ఎమ్బీయస్‌: ఈ సర్వేలను ఎలా తీసుకోవాలి?

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రకరకాల సర్వేల ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల రెండు వచ్చాయి. ఇండియా టుడే వాళ్లది, సిఓటరు వాళ్లది. సర్వే ఫలితాలు తప్పవచ్చు అని తెలిసినా ఆసక్తిగా చూస్తాం. కొంతమంది వాటి ఆధారంగా మరీ ముందుకు వెళ్లి ఊహాగానకచేరీలు చేసేస్తూంటారు. ప్రస్తుత ఫలితాలు చూసి ఇంకేముంది మోదీ పని అయిపోయింది అంటున్నారు కొందరు. ఎన్‌డిఏకు యుపిఏ కంటె ఎక్కువ సీట్లు వచ్చినా అధికారం అందకపోవచ్చని, ఒకవేళ ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చినా మోదీ ప్రధాని కాకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. మొదటి సర్వే ప్రకారం ఎన్‌డిఏకు 237 (గతంలో 336), యుపిఏకు 166, ఇతరులకు 140 వస్తాయట. దాదాపు 100 సీట్లు ఎన్‌డిఏ నుంచి యుపిఏకు బదిలీ అవుతాయిట. రెండో దాని ప్రకారం ఎన్‌డిఏకు 233, యుపిఏకు 167, ఇతరులకు 143 వస్తాయట. నాకేమిటో యిదంతా గందరగోళంగా ఉంది.

కారణం చెపుతాను - పార్టీల పరంగా వీళ్లు వేసిన అంకెలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయనుకుందాం. కానీ ఈ ఎన్‌డిఏ, యుపిఏ, యితరులు విభజనే నాకు గొంతు దిగటం లేదు. ఉదాహరణకి మొదటిదైన ఇండియా టుడే- కార్వీలు కలిసి ''మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌'' పేరుతో చేసిన సర్వే ప్రకారం శివసేన ఇతరులు కాటగిరీలో ఉంది, ఎన్‌డిఏలో లేదు. రెండవ సర్వే ఐన ఎబిపి-సి ఓటర్‌ (కొందరు రిపబ్లిక్‌ టీవీ-సి ఓటర్‌ అని రాశారు) కలిసి ''నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌'' పేరుతో 22,300 మందిని చేసిన సర్వే ప్రకారం మహారాష్ట్రలో బిజెపి-శివసేనకు 16 వస్తాయని ఉంది. అంటే శివసేన బిజెపితో పొత్తులో ఉన్నట్లా లేదా? సి ఓటరు సర్వే వాళ్లు ఏయే పార్టీలు ఏ గ్రూపులో ఉన్నాయో స్పష్టంగా చెప్పలేదు. మొదటి సర్వే ప్రకారం టిడిపి ఇతరులలో ఉంది, కానీ కాంగ్రెసు నాయకుడు ఊమెన్‌ చాండీ చెప్పిన ప్రకారం కాంగ్రెసుకు టిడిపితో రాష్ట్రస్థాయిలో పొత్తు లేదు కానీ, జాతీయ స్థాయిలో భాగస్వామ్యం ఉంది. అదే నిజమైతే టిడిపి యుపిఏ లెక్కలోకి రావాలి.

