కోటి రూపాయల ఇంటితో రజనీకాంత్ కృతజ్ఞత!

కెరీర్ ఆరంభంలో సోలో హీరోగా తనను పెట్టి సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ కు ఇప్పుడు గురుదక్షిణ చెల్లించుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. విలన్ వేషాలు, ఇతర హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తున్న దశలో రజనీకాంత్ ను సోలో హీరోగా పెట్టి సినిమాను రూపొందించిన నిర్మాత కలైజ్ఞానం. 'భైరవ' అనే సినిమాతో రజనీకి తొలిసారి సోలో హీరో అవకాశం ఇచ్చారట ఆయన.

ఆనాటికి ప్రముఖ నిర్మాత అయిన కలైజ్ఞానం, ఆ తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నారట. ఇటీవల ఆయనకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ఆర్థిక పరిస్థితి చర్చకు వచ్చిందట. ఆయన అద్దె ఇంట్లో ఉన్నారనే విషయం సూపర్ స్టార్ కు తెలిసింది. దీంతో ఆయనకు సొంతింటిని కల్పించే బాధ్యతను తీసుకున్నారట రజనీకాంత్.

ఆ మేరకు చెన్నైలోని ప్రముఖ ప్రాంతంలో కోటి రూపాయల విలువ చేసే ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఇంటిని కొనుగోలు చేసి, దాన్ని కలైజ్ఞానంకు కానుకగా ఇచ్చారట రజనీకాంత్. ఇప్పుడు కోటి రూపాయలు అనేది రజనీకాంత్ కు ఏమాత్రం పెద్ద మొత్తంకాదు.

ఆ నిర్మాతకు మాత్రం సొంతిల్లు కూడా లేదనే బాధ తీవ్రమైనది. తనను నమ్మి హీరోగా సినిమాను తీసిన నిర్మాత అవస్థల్లో ఉండగా, ఇలా కృతజ్ఞత చూపించారు సూపర్ స్టార్. ఇతర స్టార్ హీరోలకూ ఇలాంటి కృతజ్ఞతా భావాలుంటే వారూ పరిపూర్ణమైన వ్యక్తులు కాగలరు.

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం