ఇస్మార్ట్ శంకర్ నాకు డెడ్ లైన్ లాంటిది

వరుసగా ఫ్లాపులిస్తున్న పూరి జగన్నాధ్ ఈసారి కాస్త జాగ్రత్తపడినట్టు కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాను తనకు డెడ్ లైన్ గా చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. ఈ సినిమా ఆడకపోతే ఇక తనకు కష్టమే అనే విధంగా రియాక్ట్ అయ్యాడు.

ఈ సినిమా అవుట్ పుట్ చూశాక మళ్లీ లేస్తాను అనే నమ్మకం వచ్చింది. గడిచిన మూడేళ్లలో నాకు ఏదీ వర్కవుట్ అవ్వలేదు. టెంపర్ తర్వాత ఏదీ ఆడలేదు. ఈ సినిమా నాకు డెడ్ లైన్ లాంటిది. "గ్రేట్ ఆంధ్ర"కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలా తన మనసులో భయాన్ని బయటపెట్టాడు పూరి. కేవలం హిట్ కొట్టడం కోసమే పక్కా మాస్ మసాలా కథను తీసుకున్నట్టు తెలిపిన పూరి, పోకిరి సినిమా ప్రభావంపై సూటిగా స్పందించాడు.

"నా నుంచి పోకిరి కంటే ఎక్కువగా ఆశిస్తున్నారు. అన్నీ పోకిరిలు అవ్వవు కదా. ఒక్కో స్టోరీ ఒక్కోలా అవుతుంది. పోకిరితో కంపేర్ చేయడం నాకు కాస్త భారంగానే ఉంటుంది. అల్టిమేట్ గా స్టోరీ వర్కవుట్ అవ్వాలి. నా సినిమాలన్నీ తక్కువ రోజుల్లోనే తీస్తాను కానీ, మేకింగ్ పరంగా బాగానే ఉంటాయి. చుట్టేసినట్టు ఉండవు."

తను రాసుకున్న కథలపై కూడా పూరి రియాక్ట్ అయ్యాడు. ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటే స్క్రీన్ ప్లే బాగుంటుందని కదా అనే కామెంట్స్ ను ఖండించాడు. బయట కథలు చేయడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు.

"టెంపర్ హిట్ అయింది కాబట్టి బయట కథలే చేయాలని అనుకోను. కథనచ్చితే బయట కథలు కూడా చేస్తాను. టెంపర్ హిట్ అయిందని బయట కథల సెంటిమెంట్ పెట్టుకోను. నేను ఇంకాస్త టైమ్ తీసుకుంటే స్క్రీన్ ప్లే బాగా వస్తుందని కొందరు అంటుంటారు. అలాంటివేం నమ్మను. 10-12 రోజుల్లో కథ రాసేస్తాను. ఆ రోజుకు నాకు అనిపించింది నచ్చితే రాసేస్తాను. మళ్లీ వెనక్కి చూడను."

సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ తన పంథా మాత్రం మారదని స్పష్టంచేశాడు పూరి. తనదగ్గర చాలా కథలున్నాయని, వాటిలోంచి ఎగ్జయిట్ అయ్యే ఓ స్టోరీలైన్ ను ఎంచుకుంటానంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత 2 నెలలు గ్యాప్ తీసుకొని, శారీరకంగా ఫిట్ గా తయారవుతానంటున్నాడు పూరి. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడట.