ఔను...వాళ్లు ముగ్గురూ ఒక్కటే...!

‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’ అన్నాడు ప్రజా కవి వేమన. వందల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాట ఇప్పటికీ, ఎప్పటికీ సజీవమే. సామాన్యులు కావొచ్చు, రాజకీయ నాయకులు కావొచ్చు. ఎవరైనా సరే వేరేవాళ్ల తప్పులను సులభంగా ఎత్తిచూపుతారు. కాని అదే తప్పు తాము చేస్తూనే ఉన్నా, లేదా తమ వాళ్లు చేసినా దాన్ని ఒప్పుకోకపోవడమే కాదు గుర్తించరు. ఇది మానవ నైజం. అంతే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే రకమైన తప్పులు చేస్తున్నప్పటికీ తెలంగాణ టీడీపీ నాయకులు కేసీఆర్‌ను విమర్శిస్తారే తప్ప తమ అధినేత చంద్రబాబును ఏమీ అనలేరు. ఎలా అంటారు? ఏ పార్టీ నాయకులైనా అధినేతను విమర్శించలేరు కదా. లోపల ఏమైనా అనుకుంటారేమో తెలియదు. కాని పైకి మాత్రం ఏమీ అనలేని పరిస్థితి. టీఆర్‌ఎస్ నాయకులు ‘ఏమయ్యా మా అధినేతను తప్పు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కాని మీ బాసూ అదే పని చేస్తున్నాడు కదా’ అని నిలదీస్తే ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోతున్నారు. మా బాస్ చేసేది వందశాతం కరెక్టే అని చెప్పలేరు. దానికి జవాబు చెప్పలేరుగాని కేసీఆర్ మీద ఒంటి కాలి మీద లేస్తూనే వుంటారు. 

ఇంతకూ కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ చేస్తున్న తప్పేమిటి? మెగా సీరియల్‌లా కొనసాగుతున్న  పార్టీ ఫిరాయింపుల పర్వం. వచ్చే ఎన్నికల దాకా ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే లక్ష్యంతో ఉన్నారు. ఏమిటది? ప్రతిపక్షాలు మిగలకూడదని. మొన్నీమధ్య తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కమ్ కేసీఆర్‌ను అనుక్షణం దుమ్మెత్తి పోసే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఓ పత్రికలో ‘ఔను...వాళ్లిద్దరూ ఒక్కటే’ అనే పేరుతో వ్యాసం రాశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఈ వ్యాసంలో పార్టీ ఫిరాయింపులకు ఆద్యురాలు కాంగ్రెసు పార్టీయేనని, దాన్ని ఇప్పుడు కేసీఆర్ కొనసాగిస్తున్నారని, ఈ విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆ వ్యాసం సారాంశం. టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాసం రాశారు. చాలా ఘాటుగా రాసిన ఈ వ్యాసంలో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. అంతా వాస్తవమే. కాని ‘ఔను...వాళ్లిద్దరూ ఒక్కటే’ అనడం తప్పు.  ‘ఔను...వాళ్లు ముగ్గురూ ఒక్కటే’ అనాలి. ఆంధ్రా టీడీపీని కూడా కలుపుకోవాలి కదా...! కాని రేవంత్ ఆ పని చేయలేరు. రేవంత్ చెప్పింది సత్యమేగాని అది అర్థ సత్యమైపోయింది. ఈమధ్య కాంగ్రెసు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదే పార్టీ నాయకులు వినోద్, వివేక్, కాంగ్రెసు, సీపీఐ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ తీర్థం సేవించారు. 

ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ కాంగ్రెసు పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసు పార్టీ చేసిన ఫిరాయింపుల సంగతి ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ను చీల్చిన వైనాన్ని గుర్తు చేశారు. ‘మీరు చూస్తే సంసారం...మేం చేస్తే వ్యభిచారమా?’ అని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పు ఒప్పయితే, తాము చేసిన తప్పు కూడా ఒప్పేనని ఆయన వాదన. ఇదే దారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నడుస్తున్నారు. కేసీఆర్ ఫిరాయింపులతో టీడీపీని మటాష్ చేశారు. తాను వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఫిరాయింపులు నిర్విఘ్నంగా జరుగుతుండటం, రాజ్యాంగం అడ్డుకోలేకపోతుండటంతో ప్రజల దృష్టిలో ఫిరాయింపులు తప్పు కాదనే అభిప్రాయం ఏర్పడింది. తమది సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తున్న పార్టీ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడంలో తక్కువ తినలేదు. ప్రభుత్వాలను కూల్చడంలో అందెవేసిన చెయ్యిగా మారింది. ‘బీజేపీ కూడా ఇలా చేయడమేంటి?’ అని ప్రశ్నిస్తే గతంలో కాంగ్రెసు చేయలేదా? అని ఎదురు ప్రశ్నిస్తోంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ నైతిక విలువలను గాలికొదిలేసిన అన్ని పార్టీలన్నీ ‘నేనెరుగ నేనెరుగ కాంగ్రెసునడగు’ అని పాడుతున్నాయి. ఫిరాయింపుల విద్య నేర్పించిన కాంగ్రెసు పార్టీ అదే విద్య కేసీఆర్ ప్రదర్శిస్తుంటే గొల్లుమంటోంది. 

