రాహుల్.. తెలిసే మాట్లాడుతున్నారా?

తొలిసంతకం.. హోదాపైనే అంటూ తెలుగువారి మనసులు గెలుచుకునే ప్రయత్నం చేసారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆంధ్రలో అసలు అడుగు పెట్టడానికే భయపడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతలు గప్ చుప్ గా వుండిపోయారు ఇన్నాళ్లు. కానీ ఇప్పుడు మోడీ పుణ్యమా అని రాహుల్ ఆంధ్రకు రాగలిగారు. నాలుగేళ్ల క్రితం మోడీ పల్లకీని మోసిన బాబు అను'కుల' మీడియా, ఇప్పుడు ఆ పల్లకీలోంచి మోడీని దింపేసి, రాహుల్ ను కూర్చోబెట్టి మోయడం ప్రారంభించింది. నాలుగేళ్ల క్రితం తల్లి కాంగ్రెస్ అంటూ ఎకసెక్కం ఆడిన 'మన' మీడియా ఇప్పుడు 'మా తల్లే కాంగ్రెస్' అన్నట్లు బిహేవ్ చేస్తోంది.

ఏం చేస్తాం.. ఒక్కపుడు రాజకీయ పార్టీలే అన్నీ వదిలేసినట్లు వ్యవహరించేవి. ఇప్పుడు మన తెలుగునాట మెజారిటీ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా అలాగే తయారయింది. జనం ఏమనుకుంటారన్న ధ్యాసలేదు. దాంతో కాంగ్రెస్ కు ఇప్పుడు మీడియా సపోర్టు దొరికింది. ఆంధ్రలో మీడియా సపోర్ట్ దొరికితే ఇంకేకావాలి.

రాహుల్ ఆంధ్రకు వచ్చారు. సారీ, ఆంధ్రకు వస్తే తెలుగుదేశం పార్టీకి కష్టం. అందుకే రాయలసీమకు వచ్చారు. అక్కడేదో రెడ్లు ఓట్లు, వైకాపా ఓట్లు చీల్చేసి తెలుగుదేశం పార్టీకి సాయం చేద్దామనే తెరచాటు ఆలోచనతో కావచ్చు.

సరే వచ్చి ఏమన్నారు. తొలిసంతకం హోదా ఆదేశాలపైనే అన్నారు. నిజమే. ఆంధ్ర జనాలకు అందరికీ సంతోషకరమైన వార్తే. కానీ రాహుల్ వల్ల అవుతుందా? అన్నదే క్వశ్చను. ఎందుకంటే కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసి, ఒంటి చేత్తో గెలిచి, మెజారిటీ స్థానాలు తీసుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీన్ ఈ దేశంలో ప్రస్తుతానికి అయితే లేదు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో అంటకాగాలి. ఆయా పార్టీలు అన్నింటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకహోదా విషయంలో సమస్యలు వున్నాయి. మరి వీటిని పట్టించుకోకుండా రాహుల్ హోదా ఇచ్చేయగలరా? అంతెందుకు, ఆంధ్రకు హోదా ఇస్తున్నాం అని చెప్పి, ఇప్పుడు తెలంగాణలో జనం ముందుకు ఓట్ల కోసం కాంగ్రెస్ వెళ్లగలదా?

గెలిచిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకే వివిధ పార్టీలను బజ్జగించాలి, వరాలు ఇవ్వాలి. అలాంటి టైమ్ లో తొలిసంతకానికి ఆ పార్టీలు అడ్డంపడవన్న గ్యారంటీ ఇవ్వగలదా? పోనీ సెటిలర్ల ఓట్లు సులువుగా వస్తాయి. తెలంగాణ మహాకూటమి మానిఫెస్టోలో హోదా ఇవ్వడం అనే దానిపై ఓ మాట చేర్చగలరా?

కానీ రాహుల్ గాంధీ మాట ఒక దానికి మాత్రం పనికి వచ్చింది. తెలుగు మీడియాలో బ్యానరు స్టోరీలుగా వేసి, రాహుల్ గాంధీ పల్లకీని మరింత పదిలంగా మోయడానికి మాత్రం పనికి వస్తోంది. తెలుగుదేశం పొత్తు ఎలావుంటుందో? కేసీఆర్ కు, మోడీకి, ఇలా చాలా మందికి తెలియవచ్చింది. ఇక రాహుల్ కు తెలియాల్సి వుంది.

Show comments