ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న రామ్

రొట్ట సినిమా అన్నారు. సినిమా చూపిస్త మామ సినిమానే తిప్పితీశారని చెప్పుకున్నారు. ఇంత చెత్త క్లైమాక్స్ ను జీవితంలో చూడలేదంటూ విమర్శించారు. అయినా రామ్ పట్టించుకోలేదు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను వెంటేసుకొని తెలుగు రాష్ట్రాల్లో తెగ తిరిగాడు. పనిలోపనిగా కొన్ని ఆలయాల్లో పూజలు కూడా చేశాడు.

తన సినిమాను హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాడు రామ్. సినిమా ఫ్లాప్ అయినా ప్రమోషన్ లో భాగంగా ఇలా చెప్పుకోవడం కామన్ కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు. కానీ రామ్ మాత్రం అందర్లా లైట్ తీసుకోలేదు. కాస్త ఆలస్యమైనా తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్నాడు.

"చెప్పినంతగా తృప్తిపరచకపోయినప్పటికీ సపోర్ట్ చేసి, హలోగురు ప్రేమకోసమే సినిమాను హిట్ చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు. ఈసారి వడ్డీతో పాటు తిరిగిచ్చేస్తా."

ఇదీ రామ్ ఈరోజు చేసిన ట్వీట్. ఈ ట్వీట్ లో పరోక్షంగానైనా తన సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని అంగీకరించాడు రామ్. అంతా బాగానే ఉంది కానీ ఇన్నాళ్లూ లేనిది, ఇవాళ ఈ సినిమాపై ఇలా ప్రత్యేకంగా స్పందించడానికి రీజన్ ఏంటనేది మాత్రం అంతుచిక్కడం లేదు.

ప్రస్తుతం ఈ హీరో తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మూవీ ఉండొచ్చంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు ఫైనల్ చేయకపోయినా మేకోవర్ మాత్రం అయ్యాడు. సో.. నెక్ట్స్ సినిమాకు హైప్ తీసుకురావడం కోసం రామ్ ఇలా సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాడని కొందరంటున్నారు.

Show comments