కుక్క తోక వంకర.. నేనూ అంతే

సాధారణంగా ఇండస్ట్రీలో ఇలాంటి స్టేట్ మెంట్స్ రామ్ గోపాల్ వర్మ ఇస్తుంటాడు. కానీ ఈసారి రాజమౌళి నోటి నుంచి ఇలాంటి స్టేట్ మెంట్ వచ్చింది. అవును.. తనను తాను కుక్క తోక వంకర అనే సామెతతో పోల్చుకున్నాడు రాజమౌళి. దీనికి ఓ కారణం కూడా ఉంది.

బాహుబలి-2 సినిమా రిలీజైన తర్వాత గ్రాఫిక్స్ పై రాజమౌళికి మొహం మొత్తింది. ఏ జానర్ లో సినిమా చేసినా, తన నెక్ట్స్ సినిమాలో గ్రాఫిక్స్ మాత్రం ఉండవని గతంలో తేల్చిచెప్పాడు రాజమౌళి. పూర్తిగా యాక్షన్, ఎమోషన్ మీద ఆధారపడి కథ రాసుకుంటానని, గ్రాఫిక్స్ జోలికి వెళ్లనని మాత్రం తనకుతానుగా ప్రకటించుకున్నాడు. కానీ రాజమౌళి ఆ మాట మీద నిలబడలేదు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్-ఆర్-ఆర్ సినిమాలో మరోసారి పూర్తిస్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని ప్రకటించాడు జక్కన్న. 350 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ ఉంటాయని స్పష్టంచేశాడు. కుక్క తోక వంకర అనే టైపులో గ్రాఫిక్స్ విషయంలో తన బుద్ధి కూడా అంతే అంటూ చమత్కరించాడు రాజమౌళి.

బాహుబలిలో గ్రాఫిక్స్ అన్నీ రిచ్ గా, గ్రాండియర్ లుక్ లో కనిపిస్తాయని.. ఆర్-ఆర్-ఆర్ లో మాత్రం సహజత్వం కోసం గ్రాఫిక్స్ వాడతామని అంటున్నాడు రాజమౌళి. కేవలం గ్రాఫిక్స్ కోసమే తమ వర్కింగ్ డేస్ ను కూడా కుదించుకున్నామని తెలిపిన ఈ దర్శకుడు.. వచ్చే ఏడాది జనవరి నాటికి గ్రాఫిక్ టీమ్ కు మెటీరియల్ ఇచ్చేస్తామని, అక్కడ్నుంచి నెల రోజుల పాటు వాళ్లు గ్రాఫిక్ వర్క్ మీద ఉంటారని తెలిపాడు.

ఇలా ఆర్-ఆర్-ఆర్ లో కూడా భారీ గ్రాఫిక్స్ ఉంటాయని స్పష్టంచేశాడు రాజమౌళి. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను అహ్మదాబాద్, పూణెలో ప్లాన్ చేశారు. ఏకథాటిగా 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. అజయ్ దేవగన్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు. 

ఆర్-ఆర్-ఆర్ ప్రెస్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!