రెడ్డిగారూ.. ఓటమి అతి భయానకం.!

రాజకీయాల్లో గెలుపోటములు మామూలే. ఇప్పుడు ఓడితే, ఇంకోసారి గెలిచే ఛాన్స్‌ రావొచ్చు.. ఇప్పుడు గెలిస్తే, ఇంకోసారి ఓటమి ఎదురవక తప్పదేమో. కానీ, తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నం. 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?' అన్న భావనతో చాలామంది రాజకీయ ప్రముఖులున్నారు. ఇందులో కాంగ్రెస్‌ నుంచే అత్యధికులు వున్నారు.

ఒకరా.? ఇద్దరా.? ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి ఓటమి తప్పేలా లేదు. ఆల్రెడీ జీవన్‌రెడ్డి వికెట్‌ డౌన్‌ అయిపోయింది. జీవన్‌రెడ్డి ఏంటి.? ముఖ్యమంత్రి అభ్యర్థి ఏంటి.? అంటే, కాంగ్రెస్‌లో అంతే. అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. అందుకే, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఎప్పటికీ పుంజుకునే పరిస్థితి వుండదు. ఒకవేళ ఎవరైనా కాస్త పైకెదిగేందుకు ప్రయత్నిస్తే, కిందికి లాగేందుకు పదిమంది కన్పిస్తారు.

పొన్నాల లక్ష్మయ్యనే తీసుకుంటే, ఈయన సీనియర్‌ పొలిటీషియన్‌. పీసీసీ అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, అదంతా గతం. జనగామ టిక్కెట్‌ కోసం 'యుద్ధం' చేయాల్సి వచ్చింది. టిక్కెట్‌ కోసం చేసిన యుద్ధంలో నీరసించిపోయిన పొన్నాల, ఎలాగైతేనేం టిక్కెట్‌ సంపాదించారుగానీ.. నియోజకవర్గంలో ప్రచారం విషయమై చేతులెత్తేయాల్సి వచ్చింది.

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? అన్నదానిపై కాస్సేపట్లో స్పష్టత వచ్చేస్తుంది. కానీ, ఓడితే ప్రముఖుల పరిస్థితి ఏంట.? రేవంత్‌రెడ్డి కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. కాంగ్రెస్‌లో మీసం మెలేసినోళ్ళు.. 'కేసీఆర్‌ అంతు చూస్తాం..' అన్నోళ్ళూ చాలామందే వున్నారు.

బంపర్‌ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌, తిరిగి అధికారంలోకి వచ్చాక, 'కేసీఆర్‌ వ్యతిరేకులపై' రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగితే.! ఆ పరిస్థితి ఊహించడానికే భయానకం. ఈ విషయంలో అందరికన్నా పెద్ద టెన్షన్‌ కొడంగల్‌ కీలుగుర్రం రేవంత్‌రెడ్డిదే.!

పాపం, ఆయన ప్రస్తుతానికి రేసులో వెనకబడిపోయాడు. 'ఓడితే రాజకీయ సన్యాసం' అని చెప్పిన రేవంత్‌, అందుకు సిద్ధపడుతున్నట్టేనా.!

Show comments