బుద్ధిగా వైసీపీలో ఉండుంటే.. ఇప్పుడు టికెట్లు దక్కేవి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్లు ఎంత పొరపాటు చేశారో ఇప్పుడు వారికే అర్థమై ఉంటుంది. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే వారు ఉండి ఉంటే.. ఏదో ఏడాది, రెండేళ్ల గురించి ఆలోచించకుండా తమ రాజకీయ భవితవ్యం గురించి ఆలోచించి ఉంటే.. పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదేమో. వైఎస్సార్సీపీని వీడారు.. ఇప్పుడు మళ్లీ వచ్చారు. అయితే కొంతకాలం కోసం వీరు చేసిన ఫిరాయింపు.. ఇప్పుడు మళ్లీ వాళ్లకు అవకాశాలు లేకుండా చేస్తోంది. ఆ నేతలు గురునాథ్ రెడ్డి, బుట్టా రేణుకలు.

గురునాథ్ రెడ్డి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు వైసీపీలో కొనసాగారు. జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీ నుంచి కన్ను గీటడంతో గురునాథ్ రెడ్డి ఆ పార్టీలోకి వెళ్లినట్టుగా ప్రచారం జరిగింది.

తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గురునాథ్ రెడ్డి అనంతపురం టికెట్ కానీ, రాయదుర్గం నుంచి కానీ పోటీ చేయాలని ఆశించాడని అంటారు. ఆ రెండూ కుదిరేలా లేవని ఆయన మొదట్లోనే అర్థం చేసుకుని తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

అయితే ఇలా బయటకు వెళ్లి వచ్చినందుకు ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసే మంచి అవకాశాన్ని కోల్పోయారు. వైసీపీలోనే ఉన్నా ఆయనకు ఇప్పుడు పోటీ చేసే అవకాశం లభించడం లేదు. కాస్త అటూ ఇటూగా.. బుట్టా రేణుకది కూడా ఇదే పరిస్తితి. ఈమె గనుక స్ట్రిక్ట్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే.. ఈమెకు ఇప్పుడు కర్నూలు ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉండేవి. 

తెలుగుదేశం పార్టీ నుంచి కోట్ల పోటీచేసినా.. ఈమెకు వైసీపీ టికెట్ దాదాపుగా దక్కేదే. అయితే తెలుగుదేశం వైపు వెళ్లడం బుట్టారేణుక కెరీర్ కు అన్ని దారులూ మూసుకుపోయేలా చేసింది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా ఈమెకు టికెట్ దక్కే అవకాశాలు మాత్రం లేనట్టే!

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

Show comments