ఇండియా టుడే డిఎండికె, పిఎంకెలను ఎన్‌డిఏ కూటమిలో, ఎడిఎంకెను ఇతరులలో చూపింది. తమిళనాడులో ఆఖరి నిమిషం దాకా పొత్తుల విషయం ఖరారు కాదు. ఎవరైనా ఎవరితోనైనా చేతులు కలపవచ్చు. ఎడిఎంకె బిజెపి చెప్పినట్లు ఆడుతోందని అందరూ అనుకుంటూ ఉంటే వీళ్లు యితరులలో పడేశారు. తెరాస, వైసిపిలను యితరుల గ్రూపులో చూపారు. ఇతరుల గ్రూపు కనుక కాంగ్రెసు సారథ్యంలోని యుపిఏకు మద్దతిస్తే వీళ్లు విడిగా వచ్చేసి ఎన్‌డిఏకు మద్దతివ్వవచ్చు. అలాగే ఆర్‌ఎల్‌డిని అస్సలు నమ్మడానికి లేదు, అజిత్‌ సింగ్‌ ఎటైనా దూకగలడు. ఆప్‌కు బిజెపి, కాంగ్రెసు యిద్దరూ బద్ధశత్రువులే. ఎవరికి మద్దతిస్తారు? సీట్ల పంపిణీలో తేడా వస్తే ఏ పార్టీ ఏ కూటమిలోనైనా చేరవచ్చు, విడవవచ్చు, ఎన్నికలైన తర్వాత చూసుకుందామని వాయిదా వేయవచ్చు. కర్ణాటకలో జెడిఎస్‌, కాంగ్రెసు కలుస్తాయని ఎన్నికల ముందు ఎవరైనా ఊహించారా? జెడిఎస్‌, బిజెపి లోపాయికారీగా కుమ్మక్కయ్యాయనే అన్నారు. చివరికి బిజెపికి అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతో జెడిఎస్‌ కాంగ్రెసుతో చేతులు కలిపింది. బిజెపితో ప్రస్తుతం ఓ రెండు చిన్న పార్టీలు విడిపోయాయి. ఎన్నికల తర్వాత మళ్లీ కలిసినా ఆశ్చర్యపడనక్కరలేదు.

ఇలా గట్టు మీద ఉండే పార్టీలు ఎక్కువై పోయినపుడు ఏ కూటమికి ఎన్ని వస్తాయో చెప్పడం కష్టం. అందువలన తక్కినవారి మాట పక్కన పెట్టి న్యూక్లియస్‌ పార్టీలైన బిజెపి, కాంగ్రెసులకు సొంతంగా ఎన్ని వస్తాయో చూద్దాం. బిజెపికి 2014లో 282 వచ్చాయి. 2019లో 202 వస్తాయని మొదటి సర్వే, 203 వస్తాయని రెండో సర్వే అన్నాయి. గుర్తు పెట్టుకోవడానికి వీలుగా 200 అనుకుందాం. ఇక కాంగ్రెసుకు 2014 లో 44 వచ్చాయి. ఈసారి 96 వస్తాయని మొదటి సర్వే, 109 వస్తాయని రెండో సర్వే అన్నాయి. గుర్తు పెట్టుకోవడానికి వీలుగా 100 అనుకుందాం. మొత్తం సీట్లు 545. సాధారణ మెజారిటీ తెచ్చుకోవడానికి 273 రావాలి. 200 తెచ్చుకున్న వాళ్లకి ఆ గమ్యం చేరడం సులభం, 100 తెచ్చుకున్నవాడికి చాలా కష్టం. అయితే ఈ 200, 100 అంకెలు నమ్మవచ్చా? రెండో సర్వే ప్రకారం బిజెపికి యుపిలో 25, గుజరాత్‌లో 24, మధ్యప్రదేశ్‌లో 23, రాజస్థాన్‌లో 18, ఒడిశాలో 12, కర్ణాటకలో 14, బెంగాల్‌, హరియాణా, దిల్లీలలో తలా 7, ఛత్తీస్‌గఢ్‌లో 5, ఈశాన్య రాష్ట్రాల్లో 14, మహారాష్ట్రలో శివసేనతో కలిసి 16, బిహార్‌లో జెడియుతో కలిసి 25 వస్తాయి.

ఈ అంకెల్లో అతిశయోక్తిగా అనిపించేవి ఏమున్నాయి? ఒడిశాలో బిజెడి కంటె ఎక్కువ వస్తాయా? అని కాస్సేపు సందేహించవచ్చు కానీ, యుపిలో ఎస్పీ తన ఓట్లను బియస్పీకి బదిలీ చేయలేకపోతే అక్కడ బిజెపికి 25కు మించి సీట్లు రావచ్చు. ఎలా చూసినా బిజెపికి 200 సీట్లు కచ్చితంగా వస్తాయనే అనిపిస్తోంది. కాంగ్రెసు మాట కొస్తే గతంలో కంటె రెట్టింపు కంటె ఎక్కువ సీట్లు ఎక్కువ తెచ్చుకోవడం ఆశ్చర్యకరంగా లేదు - బిజెపి అధ్వాన్న పాలన కారణంగా! రాహుల్‌కి కాస్త కాన్ఫడెన్సు పెరిగింది. పైగా 2014 తర్వాత వాళ్లు చాలా చోట్ల అధికారం కోల్పోయారు కదా. అవినీతి గురించి పాతవే తప్ప కొత్త ఆరోపణలను ఎదుర్కోవలసిన అవసరం పడలేదు. అలా అని 100 కి మించి వచ్చేస్తాయనీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎంపీ సీట్లు అత్యధికంగా సీట్లున్న యుపిలో అఖిలేశ్‌ మొన్నటిదాకా కాంగ్రెసుతో వుండి, యివాళ మాయావతితో కలిశాడు, ఇద్దరూ కలిసి కాంగ్రెసును అవతలికి నెట్టేశారు. కాంగ్రెసుకు బలం ఉంటే అలా తరిమివేసేవారా?

కాంగ్రెసుకు కొన్ని రాష్ట్రాలలో బలమైన స్థానిక నాయకులు ఉన్నారు కాబట్టే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పాటి సీట్లు తెచ్చుకోగలిగింది. కానీ పార్లమెంటుకి వచ్చేసరికి రాహుల్‌ అభ్యర్థి అవుతాడు. ఇప్పటిదాకా రాహుల్‌ను కాబోయే ప్రధానిగా చూపించి, కాంగ్రెసు ఎన్నికలకు వెళ్లలేదు. ఈసారి చూపిస్తే ఏమవుతుందో తెలియదు. బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ రాహుల్‌ను ఆమోదిస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. మొన్న స్టాలిన్‌ రాహులే ప్రధాని అనగానే అందరూ మీద పడి కరిచినంత పని చేశారు. మమత మా దగ్గర 23 మంది ప్రధాన అభ్యర్థులున్నారంటుంది. వాళ్లలో రాహుల్‌ ఒకడన్నమాట. ఇప్పుడు ప్రియాంకా కాంగ్రెసు సంస్థలో ఓ పదవి తీసుకుంది కాబట్టి  కాంగ్రెసుకు ఊపు వచ్చింది అని హడావుడి చేస్తున్నారు. ప్రియాంకా కొత్తగా రాలేదు. ప్రతి ఎన్నికల ప్రచారానికి వస్తూనే ఉంది, చేతులూపి వెళ్లిపోతూనే ఉంది. 2014 పార్లమెంటు ఎన్నికలలోను, యుపి అసెంబ్లీ ఎన్నికలలోను తిరిగింది కదా, ఏం సాధించింది? అలాటి నాయకులు ప్రజలకు ఎలా చేరువ కాగలరు?

ఇప్పుడు యుపిలో గెలుపు బాధ్యత ఆమె భుజస్కంధాలపై పెట్టారట. మహామహా వాళ్లకే యుపిలో గెలవడం కష్టం. గత నాలుగేళ్లగా ఆమె యుపిలోనూ ఉంటూ ప్రజలతో, స్థానిక కార్యకర్తలతో కలిసి పని చేసి ఉంటే కొద్దో గొప్పో ప్రభావం వుండేది. ఇప్పుడు 2,3 నెలల్లో ఏం మార్పు తేగలదు? ప్రియాంకా రావడం వలన హిందూ అగ్రవర్ణాల వాళ్లు కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతారంటూ విశ్లేషణలు కూడా వినవస్తున్నాయి. ఎంత ఫన్నీగా ఉంది! ఆమె తండ్రి పార్శీ, తల్లి క్రైస్తవురాలు, భర్త క్రైస్తవుడు. పోనీ ఆమె ఏ రామకృష్ణ మిషన్‌లోనైనా చేరి హిందూమతానికి సేవ చేసేసిందా అంటే అదీ లేదు. ఇక దేన్ని చూసి అగ్రవర్ణాలు మురిసిపోతాయి? ఈ విషయం రాహుల్‌కు కూడా అర్థం కావటం లేదు. గుళ్లోకి వెళితేనో, పితామహి తండ్రిగారి గోత్రం చెప్పుకుంటేనో ఓట్లు పడవు. కాంగ్రెసుకు ఓట్లు పడుతున్నాయంటే అది మతాన్ని రాజకీయాలను పెద్దగా కలపదన్న నమ్మకం అణగారిన వర్గాలకు, మైనారిటీలకు ఉంది కాబట్టే! 'కాంగ్రెసు మైనారిటీ ఓట్ల కోసం హిందూమతం పట్ల ద్వేషం చూపుతోంది' అని బిజెపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి రాహుల్‌ గుళ్ల తిరుగుళ్లతో బాటు శబరిమల విషయంలో ప్లేటు ఫిరాయించాడు.

