‘కొన్ని కారణాలు’ అంటే, ఆయనలోని అత్యాశే

జనసేనాని పవన్ కల్యాణ్ నెమ్మదిగా నెమ్మదిగా మర్మం బయటపెడుతున్నారు. 2014లో భాజపా- తెలుగుదేశం లతో కలిసి ఉన్న మంచిరోజులను ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కలసి ఉండి జగన్‌ను ఓడించిన విజయాన్ని నెమరు వేసుకుంటున్నారు. తాము విడిపోవడం వల్ల మాత్రమే జగన్ అధికారంలోకి వచ్చేశాడని.. అపోహే అయినప్పటికీ.. అలా తలచుకుని బాధపడుతున్నారు. కీలకం ఏంటంటే... 2019లో ‘కొన్ని కారణాల’ వలన తెలుగుదేశాన్ని వ్యతిరేకించాం అని కూడా పవన్ అంటున్నారు.

ఇప్పుడు ఆయన అసలు పాయింటుకు వచ్చారు! కొన్ని కారణాలు అంటే ఏమిటి? ఇప్పటికీ తెలుగుదేశం, భాజపాలతో మానసికంగా ప్రేమానుబంధాల్ని కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ సరిగ్గా ఎన్నికలకు ముందు ఎందుకలా నటించారు? ‘కొన్నికారణాల’ వల్ల దూరం జరిగామని ఆయన అంటున్న నేపథ్యంలో ఆ కారణాలేమిటి? అనే అనుమానం ప్రజలకు వస్తోంది. ఆ కారణాలేమిటో ప్రజలు అనుకుంటున్న సంగతులూ అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి...

1) చంద్రబాబునాయుడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆ కూటమి గుర్తించింది. మోడీని వదిలించుకుంటే తనకు ఎడ్వాంటేజీ అని చంద్రబాబు భావించి ఎన్డీయేనుంచి బయటకు వచ్చారు. మోడీ మీద శరపరంపరగా విమర్శలు కురిపించారు. అనుకున్నంతగా అందువల్ల లాభం జరగడం లేదని తెలుసుకున్నారు. ప్రజలు తనను నమ్మడం లేదని గ్రహించారు. తన పాలన పట్ల వ్యతిరేక ఓటు ను చీల్చడానికి పవన్ ను ఒక పావుగా, అస్త్రంగా వాడుకున్నారు.

2) ప్రభుత్వ వ్యతిరేక ఓట చీలిపోవాలి. పవన్ కు తొలుత ఉన్న ఎజెండా అంశం అదొక్కటే. వ్యతిరేక ఓటును తాను గరిష్టంగా చీల్చగలిగితే.. వైకాపాకు పడగల ఓట్లు తగ్గుతాయని, తిరిగి తెదేపా అధికారంలోకి వస్తుందని ఆయన కలగన్నారు. కానీ అలా జరగలేదు.

3) మధ్యలో పవన్‌కు మరొక ఆశ పుట్టింది. కేవలం వ్యతిరేక ఓటును చీల్చి, చంద్రబాబుకు మళ్లీ సింహాసనం అప్పగించడం మాత్రమే కాదు... మరింత కష్టపడి పనిచేస్తే... తన పార్టీకి కూడా రెండంకెల్లో సీట్లు వస్తాయని ఆయన ఊహించారు. వైకాపా అప్పటికి చాలా బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇరు పార్టీలు సమానంగా సీట్లు సాధిస్తే.. తనకు దక్కే కొన్ని సీట్లు నిర్ణయాత్మకంగా మారుతాయని.. గ్రహాలు  అనుకూలిస్తే, కర్నాటక ఫార్ములాలో తాను ముఖ్యమంత్రి కూడా అయిపోవచ్చునని ఆయన  భ్రమపడ్డారు. కానీ ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా కూడా గెలిపించకుండా ఛీకొట్టి పంపారు.

ఈ కారణాలన్నీ పవన్ కు ఇప్పుడు గుర్తొస్తున్నట్లున్నాయి. ఆయన మాటల వల్ల ఈ కారణాలని ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. అంతిమంగా, పవన్ కల్యాణ్ ప్రజల్లో తన మాటల క్రెడిబిలిటీని కూడా కోల్పోతున్నారు.

Show comments