మార్పు కోసమా? మోడీ మెప్పుకోసమా?

అనూహ్యంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు యోగి ఆదిత్యనాథ్‌. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యూహం, బీజేపీ సీనియర్లనే షాక్‌కి గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ఎక్కడా యోగి ఆదిత్యనాథ్‌ పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో విన్పించకపోవడమే అందుక్కారణం. ముఖ్యమంత్రి అయ్యాక, యోగి ఆదిత్యనాథ్‌ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా, పాన్‌ వినియోగంపై నిషేధం విధించారు. అక్రమంగా నడుస్తున్న జంతువధ శాలల్ని మూసివేయిస్తున్నారు. ఇంకా చాలా చాలానే చేస్తున్నారాయన. యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా కొన్ని పనులు చేస్తోంటే, ఆయన అనుచరులు అత్యుత్సాహంతో ఇంకొన్ని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులు ఇబ్బందులు పడ్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ మరింత దూకుడు ప్రదర్శిస్తుండడం గమనార్హం. 

మంత్రుల్ని పరుగులు పెట్టించడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్ని తొలగించడం.. ఆయన చేస్తున్న పనులు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.. ఆలోచింపజేస్తున్నాయి కూడా. అందరికీ తెల్సిన విషయమై యోగి ఆదిత్యనాథ్‌పై కరడుగట్టిన హిందూ అతివాది అనే ముద్ర వుందని. ఆ ఇమేజ్‌ నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేయడంలేదుగానీ, అవినీతి, అపరిశుభ్రత, రౌడీయిజం, మహిళలపై వేధింపులు.. వంటివాటిపై ఆయన ఉక్కుపాదం మోపుతుండడాన్ని యూపీ ప్రజానీకం హర్షిస్తున్నారు. అయితే ఇదంతా, ఆరంభశూరత్వం మాత్రమేనా.? మోడీ మెప్పు పొందేందుకు యోగి ఆదిత్యనాథ్‌ పడ్తున్న తాత్కాలిక పాట్లు అనుకోవాలా.? అన్న అనుమానాలూ లేకపోలేదు. ఏమో, ముందు ముందూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇదే దూకుడు కొనసాగిస్తారేమో వేచి చూడాల్సిందే.

Show comments