ఇలాటి కుప్పిగంతులతో రాహుల్‌ మరింత దిగజారుతున్నాడు. మోదీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నా, అతన్ని ఓడించడానికి రాహుల్‌కు ఓటేయాలంటే మనసొప్పదు. అదే మోదీ బలం. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి వచ్చిన సీట్ల సంఖ్య బట్టి, పార్లమెంటు ఎన్నికలలో అంచనా వేయడం పొరబాటు కావచ్చు. ఎందుకంటే పార్లమెంటుకు వచ్చేసరికి మోదీ అభ్యర్థి అవుతాడు. అందువలన ఆ లెక్కకు 15-20% సీట్లు అదనంగా కలపవలసి వస్తుంది. ఎందుకంటే ఓటరు వేసుకునే ప్రశ్న - మోదీకిి దీటు వచ్చేవాడు యిటు ఎవరున్నారు? అని. మమతా బెనర్జీ చెప్పిన  23 మందిలో ఆ ఒక్క మగాడు ఎవడు? అతడికి మోదీకున్న స్టేచర్‌, జాతీయ స్థాయిలో ఆ యిమేజి ఉందా? గత నాలుగేళ్లగా ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తూ, ఓ ఫ్రంట్‌గా ఏర్పడి కార్యకలాపాలు చేస్తూ ఉంటే వారిలోంచి ఒకరి పేరు ప్రజల్లోకి వెళ్లి వుండేది. కానీ అది జరగలేదు. అందరూ ఎవరికి వారేగా ఉన్నారు. ఇప్పుడు రెండు, మూడు నెలల ముందు కలుద్దామంటున్నారు. మళ్లీ వీళ్లలో ఫెడరల్‌ ఫ్రంట్‌ వర్గం వేరే! నవీన్‌ పట్నాయక్‌ వంటి కొందరు ఎటున్నారో తెలియదు. ఎన్నికల తర్వాత ప్రధాని పదవి కోసం ఎలా కొట్లాడుకుంటారో తెలియదు. కర్ణాటకలో కాంగ్రెసు-జెడిఎస్‌ కూటమి ఎంత లక్షణంగా నడుస్తోందో చూస్తున్నాం. దాని బాబులాటిది కేంద్రంలో చూడవలసి వస్తుంది.

భారతదేశానికి సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కావు. కానీ ఏదైనా సవ్యంగా నడవాలంటే మధ్యలో ఉండే యిరుసు గట్టిగా ఉండాలి. అలా చూస్తే 100 సీట్లున్న కాంగ్రెసు కంటె 200 సీట్లున్న బిజెపి భాగస్వామ్య పక్షాలను అదుపులో పెట్టగలదు. రాహుల్‌ కాకుండా పివి నరసింహారావు వంటి అనుభవజ్ఞుడు కాంగ్రెసుకు నాయకత్వం వహించబోతుంటే సొంత బలం లేకపోయినా ఏదోలా మేనేజ్‌ చేయగలడు. రాహుల్‌కి రాజకీయానుభవమే పెద్దగా లేదనుకుంటే, పాలనానుభవం బొత్తిగా లేదు. మన్‌మోహన్‌ కింద ఏదో ఒక శాఖలో పనిచేసి ఉంటే, కాస్త నేర్చుకుని ఉండేవాడు, అతని సత్తా ఏమిటో మనకూ తెలిసేది. ఫలానా వారి రక్తం ఒంట్లో ప్రవహిస్తోంది కనుక ఆటోమెటిక్‌గా పాలించేయగలనని అనుకోవడం పొరబాటు. ఆ మాటకొస్తే ప్రధాని అయ్యేదాకా రాజీవ్‌కి పాలనానుభవం లేదు. కానీ అతని పార్టీకి అఖండమైన మెజారిటీ ఉంది. భాగస్వాముల బెడద లేదు. ఇక్కడ సొంతబలం 100 అయితే తోక బలం 173. కనీసం పది పన్నెండు పార్టీలు కలిస్తే తప్ప ఆ తోక తయారవదు. ఏ తోకశకలం ఎప్పుడు తిరగబడుతుందో తెలియదు. దాన్ని దువ్వేందుకు చాకచక్యం కావాలి. అది మనవాడి దగ్గర ఉందా అన్నదే డౌటు.

