు లోయలోని వాళ్లతోనే! స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది వాళ్లే. నేను చెప్పినది మీరు నమ్మకపోవచ్చు. అబ్బే, వాళ్లంతా భారత్‌లో విలీనం కావాలని తహతహ లాడుతున్నారని మీరు చెప్తే నేను నమ్మకపోవచ్చు. వాళ్ల ఉద్దేశ్యం తెలుసుకునే సాధనమేమిటి? ప్రజాభిప్రాయ సేకరణ. ప్లెబిసైట్‌! దీన్ని ఎవరూ కాదనలేరు కదా. తెలంగాణ విడిపోవాలనే డిమాండ్‌ ఎంత బలంగా ఉంది అనేది తెరాస గెలిచిన సీట్ల బట్టి లెక్క వేసేవాళ్లం. బళ్లారి ఊరిని ఆంధ్రలో కలపాలా, కర్ణాటకలో కలపాలా అని ప్లెబిసైట్‌ పెట్టారట!

ఇలాటి వాటికే పెట్టినపుడు కశ్మీరులో ప్లెబిసైట్‌ నిర్వహించి, వాళ్లు ఎటు ఉందామనుకున్నారో కనుక్కుని అటే ఉండనిస్తే గొడవ వదిలిపోతుంది. అంతర్జాతీయ సమాజం సందేహాలూ తీర్చినట్లు ఉంటుంది. ప్లెబిసైట్‌ కోసం ప్లెబిసైట్‌ ఫ్రంట్‌ ఏర్పడి ఎప్పణ్నుంచో డిమాండ్‌ చేస్తూ వచ్చినా, అంతర్జాతీయ సమాజం సలహా యిస్తూ ఉన్నా భారత ప్రభుత్వం ఎన్నడూ ఆ సాహసం చేయలేదు. ఈ రోజు నిర్వహిస్తే ఉగ్రవాదుల ప్రభావానికి లోనై భారత్‌ నుండి విడిపోతా మంటారు అని వాదిస్తారేమో, 1947 నుండి యీ డిమాండు ఉంది. అప్పణ్నుంచి భారత్‌ తిరస్కరిస్తూనే ఉంది. అక్కడే మన లొసుగు బయటపడింది. మనం కశ్మీరును చేసుకున్నది రాక్షస వివాహం! కన్య యిష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా తాళి కట్టేసి, అది చూపించి కట్టడి చేద్దామనుకుంటున్నాం. అందుకే కశ్మీరు సమస్య అంత జటిలంగా మారింది. (సశేషం)
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: కశ్మీర్‌ కైవసం - ఓ దుస్సాహసం

Show comments