రవిప్రకాశ్‌, శివాజీపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ

టీవీ9 నుంచి అవమానకర రీతిలో బహిష్కృతుడైన రవిప్రకాష్ ఆచూకి ఇంకా తెలియరాలేదు. ఆయన ఎక్కడున్నాడనే విషయం ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉంది.

ఇదిలా ఉండగా తప్పించుకొని తిరుగుతున్న రవిప్రకాష్ ను పట్టుకునేందుకు పోలీసులు చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. అతడిపై లుక్ అవుట్ నోటీసు ప్రయోగించారు. 

పోలీసుల తాజా చర్యతో రవిప్రకాష్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉండదు. ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు సమాచారం అందించారు పోలీసులు. ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే అక్కడికక్కడే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

మరోవైపు రవిప్రకాష్ కు చెందిన పాస్ పోర్టును కూడా పోలీసులు సీజ్ చేశారు. సో.. ఇప్పటికే విదేశాలకు పారిపోకుండా ఉన్నట్టయితే, రవిప్రకాష్ కు ఇక దేశం దాటే అవకాశం లేనట్టే. 

టీవీ9లో పలు అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రశ్నించేందుకు పోలీసులు రవిప్రకాష్ కు నోటీసులు జారీచేశారు. తమ ఎదుట హాజరుకావాలని అందులో ఆదేశించారు. 2 సార్లు ఈ గడువు పెంచినప్పటికీ రవిప్రకాష్ పోలీసుల ముందుకు రాలేదు. పైపెచ్చు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆఖరి ప్రయత్నంగా లుక్ అవుట్ నోటీస్ ఇవ్వక తప్పలేదు పోలీసులకి.

కేవలం 8శాతం వాటా కలిగిన రవిప్రకాష్.. కొత్తగా టీవీ9ను దక్కించుకున్న అలాందా మీడియాను ముప్పుతిప్పులు పెట్టారు. వాళ్లకు అస్సలు సహకారం అందించకపోవడమే కాకుండా.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఫోర్జరీ చేయడం, లోగో కాపీరైట్స్ ను అమ్మేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. వీటన్నింటిపై కంపెనీ డైరక్టర్లు కేసులు వేశారు. 

తాజా సమాచారం ప్రకారం రవిప్రకాష్ పై త్వరలోనే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీవీ9 ఆర్థిక లావాదేవీలపై అలందా కంపెనీ లోతుగా ఆడిటింగ్ చేస్తోంది.

మరో 3 రోజుల్లో కంపెనీకి సంబంధించి రవిప్రకాష్ చేసిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని వారు భావిస్తున్నారు. అదే కనుక జరిగితే రవిప్రకాష్ చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగుసుకున్నట్టే. మరోవైపు ఈ కేసులో మరో కీలక నిందుతుడైన మాజీ సీఎఫ్ఓ మూర్తి పోలీసులకు లొంగిపోయారు. 

Show comments