యుపిఏతో పోలిస్తే ఎన్‌డిఏ ఎక్కువమందిని ఆకర్షించ గలుగుతుంది. శివసేన బీరాలు పలకడమే తప్ప బయటకు పోవడం లేదు చూడండి. బాబు బయటకు వచ్చేశారుగా అనవద్దు. ఏదో ఒక గేమ్‌ప్లానుతో బిజెపి కావాలని అలాటి పరిస్థితి కల్పించింది కనుకనే బయటకు వచ్చేశారు. డిఎంకె, తృణమూల్‌ యివన్నీ గతంలో బిజెపితో ఊరేగినవే! తమ రాష్ట్రాలకు ఎక్కువ నిధులిస్తామని ఊరిస్తే వాళ్లు ఎవరికైనా జై కొట్టగలరు. నిజానికి 'ఇతరులు' కాటగిరీలో ఉన్న ఎవరికీ ఫలానా వారితో కలవకూడదనే సిద్ధాంతరాద్ధాంతాలు లేవు. బాబు మొన్నటిదాకా ఎన్‌డిఏ, యివాళ యుపిఏ లేదా 'ఇతరులు' కాటగిరీ. అదీ కేంద్రంలోనే! రాష్ట్రంలో కాదు, యిక్కడ పొత్తు లేదు కాబట్టి కాంగ్రెసు టిడిపిపై కత్తులు నూరుతుంది, కేంద్రంలో వాటేసుకుంటుంది.  ఇతరులు కేటగిరీలో ఉన్న వైసిపితో కూడా టిడిపికి రాష్ట్రంలో వైరం. కేంద్రంలో భాగస్వామ్యం. ఇలా గతంలో కూడా చాలామంది చేశారు, కమ్యూనిస్టులు, కాంగ్రెసు బెంగాల్‌లో, కేరళలో కత్తులు, తక్కినచోట్ల పొత్తులు. జెడియు గతంలో యుపిఏతో ఉంది, యిప్పుడు ఎన్‌డిఏలో చేరింది.

ఎన్‌సిపి ఎటుంటుందో తెలియదు, చెప్పలేం. మహారాష్ట్రలో శివసేన బిజెపితో తెంచుకుంటే వారి స్థానంలో చేరినా చేరవచ్చు. కెసియార్‌ బిజెపికి ఆప్తుడో, కాదో తెలియదు. 2009లో వేసిన గంతు చూశాం, రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టులతో చేతులు కలిపి, ఫలితాల రాకముందే దిల్లీ వెళ్లి బిజెపితో చేతులు కలిపారు. ఇప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌కి గిరాకీ లేకపోతే ఎన్‌డిఏ వైపు దూకుతారేమో తెలియదు. జగన్‌ యిప్పటికీ బిజెపితో సఖ్యంగానే ఉన్నాడు, తన పేపరులో, ఛానెల్‌లో వాళ్లను ఆట్టే విమర్శించడు. కానీ యివాళ ఫెడరల్‌ ఫ్రంట్‌, బిజెపికి, కాంగ్రెసుకు సమానదూరం అంటాడు. సిఓటరు సర్వే వీళ్లలో కొందరికి ఎన్నేసి సీట్లు వస్తాయో అంచనాలు యిచ్చింది. తెరాస 16, మజ్లిస్‌ 1, వైసిపి 19, టిడిపి 6, ఎస్పీ-బియస్పీ 51, శివసేన 4, తృణమూల్‌ 34, బిజెడికి 9, డిఎంకె కూటమికి 39 .. అంటూ. అంటే విడిగా చూస్తే మమతా బెనర్జీకే ఎక్కువ సీట్లు వస్తాయన్నమాట. 'రాహుల్‌కు అనుభవం లేదు, నాకివ్వండి ప్రధాని పదవి' అనవచ్చామె. మరి మాయావతి ఊరుకుంటుందా?

