పుష్కర పాపం.. చంద్రబాబుది కాదట.!

గోదావరి పుష్కరాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించే క్రమంలో 'భద్రత'ని పూర్తిగా ప్రభుత్వం గాలికొదిలేసింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు, తన ప్రచార ఆర్భాటంలో మునిగిపోయారు తప్ప.. ఆ ప్రచార ఆర్భాటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే, ఆయన చంద్రబాబు ఎలా అవుతారు.? రాజమండ్రిలో పుష్కర ఘాట్‌ వద్ద పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట జరగడం, ఆ ఘటనలో 29 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం తెల్సిన విషయాలే.

ఇంతకీ, ఆనాటి ఆ పుష్కర పాపం ఎవరిది.? చంద్రబాబుది మాత్రం కాదని సోమయాజులు కమిషన్‌ తేల్చి చెప్పింది. ఆ కమిటీ నివేదికని చంద్రబాబు సర్కార్‌, అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కమిషన్‌లు వేయడమెలాగో, వాటిని వాడుకోవడమెలాగో చంద్రబాబుకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి మంజునాథ కమిషన్‌ ఏర్పాటు చేసిన చంద్రబాబు, ఆ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ నివేదిక ఇవ్వకుండానే, తనకు 'అనుకూలంగా' వున్న ఓ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

పుష్కరాల తొక్కిసలాట మహా పాపం. ఇందులో ఇంకో మాటకు తావులేదు. 'ఫలానా ముహూర్తానికి పుష్కరస్నానం చేయడం ఉత్తమం..' అని పండితులు చెప్పబట్టి, ఆ సమయానికి పుష్కర ఘాట్‌కి లక్షలాది మంది వస్తారని తెలిసినా చంద్రబాబు, అదే సమయానికి పుష్కరస్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిస్థితిని ముందే ఊహించి, తగు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన 'యంత్రాంగం' చేతులెత్తేసింది. చివరికి, 29 మంది ప్రాణాలు పోయాయి.

సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుని పిలిపించుకుని, ఆయన దర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీని చంద్రబాబు ప్లాన్‌ చేయడం, ఆ గలాటా కారణంగా, జనసందోహం పెరిగి, ఆ తర్వాత తొక్కిసలాట జరిగిందన్నది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నమాట. అసలేం జరిగిందో, మీడియాలో స్పష్టంగా కన్పించింది. చిత్రమేంటంటే, ఆ మీడియాపైనే సోమయాజులు కమిషన్‌ గుస్సా అవుతూ నివేదిక ఇచ్చింది. 'అతి ప్రచారం, మీడియా అత్యుత్సాహం, స్వామీజీలు ప్రజల్లో నాటిన మూఢ నమ్మకాలు.. ముహూర్తాల పిచ్చి..' ఇవన్నీ కారణాలని నివేదికలో తేల్చారు.

ప్రచారం విషయానికొస్తే, మీడియా చేసిన హడావిడి కంటే, ప్రభుత్వం చేయించిన హడావిడి ఎక్కువ. ఆ లెక్కన.. 29 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. కానీ, చంద్రబాబు తెలివిగా తప్పించేసుకున్నారు.. తనకు అనుకూలంగా నివేదిక తెప్పించేసుకున్నారు.

అధికారం చంద్రబాబు చేతుల్లో వుంది గనుక, క్లీన్‌ చిట్‌ ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, పోయిన ప్రాణాలు.. తమవారిని పోగొట్టుకుని జీవచ్ఛవాలుగా బతుకుతున్నవారి జీవితాలు.. చంద్రబాబుని క్షమించే ప్రసక్తే లేదు.

Show comments