రెడ్డీస్‌ పోస్ట్‌మార్టమ్‌: ఈ పాపం ఎవరిది.?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోవడం చాలామందికి షాక్‌. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీని సైతం ఎదిరించిన వ్యక్తి ఆయన. తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కొంత సానుకూల ధోరణి వుండేది. పీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీపడ్డారు.. ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశముందంటూ ఆయన పేరు వార్తల్లోకెక్కింది. కానీ, ఓటమి చవిచూశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన అనుచరులు, సన్నిహితులు షాక్‌ అవడం సంగతెలా వున్నా, రాజకీయ ప్రత్యర్థులకీ కోమటిరెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే.

ఇక, రేవంత్‌రెడ్డి గురించి కొత్తగా చెప్పేదేముంది.? పోలింగ్‌కి కొద్దిరోజుల ముందు కొడంగల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభను అడ్డుకుంటానని పిలుపునిచ్చి, ఆయన నానా యాగీ చేశారు. ఆ యాగీ కారణంగా, ఆయన అరెస్ట్‌ అయ్యారు కూడా. భార్య, కుమార్తె.. మీడియాకెక్కారు, సింపతీ కోసం ప్రయత్నించారు. 'ఎలాగైనా రేవంత్‌రెడ్డి గెలిచేస్తాడు..' అనేస్థాయి నుంచి, 'బంపర్‌ మెజార్టీ ఖాయం' అనే స్థాయికి ఆ ఎపిసోడ్‌ తీసుకెళ్ళింది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌, కొడంగల్‌ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. కొడంగల్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రలోభాల పర్వం నడిచింది అధికార పార్టీ నుంచి. కాంగ్రెస్‌ తక్కువేమీ తినలేదు. చంద్రబాబు సైతం ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ, రేవంత్‌రెడ్డి ఓటమి తప్పలేదు. ఓటమి ఖరారయ్యాక రేవంత్‌రెడ్డి ఎంతలా డీలాపడిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జానారెడ్డి సహా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలామంది ప్రముఖులు ఓటమి పాలయ్యారు. జానారెడ్డి ఓడిపోతారని ఎన్నికల ప్రచార సరళిని బట్టే అర్థమయిపోయిందనుకోండి.. అది వేరే విషయం. జీవన్‌రెడ్డి విషయంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. జగ్గారెడ్డి ఓడిపోతారని అంతా అనుకున్నారుగానీ, అనూహ్యంగా ఆయన గట్టెక్కేశారు.

ఈసారెలాగైనా అధికారం దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్‌ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫలితాలు మింగుడుపడవు. విజయశాంతి ప్రచారంలో చాలా కష్టపడ్డారుగానీ, సోనియా సభకు సంబంధించిన ఫ్లెక్సీ డిజైన్‌లో తన ఫొటో లేకపోవడం గురించి ఆమె రియాక్ట్‌ అయిన తీరు సైతం కాంగ్రెస్‌ పార్టీ ఇమేజ్‌ని చాలావరకు డ్యామేజ్‌ చేసేసింది.

'నేనే ముఖ్యమంత్రిని.. కాదు కాదు నేనే ముఖ్యమంత్రిని..' అంటూ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి పీఠం గురించి కొట్టుకోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, టిక్కెట్ల పంచాయితీ.. ఇలా ఒకటేమిటి, కాంగ్రెస్‌ ఓటమికి చాలా కారణాలున్నాయి.

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సతీమణికి టిక్కెట్‌ ఇవ్వడంపై చాలా గందరగోళం నడిచింది కాంగ్రెస్‌ పార్టీలో. కానీ, ఆయన సమర్థించుకున్నారు.. కానీ, భార్యను గెలిపించుకోలేకపోయారు. మొత్తమ్మీద.. పోస్ట్‌మార్టమ్‌ అంటూ జరగాల్సి వస్తే.. కాంగ్రెస్‌లో కొందరు 'రెడ్డీస్‌' పార్టీ ఓటమికి తమను తాము ఖచ్చితంగా నిందించుకోవాల్సి వస్తుంది.

Show comments