ఈ సినారియో అంతా ఊహిస్తే అయ్యబాబోయ్‌ అనుకుంటూ మోదీకే ఓటేస్తారని తీర్మానించాలి. కానీ పరిస్థితి అలా కనబడటం లేదని సర్వేలు చెపుతున్నాయి. ఎన్నో ఆశలు చూపించి పదవిలోకి వచ్చిన మోదీ సామాన్యులనే కాక, తన అభిమానులను కూడా నిరాశ పరిచాడు. అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశాడు. బిజెపి పాలన పట్ల ప్రజలు తృప్తిగా లేరని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూపుతున్నాయి. అందువలన గతంలో కంటె బిజెపికి గతంలో కంటె సీట్లు తక్కువ రావడం ఖాయమని అంచనా. ఆ తక్కువ వచ్చేవి 30యా, 50యా, 80యా అనే విషయంలోనే ఊహాగానాలు. దాని మిత్రపక్షాలు ఒక 20 పోగొట్టుకోవచ్చు. అందుకే మొదటి సర్వే 100 స్థానాలు అటూయిటూ అవుతాయంది. ఎన్‌డిఏ పోగొట్టుకునే స్థానాలను ఎవరు గెలుచుకుంటారు అనేదే ప్రశ్న. 55-60 వరకు కాంగ్రెసు గెలుచుకుంటుంది అనుకుంటే మరి తక్కిన 40-50? నిశ్చయంగా ప్రాంతీయ పార్టీలే!

మోదీ పాలనలో కేంద్రం సర్వాధికారాలు చేతిలో పెట్టుకుని రాష్ట్రాలను ఆడిస్తోందనే భావం అందరిలోనూ ఉంది. రాష్ట్రాల మధ్య పక్షపాతం చూపిస్తోందని అనేక గణాంకాలు తెలుపుతున్నాయి. న్యాయప్రకారం యివ్వవలసినవి కూడా కొందరికి యివ్వలేదు. మరి కొందరికి వేలం పాట పాడినట్లు నిధులు కురిపించారు. ఇలాటి పరిస్థితులను ప్రాంతీయపార్టీలు తమకు అనుగుణంగా మలచుకుంటాయి. మాకు ఎక్కువ సీట్లు యివ్వండి, కేంద్రంలో ఎవరున్నా వాళ్ల మెడలు వంచి మనకు నిధులు, ప్రాజెక్టులు సాధించుకుని వస్తాం అనే హామీతో ప్రజలు వద్దకు వెళతాయి. కేంద్రం ధర్మబద్ధంగా నడుచుకుని వుంటే యిలాటి వాటికి ఓటర్లు ఆకర్షితులు కారు. కానీ మోదీ వ్యవహారశైలి కారణంగా ప్రాంతీయపార్టీలు యీ సారి బలపడతాయి. ఇవి కూటమిగా ఏర్పడి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వద్దామనుకుంటే వారితో బేరాలాడతాయి. ఆ బేరాలు రాష్ట్రప్రయోజనాలకే కాకపోవచ్చు, తమ రాజకీయప్రయోజనాలకు కూడా కావచ్చు.

