పుతిన్ దెబ్బ‌... యూరోప్ గ‌జ‌గ‌జ‌!

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ యుద్ధ దాహం... ఉక్రెయిన్‌పై దాడితో తీరేలా క‌నిపించ‌డం లేదు. కార‌ణాలు ఏవైనా ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని ప్ర‌పంచ‌మంతా త‌ప్పు ప‌డుతోంది. ర‌ష్యాపై ఆధిప‌త్యం చెలాయించేందుకు ఉక్రెయిన్‌ను అమెరికా వ్మూహాత్మ‌కంగా త‌న చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే అమెరికా, ర‌ష్యా ఆధిప‌త్య పోరులో ఉక్రెయిన్ అన‌వ‌స‌రంగా బ‌లి ప‌శువు అవుతోంది.

తొమ్మిది రోజులుగా ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు చేస్తూనే ఉంది. కానీ ర‌ష్యాకు ఉక్రెయిన్ లొంగ‌లేదు. శ‌క్తిమేర‌కు ర‌ష్యాపై ఉక్రెయిన్ పోరాడడం ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రుస్తోంది. ఒక‌ట్రెండు రోజుల్లో ఉక్రెయిన్‌ను ర‌ష్యా హ‌స్త‌గ‌తం చేసుకుంటుంద‌ని భావించారు. అయితే ఉక్రెయిన్ వీరోచిత పోరాటంతో ర‌ష్యా కంగుతింది.

ఈ నేప‌థ్యంలో ర‌ష్యా త‌న దాడిని ముమ్మ‌రం చేసింది. ర‌ష్యా దుందుడుత‌నం యావ‌త్ యూరోప్‌ను నాశ‌నం చేసేలా ఉంది. దీంతో  యూరోప్ దేశాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. యూర‌ప్‌లోనే అతిపెద్ద న్యూక్లియ‌ర్ ప్లాంట్ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జాయాలో ఉంది. దీన్ని ర‌ష్యా టార్గెట్ చేయ‌డంతో యూరోప్ ఆందోళ‌న చెందుతోంది. ఈ ప్లాంట్‌పై ర‌ష్యా రాకెట్ దాడుల‌కు పాల్ప‌డింది. దీంతో ప్లాంట్‌లో భారీగా మంట‌లు చెల‌రేగిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు భ‌యాందోళ‌న క‌లిగిస్తున్నాయి. ప్లాంట్ సిబ్బంది వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై మంట‌ల‌ను ఆర్పి వేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

ఒకవేళ న్యూక్లియ‌ర్ ప్లాంట్ పేలిపోతే  ఐరోపా భద్రత ప్ర‌మాదంలో ప‌డుతుంది. ఐరోపాకు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని అందులోని దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఉక్రెయిన్‌లో న్యూక్లియ‌ర్ ప్లాంట్‌పై దాడి వ‌ల్ల కేవ‌లం ఉక్రెయిన్‌కు మాత్రమే న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని, మిగిలిన దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంద‌ని యూకే ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ఆయ‌న ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి ఫోన్ చేసి మాట్లాడారు. 

అలాగే ర‌ష్యాను క‌ట్ట‌డి చేయాల‌ని ఐక్య‌రాజ్య స‌మితికి విన్న‌వించారు. న్యూక్లియ‌ర్ ప్లాంట్‌పై దాడిని వెంట‌నే నిలిపివేయాల‌ని కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిస్ ట్రూడో డిమాండ్ చేశారు. న్యూక్లియ‌ర్ ప్లాంట్‌కు పెను ప్ర‌మాదం సంభ‌విస్తే ...చెర్నోబిల్ కంటే పది రెట్లు న‌ష్టం వాటిల్లుతుంద‌ని న్యూక్లియ‌ర్ శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.   చెర్నోబిల్ నాటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ప్రస్తుత ఉక్రెయిన్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉంది.

1986 ఏప్రిల్ 26న క‌నురెప్ప‌లు మూసి తెరిచేలోపే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం సంభవించింది. 1986 ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో  1:23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలమవడంతో భారీ విస్ఫోట‌నం జ‌రిగింది.  రేడియోధార్మికత వల్ల 134 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 50 మంది మరణించారు.

చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియో ధార్మికతతో కూడిన పొగ, వ్యర్థాలు గాల్లో కలిసిపోయి ఐరోపా వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ల‌క్ష‌ల మంది ప‌లు రోగాల బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ర‌ష్యా దాడుల వ‌ల్ల అతి పెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌కు ఏదైనా జ‌రిగితే, చెర్నోబిల్ కంటే ప‌ది రెట్ల ప్ర‌మాదం జ‌రుగుతుంద‌నే హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో యూరోప్ ఆందోళ‌న‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

Show comments