తమ్మినేని మాటలతో వల్లభనేనికి ఊరట!

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీమోహన్‌పై అనర్హత వేటు లేనట్టే ప్రజలు భావిస్తున్నారు.

స్పీకరు తమ్మినేని సీతారాం చెప్పిన తాజా మాటలు గమనిస్తే.. వంశీకి అలాంటి ఉపద్రవం ఏమీ పొంచి లేదని అర్థమవుతుంది.

తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసినప్పటికీ.. ఎమ్మెల్యే పదవికి ఎలాంటి ధోకా ఉండకపోవచ్చు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించే అవకాశం ఉందని తమ్మినేని స్వయంగా చెబుతున్నారు.

వల్లభనేని వంశీ కొన్నిరోజుల కిందట మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన రెడ్డి ప్రభుత్వానికి తాను మద్దతిస్తానని  ప్రకటించారు. అంతకు కొన్ని రోజుల ముందే ఆయన పార్టీకి చేసిన రాజీనామాను ఆపి, రాయాబారాలు సాగించిన చంద్రబాబునాయుడు, ఆ వెంటనే పార్టీనుంచి సస్పెండ్ చేశారు.

ఆయన మాటలనే ఆధారాలుగా వాడుకుంటూ ఆయన మీద అనర్హత వేటువేయించగల అవకాశాలను పరిశీలిస్తూనే, ఆయన పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ తమ పార్టీ భావజాలానికి సంబంధం లేని డిమాండును కూడా ప్రకటించారు.

అదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీని వీడినందుకు వల్లభనేని వంశీపై వేటు పడుతుందా లేదా అనే సస్పెన్స్ కొందరిలో కొనసాగింది. అయితే సాక్షాత్తూ స్పీకరు మాటలను బట్టి ప్రస్తుతానికి అలాంటి ప్రమాదమేమీ లేదని అనుకోవచ్చు.

‘‘ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మార దలచుకుంటే ఖచ్చితంగా తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని, అలా చేయకపోతే అనర్హత వేటు పడుతుందని’’ స్పీకరు తమ్మినేని సీతారాం తేల్చి చెప్పారు.

వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వానికి మద్దతిస్తానని విలేకర్ల సమావేశంలోనే చెప్పారు. ఆయన వ్యవహారం ‘మద్దతు’ అనే పదానికి పరిమితం అయినంతవరకు వేటు పడే ప్రమాదం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఒక అడుగు ముందుకేసి.. వైకాపాలో చేరడం, పార్టీ కండువా కప్పించుకోవడం జరిగితే గనుక.. అది ఫిరాయింపు కిందికి వస్తుందని.. అలాంటప్పుడు మాత్రమే వేటుపడవచ్చునని ఆ విశ్లేషణల సారాంశం.

సో, జగన్ ప్రభుత్వంలో ఎంతగా మమేకం అయిపోయినా.. సాంకేతికంగా పార్టీలో చేరనంత వరకు వల్లభనేని వంశీకి ఇబ్బంది లేనట్టే!!