ఈ కూటమి ఎన్‌డిఏపై ఎటువంటి ఒత్తిడి తెస్తుంది అనేదే యిప్పుడు చర్చకు దారితీస్తోంది. మోదీ వంటి నియంత తమకు వద్దని, అతని స్థానంలో తమకు విలువ నిచ్చే మరో బిజెపి నేత ఉంటేనే ఎన్‌డిఏకు మద్దతిస్తామని యివి బేరమాడతాయని ఊహిస్తున్నారు. అలాటప్పుడు మోదీకి బదులు ఎవరు వస్తారు అనేది కూడా ఊహించి కొన్ని పేర్లు చెపుతున్నారు. వాటిలో గడ్కరీ పేరు ప్రబలంగా వినబడుతోంది. అతను ఆరెస్సెస్‌కు మోదీ కంటె చాలా సన్నిహితుడని, తక్కిన పార్టీల వాళ్లతో కూడా సఖ్యంగా మెలగుతాడని, మోదీ అంత కఠినంగా ఉండడు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యుడని వార్తలు వస్తున్నాయి. అది నిజంగా జరుగుతుందా? అలాటి పరిస్థితి వస్తూ ఉంటే మోదీ చూస్తూ ఊరుకుంటాడా? గడ్కరీపై, అతని వ్యాపారసంస్థలపై కేసులున్నాయి. అవన్నీ బయటకు లాగకుండా ఉంటాడా?

బిజెపికి సీట్లు తగ్గి, మోదీ ప్రధాని పదవికి ఎసరు వస్తే యిప్పటివరకు అతనికి దన్నుగా నిలిచిన కార్పోరేటు రంగం నిశ్చేష్టంగా ఉంటుందా? మోదీకి అనుకూలంగా తక్కిన పార్టీలను మార్చదా? ఏ పార్టీకైనా సరే, నిధులు కావాలి. మీడియా సపోర్టు కావాలి. ప్రస్తుతం కార్పోరేటు రంగం చేతిలోనే రెండూ ఉన్నాయి. మోదీపై యితర వర్గాలు కినుకగా ఉంటే వుండవచ్చు కానీ, కార్పోరేటు దిగ్గజాలు అనుకూలంగానే ఉన్నారు. వారు తప్పకుండా మోదీకి అనుకూలంగా పావులు కదుపుతారు. నిజానికి బిజెపిలో రాజ్‌నాథ్‌ సింగ్‌ సమర్థుడైన, స్వచ్ఛమైన యిమేజి ఉన్న నాయకుడు. కానీ అతనికి బొంబాయి కార్పోరేట్‌ రంగం మద్దతు ఉన్నట్లు తోచదు. అందువలన మోదీకే మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయి. తటస్థ పార్టీల మద్దతు కోసం తన వర్క్‌ స్టయిల్‌ మార్చుకుంటానని ప్రామిస్‌ చేసి మోదీ మళ్లీ ప్రధాని కావచ్చు, చెప్పలేం. ఆరోహణలు, అవరోహణలు రాజకీయ నాయకులు చులాగ్గా నేర్చుకోగలరు.

అసలిదంతా ఎప్పుడు అవసరం పడుతుంది? బిజెపికి 2014 కంటె 50 సీట్ల కంటె తక్కువ వచ్చినపుడు! అది జరగకుండా మోదీ జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటాడా? గతంలో కంటె తన పాప్యులారిటీ తగ్గుతోందని  మోదీ కూడా గ్రహించాడు. అందుకే జిఎస్‌టిలో సవరణలు చేస్తున్నాడు. ఇప్పుడీ అగ్రవర్ణ రిజర్వేషన్‌ అర్జంటుగా అమలు చేయడం మొదలుపెట్టి కొన్ని వర్గాలను మెత్తబరచాడు. బజెట్‌లో ఇన్‌కం టాక్సు లిమిటు పెంచి మధ్యతరగతిని ఆకర్షించవచ్చని అంటున్నారు. ఇలాటివి యింకా ఎన్నో ట్రిక్కులు కచ్చితంగా ఉంటాయి. ఇంకా హిందూమతం ప్రమాదంలో పడడం, మోదీపై హత్యాప్రయత్నం, పాకిస్తాన్‌తో కయ్యం, టెర్రరిస్టులకు ప్రతిపక్షాలకు నెయ్యం... యిలాటి ఉపాయాలు ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా, వీటిని లెక్కలోకి తీసుకోకుండా సర్వే ఫలితాల గురించి మరీ ఎక్కువగా చర్చించడం అనవసరమని నా భావన.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
[email protected]

బాలయ్యకు మత్తు దిగిందా!

బ్యాంకులో వేస్తే 20 లక్షలు.. సినిమా ఆడిస్తే 10 లక్షలే