అప్పుడు నిర్దాక్షిణ్యంగా... ఇప్పుడు అండగా...

ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేకమైన అభ్యర్థి ఒకరున్నారు. ఆయనే టీఆర్‌ఎస్‌ తరపున స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పోటీచేస్తున్న డాక్టర్‌ తాటికొండ రాజయ్య. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత నాయకుడైన రాజయ్యకు వైద్య ఆరోగ్యశాఖ అప్పగించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. అంత ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తిని అవినీతి ఆరోపణలపై కొద్ది కాలానికే పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దళితుడని కూడా చూడలేదు.

అప్పటి నుంచి తెరమరుగైన రాజయ్య చరిత్ర ఇక ముగిసిందనే అందరూ అనుకున్నారు. కాని ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ఆయనకు అనూహ్యంగా టిక్కెట్టు ఇచ్చారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా కేసీఆర్‌ పట్టించుకోవడంలేదు. రాజయ్య ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఓ ఆడియో బయటకు వచ్చి రచ్చయినా రాజయ్యకు కేసీఆర్‌ అండగా ఉండటం విశేషం. అధిష్టానం తరపున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి వచ్చి రాజయ్యకు ధైర్యం చెప్పారు.

అప్పట్లో రాజయ్య 'బర్తరఫ్‌' వ్యవహారం  హాట్‌... హాట్‌గా మారింది. వాడి... వేడి చర్చనీయాంశమైంది.  'దళిత'  ముసుగులో  కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రచ్చ... రచ్చ చేసేందుకు ప్రతిపక్షాలు  ప్రయత్నాలు చేశాయి. రాజయ్యను అవమానకరమైన రీతిలో ఎందుకు బర్తరఫ్‌ చేయాల్సివచ్చిందో బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశాయి.  తనశాఖలో అవినీతి, అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, తనను బర్తరఫ్‌ చేస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి తాను తలవంచానని, తాను టీఆర్‌ఎస్‌లో ఒక కార్యకర్తగా, కూలీగా పనిచేస్తానని రాజయ్య చెప్పుకున్నారు.

కాని ఆ తరువాత మాట మార్చి తాను ఏసు ప్రభువు సాక్షిగా ఏ తప్పూ చేయలేదని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరోసారి తాను జీవితాంతం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. ఒకసారి బేలగా, మరోసారి కాస్తంత ధైర్యంగా, మరోసారి భయం భయంగా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది నిండకుండానే ఉప ముఖ్యమంత్రిని అందునా దళితుడిని పదవి నుంచి బర్తరఫ్‌ చేయడమంటే చిన్న విషయంకాదు. ఈ విషయంలో కేసీఆర్‌ తొందరపడినట్లు పైకి కనబడుతున్నా రాజయ్యను బర్తరఫ్‌ చేయాలనే నిర్ణయానికి రావడానికి ముందు ఆయన చాలా కసరత్తు చేశారు.

బర్తరఫ్‌ చేస్తే దళిత వర్గాల నుంచి అందుకు సంబంధించిన కులసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే విషయం కేసీఆర్‌కు తెలియంది కాదు. ఇప్పటికే ఆయన దళితులను మోసం చేశారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో రాష్ట్రం ఏర్పడగానే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని, తాను కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్‌ పదే పదే ప్రకటించారు. కాని రాష్ట్రం ఏర్పడిన తరువాత అందుకు భిన్నంగా జరిగింది.

అప్పట్లో రాజయ్య వ్యవహారాలపై  కేసీఆర్‌ ఓ కన్నేసి పెట్టారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ కంటే పకడ్బందీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. రాజయ్యపై నివేదిక కూడా తెప్పించుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ఓ సునామీలా విజృంభించడం, వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.

కేంద్రం నుంచి వచ్చిన పరిశీలక బృందం కూడా ఆస్పత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇదే అదనుగా ముఖ్యమంత్రి రాజయ్యపై వేటు వేశారు. ఒకప్పుడు రాజయ్యకు కఠినశిక్ష విధించిన కేసీఆర్‌ ఇప్పుడు ఆయనకు అండగా నిలవడం విశేషమనే చెప్పుకోవాలి.

Show comments