జగన్ పై భక్తిని చాటుకున్న జనసేన ఎమ్మెల్యే

జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థి రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ పై తనకున్న భక్తిని, వినయ విధేయతలను చూపించుకున్నారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఏడాదికి 10వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడంపై రాపాక పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. అక్కడితో ఆగలేదు ఈ జనసేన ఎమ్మెల్యే. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అవును.. అమలాపురం నల్లవంతెన ఆటోస్టాండ్ వద్ద ఆటోడ్రైవర్లంతా జగన్ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాపాక కూడా పాల్గొన్నారు. పనిలోపనిగా తను కూడా ఓ చెంబుతో పాలు తీసుకొని కటౌట్ పై పాలుపోశారు. ఊహించని విధంగా రాపాక ఇలా వ్యవహరించేసరికి ఆటోడ్రైవర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పక్కనే ఉన్న మంత్రి విశ్వరూప్ కూడా రాపాక చర్యకు అవాక్కయ్యారు.

నిజానికి జగన్ పై రాపాక తన అభిమానాన్ని చాటుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సాక్షిగా నిండు సభలోనే జగన్ ను దేవుడన్నారు రాపాక. వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శిస్తూ, అప్పట్లో జనసేన పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే, అదే సమయంలో బడ్జెట్ ను భగవద్గీత అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు రాపాక.

తాజా చర్యతో మరోసారి జనసైనికుల ట్రోలింగ్ కు గురవుతున్నారు రాపాక. ట్రోలింగ్ సంగతి పక్కనపెడితే ఆయన ఏ క్షణానైనా వైసీపీలో చేరిపోతారంటూ మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. పదవులకు రాజీనామా చేస్తే తప్ప పార్టీలోకి తీసుకోనని జగన్ విస్పష్టంగా ప్రకటించినప్పటికీ, రాపాక విషయంలో ఈ ఊహాగానాలు మాత్రం ఆగట్లేదు. రాపాక చేస్తున్న పనులు అలా ఉన్నాయి మరి.

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

Show comments