రవితేజ రూటు మార్చాడు

రాజా ది గ్రేట్‌ బాగా ఆడిందన్న ఆనందాన్ని హరించేస్తూ టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్‌ అయ్యాయి. ఈ రెండు పరాజయాలతో రొటీన్‌ సినిమాలకి ఆదరణ తగ్గిపోయిందనే సంగతి రవితేజ గ్రహించాడు. మునుపటిలా నాలుగు డైలాగులు చెప్పేసి, ఏదో కామెడీతో కాలక్షేపం చేయించేస్తే పాస్‌ అయిపోమని తెలుసుకున్నాడు.

అందుకే రవితేజ కూడా కాన్సెప్ట్‌ బేస్డ్‌ కథలని ఎంకరేజ్‌ చేస్తున్నాడు. శ్రీనువైట్లతో చేస్తోన్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' అలాంటి కాన్సెప్ట్‌ స్టోరీనే. రెగ్యులర్‌ శ్రీనువైట్ల మార్కు ఎలిమెంట్స్‌ లేకుండా కొత్త రకం స్క్రీన్‌ప్లేతో రూపొందుతోంది. దీని తర్వాత రవితేజ చేయబోయే చిత్రం కూడా కొత్తగానే వుంటుంది.

విభిన్న కథాంశాలు ఎంచుకునే దర్శకుడు విఐ ఆనంద్‌ రూపొందించే ఈ చిత్రంలో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రల్లో కనిపిస్తాడు. కమర్షియల్‌ మసాలా చిత్రాలకి కాలం చెల్లిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒకప్పటి ట్రెండుని ఫాలో అవుతూ కూర్చుంటే ఎంత పెద్ద హీరోకి అయినా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. మార్చుకున్న ఈ పద్ధతి ద్వారా మాస్‌ మహారాజా టైమ్‌ మళ్లీ మొదలవుతుందేమో చూడాలిక.

RELATED ఆమెకు మంచి రోజులొచ్చాయా?