మంత్రిగారి మేకపోతు గాంభీర్యం

ఓవైపు నేతలంతా వైసీపీ వైపు వలస కడుతుంటే మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో చివరి రోజు వరకు చంద్రబాబుతోనే పనిచేస్తానంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు. ఎక్కువగా సినిమావాళ్లతో కనిపించే గంటా నోటి నుంచి సినిమా డైలాగులు రాక ఇంకేమొస్తాయి. సరే, ఈ విషయాన్ని పక్కనపెడితే ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు బాబుపై తన స్వామిభక్తిని చాటుకోవాల్సిన అవసరం గంటాకు ఏమొచ్చింది.

దాదాపు నెల రోజులుగా "గంటా గోడ దూకుతారు" అంటూ కథనాలు వస్తూనే ఉన్నాయి. ఏ నిమిషానైనా ఆయన భుజంపై ఉన్న కండువా కలర్ మారిపోవచ్చంటూ గాసిప్పులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మొన్నటివరకు తన అనుచర వర్గంతో ఇలాంటి పుకార్లను పెంచి పోషించిన గంటా ఇప్పుడు వాటికి చెక్ చెప్పారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ పాలిటిక్స్ లో ఉన్నంతకాలం చివరివరకు చంద్రబాబుతోనే అంటూ భారీ డైలాగ్ ఒకటి ట్వీట్ చేశారు.

నిజానికి గంటా శ్రీనివాసరావు పర్మెనెంట్ గా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్నించుకుంటే సమాధానం కోసం శూన్యంలోకి చూడాల్సి వస్తుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు, ఏ ఎన్నికలకు ఏ పార్టీ లీడ్ లో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవ్వడం గంటాకు వెన్నతో పెట్టిన విద్య. జంపింగ్ లో ఇంత అనుభవం ఉన్నప్పటికీ ఈసారి గోడ దూకనంటున్నారు మంత్రిగారు. దీనివెనక బలమైన కారణం ఉందనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన నిజం.

నిజానికి అందరికంటే ముందు గోడ దూకే రకం గంటా. కానీ ఈసారి ఆయన పప్పులుడకలేదు. రాష్ట్రంలో వైసీపీ గాలి బలంగా వీస్తోందని అందరికంటే ముందే పసిగట్టారాయన. ఆ మేరకు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు సంప్రదింపులు కూడా జరిపారు. కానీ గంటా ప్రతిపాదనకు జగన్ ససేమిరా అన్నారు. ఎలాంటి కండిషన్లు లేకుండా పార్టీలోకి రావాలని సూచించారు. కానీ గంటా మాత్రం తనతో పాటు మరో 2 టిక్కెట్లు ఆశించారు. దీంతో వైసీపీ తలుపులు మూసుకుపోయాయి.

ఇక చివరి ప్రయత్నంగా ఆయన జనసేన పార్టీని కూడా వదల్లేదు. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ టీడీపీ కంటే బెటరనే ఉద్దేశంతో గంటా ఆ దిశగా కూడా పావులు కదిపారు. కానీ అక్కడ కూడా ఆయనకు ఎదురుగాలే వీచింది. గంటాను చేర్చుకుంటే తనపై, తన పార్టీపై తీవ్ర విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో పవన్ గంటా చేరికను వ్యతిరేకించారట. దీంతో చేసేదేం లేక తన రాజకీయ జీవితం మొత్తం చంద్రబాబుకే అంకితం అంటూ ట్వీట్లు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు గంటా. అదీ సంగతి. 

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు