రాజకీయం సంస్కారాన్ని చంపేస్తుందా?

చదువు సంస్కారం నేర్పుతుంది అనుకుంటాం..మంచి  కుటుంబం నుంచి వచ్చారు కదా కాస్త సంయమనం అలవడి వుంటుందేమో అనుకోవడం కూడా సహజం. డబ్ఫు, మాంచి సర్కిల్ వుంది కదా మాట తీరు కూడా బాగానే అలవాటు అయి వుంటుందనుకోవడం కూడా సహజం. అన్నింటికి మించి మాంచి హోదాలో వున్నందుకు అయినా ఆచి తూచి మాట్లాడతారు అనుకుంటాం. 

కానీ ఇవన్నీ రఘురామకృష్ణం రాజు విషయంలో అత్యాశలే.

గోదావరిజిల్లా అనగానే గుర్తుకు వచ్చే ఆప్యాయమైన మాట. భీమవరం రాజులు అనగానే కళ్లముందుకు వచ్చే నిండైన ఆతిథ్యం, పెద్ద పెద్దవారితో ఆయనకు వున్న సాన్నిహిత్యం, ఎంపీగా ఆయనకు వున్న బాధత్యలు, హద్దులు,  అన్నింటికి మించి ఆయనకు వున్న డబ్బూ దస్కం కలిపి ఆయనను ఓ రేంజ్ లో ఊహించుకునేలా చేస్తాయి.

కానీ ఆయనేకే పుట్టిందో, మరెవరు ఐడియా ఇచ్చారో, జగన్ ను, ఆయన మనుషులను ఎంతగా తిడితే, మరెంతగా రెచ్చగొడితే అంత త్వరగా వైకాపా నుంచి బహిష్కరణకు గురై బయటకు వచ్చి భాజపాలో చేరిపోవచ్చు అని భావించినట్లుంది. నిత్యం అదే యజ్ఞంగా పెట్టుకున్నారు. ఈ ధోరణిలో అ..ఆ దగ్గర మొదలు పెట్టి చివరి వరకు వెళ్లిపోయారు. ఓ దశలో ఆయన అన్నీ వదలేసారు. 

ఇప్పుడు రఘురామ కృష్ణ రాజు అరెస్టు ను ఖండిస్తున్నవారు, లేదా దానిపై కామెంట్ చేస్తున్నవారు ఓ రోజంతా ఓపిక చేసుకుని ఆయన గత కొన్ని నెలలుగా నిత్యం రచ్చబండ అంటూ చేసిన రచ్చను చూడాలి. ఇలా చేసిన విమర్శల్లో నిర్మాణాత్మకమైన విమర్శలు ఎన్ని? వ్యక్తిగత దూషణలు ఎన్ని? పరమ బూతులు ఎన్ని అన్నది లెక్కలు తీయాలి. ఆపైన అరెస్ట్ పై మాట్లాడాలి. 

ఓ ఎంపీగా తను వున్న పార్టీ అంటే కిట్టకపోవడం లేదా తమ నాయకుడు అంటే సరిపడకపోవడం తప్పు కాదు. కానీ రెండు విషయాలు గుర్తించాలి.అయితే పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి.లేదా పార్టీలో వున్నపుడు, ముఖ్యంగా హోదాలో వున్నపుడు కొన్ని పద్దతులకు కట్టుబడి మాట్లాడాలి. కానీ ఈ రెండు విషయాలను రఘురామకృష్ణం రాజు గాలికి వదిలేసారు. 

ఇప్పుడేమయింది. ఏమీ కాదు. రఘరామ కృష్ణం రాజు అరెస్ట్ తో ఏమీ జరిగిపోదు. ఆయన ఇట్టే బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువ. కానీ ఆ తరువాత ఆయన ఎలా వ్యవహరిస్తారు అన్నది ఓ పాయింట్.

గతంలో కన్నా రెచ్చిపోతారా? తెగించిన వాడికి తెడ్డే పరికరం అన్నట్లు వ్యవహరిస్తారా? లేక సంయమనం పాటించి, ఆచి తూచి ముందుకు వెళ్తారా? అన్నది చూడాలి. కానీ ఇక్కడ ఆయన గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పటి వరకు ఆయన ఏం మాట్లాడినా తెలుగుదేశం అభిమానులు చంకలు గుద్దుకున్నారు. 

వైకపా అభిమానులు తిట్లు లంకించుకున్నారు. కానీ జనం మాత్రం ఈ వీడియోలకన్నా జబర్దస్త్ విడియోలు బెటర్ అనుకున్నట్లు వదిలేసారు. ఎప్పుడయితే యుద్దం ఓపెన్ అయిపోయిందో ఇకపై రఘురామకృష్ణం రాజు ఇంకెంత రెచ్చిపోయినా అస్సలు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే పిల్లికి ఎలుకకు పొసగదు అని తెలిసిపోయిందిగా? మరెందుకు మనకు ఆసక్తి?

Show comments