ఒకప్పుడు నాయకులు కలుసుకున్నా, సాధారణ వ్యక్తులు  టైమ్‌పాస్‌గా మాట్లాడుకున్నా అభివృద్ధి పనుల గురించో, కేంద్ర, రాష్ర్ట రాజకీయాల గురించో ఏవో చిల్లర మల్లర విషయాల గురించి చర్చించుకునేవారు. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడుకున్నా ఒకే విషయం. అదే..పార్టీ ఫిరాయింపులు. ఈ రోజు ఫలానా పార్టీ నుంచి ఫలానావారు చేరారు కదా. రేపెవరు చోరబోతున్నారు? ఏ పార్టీ నుంచి ఏ కీలక నాయకుడు జంప్ చేయబోతున్నాడు? దాని వల్ల ఏ పార్టీకి ఎంత నష్టం? ఎంత లాభం? రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?...ఇలా తిరగేసి మరగేసి ఇవే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. పత్రికల్లో, టీవీల్లోనూ ఇవే వార్తలు. ఊహాగానాలు. పెద్ద పేపర్లలోనూ ఇవే. 

వాటి పిల్ల పత్రికల్లోనూ (టాబ్లాయిడ్స్) ఇవే. ఫలానా నాయకుడు అధికార పార్టీలో చేరబోతున్నాడని వార్త వస్తుంది. వెంటనే సదరు నాయకుడు దానిని ఖండిస్తూ ఓ ప్రకటన ఇస్తాడు. తన ప్రాణం పోయినా తాను ఉన్న పార్టీని విడిచిపెట్టనని  అంటాడు. ఓ నాలుగు రోజుల తరువాత అదే నాయకుడు పార్టీ ఫిరాయించాడని వార్త వస్తుంది. దీంతో అతను ప్రజాభీష్టం మేరేక ఇలా చేశాననో లేదా తన నియోజకవర్గం అభివృద్ధి కోసం చేయక తప్పలేదనో జవాబిస్తాడు. అధికార పార్టీలో చేరుతున్న నాయకులంతా గతంలో దాన్ని, దాని అధినేతను బండబూతులు తిట్టినవారే. తెలంగాణలో అయినా ఇంతే. ఆంధ్రాలోనూ ఇంతే. దీన్ని కూడా కొందరు సమర్థించుకుంటూ అలా తిట్టడం రాజకీయ ధర్మమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని తిట్టక తప్పలేదని, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నామని అంటారు. 

టీడీపీ, కాంగ్రెసు పార్టీల్లోని కొందరు సీనియర్ నాయకులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు కాని వారు) మౌనంగా ఉన్నారు. వీరు మౌనంగా ఉన్నారంటే జంప్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీల్లోనూ ఒకప్పుడు అధికార పార్టీపై తోక తొక్కిన తాచులా లేచినవారు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలను సాక్షిగా చూస్తున్నారు. ఇలాంటివారు ఏదో ఒక ఫైన్ మార్నింగో, ఈవెనింగో జంప్ అవుతారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఏఏ జిల్లాల్లో ఏఏ పార్టీ నాయకులు అధికార పార్టీలోకి పోయే అవకాశముందో అంచనా వేస్తూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమపై జంపింగ్ వార్తలు వస్తున్నా కొందరు నాయకులు అవునని గాని, కాదనిగాని అనడంలేదు. దీంతో వారు ఫిరాయింపుల జాబితాలో ఉన్నవారేనని నిర్థారించుకుంటున్నారు.         

కాంగ్రెసు పార్టీ నేర్పిన విద్యను అన్ని పార్టీలూ ఆచరణలో పెడుతున్నాయి. ఏ ఒక్క పార్టీ ‘పత్తిత్తు’ కాదు. దేనికీ మినహాయింపు లేదు. ప్రాణం పోయినా  పార్టీని వీడరని, సిద్ధాంతాలకు నిబద్ధులని పేరున్న కమ్యూనిస్టు పార్టీల్లోని ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారంటే ఏమనుకోవాలి? మొన్నీమధ్య కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఓ మాటన్నారు. పార్టీ ఫిరాయించిన వెంటనే పదవి పోయేలా చట్టం తేవాలన్నారు. కేంద్రంలో ఆయన పార్టీ అధికారంలో ఉండగానే ఆ పని చేస్తే దాని పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది.

కాని ఈ చట్టం చేశాక ఫిరాయింపుల ద్వారా ప్రయోజనం పొందాలనుకోవడం బీజేపీకి కూడా సాధ్యం కాదు. తనేక గుదిబండగా మారే పని ఆ పార్టీ చేస్తుందనుకోలేం. ఆ పని చేతకాకపోతే వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలనే డిమాండ్ మాదిరిగా ఫిరాయింపులను చట్టబద్ధం చేస్తే సరిపోతుంది. అప్పుడు ఒకరినొకరు విమర్శించుకునే శ్రమ ఉండదు.   

నాగ్ మేడేపల్లి

Show comments