వైసీపీలోకి.. ఆశ్చర్య పరిచిన నేత!

మొన్నటి వరకూ కాంగ్రెస్ లో ఉండిన నేత, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. పాదయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి రామచంద్రయ్య తన అనుచరగణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇది ఒకింత విశేషమే.

రామచంద్రయ్య ప్రజారాజ్యంతో పాటు కాంగ్రెస్ లో విలీనం అయిన వ్యక్తి. చిరంజీవికి సన్నిహితుడిగా అప్పట్లో ఈయనకు ప్రాధాన్యత దక్కింది. చిరంజీవి కోటాలో రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాకా.. మండలిలో ప్రతిపక్ష నేత కూడా అయ్యాడీయన.

ఎమ్మెల్సీ హోదా ముగిసిన తర్వాత రామచంద్రయ్య కాంగ్రెస్ ను వీడతాడని స్పష్టం అయ్యింది. చంద్రబాబుపై ఈయన విమర్శల ధాటిని కొనసాగిస్తూ వచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసిన చరిత్ర ఉన్నా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలపడంపై మండిపడుతూ రామచంద్రయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈయన జనసేనలోకి చేరవచ్చు అని అంతా అనుకున్నారు.

అయితే అనూహ్యంగా.. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. సామాజివర్గం రీత్యా రామచంద్రయ్య బలిజ. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. జనసేన వైపు మొగ్గుచూపకుండా.. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం విశేషమే. రాయలసీమలో బలిజ సామాజికవర్గంపై పవన్ కు చాలా ఆశలే ఉన్నాయి.

రేపు అక్కడ జనసేన డిపాజిట్లు తెచ్చుకోవాలన్నా బలిజల మద్దతు ఉంటేనే సాధ్యం అవుతుంది. అయితే పవన్ సీమవైపు రావడంలేదు. బలిజల్లో కూడా ప్రజారాజ్యం అనుభవంతో.. పవన్ వైపు అంత మద్దతు కనిపించడం లేదు. అందుకు రామచంద్రయ్య వైసీపీలో చేరడం కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్‌!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments