రకుల్‌ సినిమాపై తనూశ్రీ దత్తా ఆగ్రహం

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో నటిస్తోన్న 'దే దే ప్యార్‌ దే' సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోన్న విషయం విదితమే. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అలోక్‌ నాథ్‌ అనే సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు నటించడంపై బాలీవుడ్‌ నటి, మాజీ హీరోయిన్‌ తనూ శ్రీ దత్తా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె హీరో అజయ్‌ దేవగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ప్రముఖ రచయిత్రి వింటా నందా, తనపై అలోక్‌ నాథ్‌ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించడం, 'మీ..టూ..' ఉద్యమంలో భాగంగా ఈ సంచలన విషయం వెలుగు చూడటం తెల్సిన విషయాలే. వింటా నందా ఫిర్యాదుతో అలోక్‌ నాథ్‌పై కేసు కూడా నమోదయ్యింది. 'మీ..టూ..' ఉద్యమ సెగల కారణంగా అలోక్‌ నాథ్‌ని కొన్ని సినిమాల నుంచి తొలగించారు కూడా. అలోక్‌ నాథ్‌ మాత్రమే కాదు, నానా పటేకర్‌ సహా పలువురు నటులు 'మీ..టూ..' సెగ కారణంగా కొన్ని నెలలపాటు సినిమా షూటింగ్‌లకు దూరమయ్యారు. 

అయితే, 'మీ..టూ..' ఉద్యమం కాస్త చల్లారడం, తనూశ్రీ దత్తా వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. విదేశాల నుంచి తిరిగొచ్చిన తనూ శ్రీదత్తా, 'దే దే ప్యార్‌ దే' సినిమాకి వ్యతిరేకంగా నినదిస్తోంది. ఆ సినిమాలో అలోక్‌ నాథ్‌ సీన్లపై బ్యాన్‌ విధించాలని ఆమె డిమాండ్‌ చేస్తోందిప్పుడు. 'అలోక్‌ నాథ్‌పై వచ్చిన ఆరోపణలు అజయ్‌ దేవగన్‌కి తెలియదా.? తెలిసీ ఆయనకు ఎలా అవకాశమిచ్చారు? అంటే, లైంగిక వేధింపుల విషయంలో అజయ్‌ దేవగన్‌ వైఖరి అభ్యంతరకరంగా మారిందని అర్థం చేసుకోవాలేమో..' అంటూ తనూశ్రీ దత్తా, అజయ్‌ దేవగన్‌ని కడిగి పారేసింది. 

ఇదిలా వుంటే, సినిమాలో ఏ నటుడ్ని తీసుకోవాలన్నది పూర్తిగా దర్శక నిర్మాతల ఇష్టమనీ, అలోక్‌ నాథ్‌ విషయంలో తనకెలాంటి ప్రత్యేకమైన ఆసక్తీ లేదని అజయ్‌ దేవగన్‌ అంటున్నాడు. తనూశ్రీ దత్తా వ్యాఖ్యలు తనను బాధించాయని అజయ్‌ దేవగన్‌ చెబుతోంటే, ఈ వ్యవహారంపై రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ డిఫెన్స్‌లో పడిపోయింది. 'దే దే ప్యార్‌ దే' సినిమాకి వ్యతిరేకంగా తన ఆందోళన కొనసాగుతుందని చెబుతోన్న తనూశ్రీ దత్తా, సినిమాకి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళే ఆలోచనలో కూడా వుందట. అదే గనుక జరిగితే, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న రకుల్‌ పరిస్థితి ఏంటట.?

Show comments