రవిప్రకాష్ సెంటిమెంట్ అస్త్రం..!

టీవీ9 నుంచి బహిష్కృతుడైన రవిప్రకాష్ మరోసారి తెరపైకొచ్చాడు. తనపై మొదటి కేసు పడిన వెంటనే అదంతా బూటకం అంటూ ఏకంగా టీవీ9లోనే ప్రత్యక్షమైన ఈ మాజీ సీవీవో, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. 8 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ వీడియోలో ఎప్పట్లానే ప్రవచనాలు వల్లవేసిన రవిప్రకాష్.. లొంగిపోవడానికి సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు.

"ఈ రోజు నా ముందున్న ప్రధానమైన సమస్య ఒకటే. నేను విలువల్ని పాటించాలా లేక దొంగ కేసులకు భయపడి ధనికులకు ఊడిగం చేయాలా? ఈరోజు నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను. ఈ కేసులు, పోలీస్ దాడులకు భయపడకుండా పత్రికా స్వేచ్ఛ కోసం, సమాజ హితం కోసం, నేను నమ్మిన విలువల కోసం ఓ అడుగు ముందుకేస్తున్నాను. దానికి మీ అందరి మద్దతు కోరుతున్నాను."

ఈ వాక్యాలతో తన ప్రసంగాన్ని ముగించి, పోలీసులకు లొంగిపోబోతున్నాననే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు రవిప్రకాష్. తన వీడియోలో మరోసారి ప్రస్తుతం చైర్మన్లపై, బోర్డ్ డైరక్టర్లపై విమర్శలు చేశారు రవిప్రకాష్. పనిలోపనిగా తనపై పెట్టిన కేసులు చాలా హాస్యాస్పదమైనవని అన్నారు.

భవిష్యత్ తరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలన్నా, రాబోయేతరం మనల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నా మనం ధైర్యంగా ఉండాలని, విలువల్ని పాటించాలని వీడియోలో చెప్పిన రవిప్రకాష్.. విలువలకు తిలోదకాలిస్తూ ఎందుకు పరారీలో ఉన్నాననే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

టీవీ9 లోగోపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, ఆ లోగోకు యజమానిని తనేనంటూ మరోసారి చెప్పుకున్నారు రవిప్రకాష్. ప్రస్తుతం వాటాదారులతో తను వ్యాపార ఒప్పందం అడిగానని, దానికి వాళ్లు అంగీకరించలేదనే విషయాన్ని రవిప్రకాష్ తన కోణంలో చెప్పుకొచ్చారు. కానీ 90శాతం వాటాదారుకు, 8శాతం వాటా కలిగిన రవిప్రకాష్ ను వ్యాపార భాగస్వామిగా తీసుకోవాలా వద్దా నిర్ణయించుకునే హక్కు ఉందనే చిన్న పాయింట్ ను కావాలనే వదిలేశారు.

ఓవరాల్ గా చూసుకుంటే తన వీడియో ద్వారా రెండు విషయాల్ని స్పష్టంచేయదలుచుకున్నారు రవిప్రకాష్. తనపై పెట్టిన కేసులన్నీ బోగస్ కేసులని చెబుతూనే, రేపోమాపో తను లొంగిపోతానని, తనకు అందరి మద్దతు కావాలనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. 8 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన రవిప్రకాష్.. తను ఎక్కడున్నాననే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే దేశం విడిచి వెళ్లిపోయాడనే వార్తల్ని మాత్రం ఆయన ఖండించాల్సి ఉండాల్సింది. ఆ పని మాత్రం చేయలేదు రవిప్రకాష్. తనకున్న అన్నిదారులు మూసుకుపోవడంతో ఇక లొంగిపోవడం ఒక్కటే రవిప్రకాష్ ముందున్న మార్గం. 

Show comments