రైల్వే జోన్‌ పాపం కూడా జగన్‌దేనట.!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదో తెలుసా.? బీజేపీతో వైఎస్‌ జగన్‌ అంట కాగబట్టి..
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఎందుకు రాలేదో తెలుసా.? బీజేపీతో వైఎస్‌ జగన్‌ అంట కాగబట్టి..
కడపజిల్లాలో ఉక్కు పరిశ్రమ విషయంలోనూ పాపం వైఎస్‌ జగన్‌దే..

ఇంతకీ, గడచిన మూడేళ్ళలో బీజేపీతో ఎవరు అంటకాగినట్లు.? ఇంకెవరు, తెలుగుదేశం పార్టీనే. 2014 ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కలిసి పోటీ చేశాయి. నాలుగేళ్ళు బీజేపీ - టీడీపీ సంసారం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో సజావుగానే సాగింది. ఈ నాలుగేళ్ళలో పైన చెప్పుకున్న మూడు ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలు చేస్తూనే వచ్చింది. ప్రతిసారీ, తెలుగుదేశం పార్టీ - వైసీపీ ఉద్యమాలకు అడ్డుతగలడమే పనిగా పెట్టుకుంది.

ప్రత్యేకహోదా దండగ.. అని చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారే. రైల్వే జోన్‌ సంగతి సరే సరి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌కి సంబంధించి విభజన చట్టంలో స్పష్టత వున్నా, ఆ రైల్వేజోన్‌ని విజయవాడ - గుంటూరులకు తగరలించేందుకు అధికార పార్టీలో జరిగిన 'కమ్మ'నైన లాబీయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉక్కు పరిశ్రమ విషయంలో టీడీపీ నాటకాలేంటో, సీఎం రమేష్‌ నిరాహార దీక్ష 'డ్రామా' చెప్పకనే చెబుతుంది.

ఇక, తాజాగా మరోమారు రైల్వే జోన్‌ వ్యవహారంపై టీడీపీ నేతలు హైడ్రామా క్రియేట్‌ చేశారు. విజయవాడలో రైల్వే జీఎంతో జరిగిన సమావేశంలో టీడీపీ ఎంపీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 'రైల్వేజోన్‌ ఇవ్వాల్సిందే..' అంటూ గుస్సా అయ్యారు. సందట్లో సడేమియా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి పారిపోయారంటూ ఎద్దేవా చేసేశారు. రైల్వే జోన్‌ కోసం వైసీపీ కేంద్రాన్ని నిలదీయడంలేదనీ, కేంద్రంతో వైసీపీ కుమ్మక్కయ్యిందనడానికి ఇదే నిదర్శనమనీ టీడీపీ ఎంపీలు మండిపడ్డారు.

నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగిన టీడీపీ.. ఆ పాపాన్ని కడుక్కునే క్రమంలో, బురద వైఎస్సార్సీపీ మీద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. 'తా చెడ్డ డాష్‌ డాష్‌.. అంతటినీ చెడగొట్టింది..' అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. ఉత్తరాంధ్ర నుంచే టీడీపీ ముఖ్య నేత అశోక్‌ గజపతిరాజు కేంద్రంలో నాలుగేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. మరో టీడీపీ ముఖ్య నేత సుజనా చౌదరి, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడాయె. ఈ ఇద్దరూ రైల్వే జోన్‌ కోసం ఏనాడైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా.?

మొత్తమ్మీద, తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళూ బీజేపీతో అంటకాగి.. ఇప్పుడేమో వైసీపీ - బీజేపీ అంటకాగుతున్నాయంటూ బుకాయించేందుకు ప్రయత్నిస్తోందన్నమాట. ఒకటికి వందసార్లు తప్పుని ఒప్పు.. అని చెప్పేస్తే, అది ఒప్పయిపోతుందన్నది టీడీపీ భావన కావొచ్చుగాక. కానీ, టీడీపీకి అంటిన మరక అంత తేలిగ్గా వదిలిపోదు. చరిత్ర.. టీడీపీని క్షమించదు. అది ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు.. రైల్వే జోన్‌ విషయంలో కావొచ్చు.. ఉక్కు పరిశ్రమ విషయంలో కావొచ్చు.. మరో విషయంలో కావొచ్చు. 

Show comments