పూరికి చాన్స్ అంత వీజీ కాదు

ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇరవై కోట్ల సినిమా ముఫైకోట్లో, నలభై కోట్లో కలెక్ట్ చేస్తుంది. అందులో సందేహంలేదు. అభిమానులంతా పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. పూరి జగన్నాధ్ కు వున్న అదృష్టం ఏమిటంటే యూత్ అభిమానులు ఆయనకు అంటూ కాస్త పెద్ద సంఖ్యలో వుండడం. అందుకే ఇస్మార్ట్ శంకర్ కు రామ్ తో సంబంధం లేకుండా అంత బజ్ వచ్చింది. అయితే ఈ సినిమా ఇంత హిట్ అయిపోవడంతో పూరి మళ్లీ పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వుంది అనుకుంటే, అది కాస్త అనుమానమే.

ఎందుకంటే దానికి చాలా కారణాలు వున్నాయి. పూరితో సినిమా తీయడానికి ఇప్పుడు నిర్మాతలు అయితే తహతహలాడుతూ వుండొచ్చు. అది వాస్తవం. కానీ హీరోలు కావాలి. అది కూడా టాప్ లైన్ హీరోలు కావాలి. ఇప్పటికే పూరి ట్రయ్ చేయని హీరోలు లేరు. నితిన్, కళ్యాణ్ రామ్ ఇలా సెకండ్ లైన్ హీరోలు అందరినీ ట్రయ్ చేసారు. ఇక టాప్ లైన్ హీరోలు అందరితో సినిమాలు చేసారు కేవలం చిరు, వెంకీ తప్పించి. కానీ ఇప్పుడు టాప్ లైన్ హీరోలు ఎవ్వరూ రెండేళ్ల వరకు ఖాళీ లేరు. ప్రతి ఒక్కరి చేతిలో కనీసం రెండు నుంచి మూడు కమిట్ మెంట్ లు వున్నాయి. పెద్ద పెద్ద ఫామ్ లో వున్న డైరక్టర్లు క్యూలో వున్నారు.

ఇలాంటి టైమ్ లో పూరి దగ్గర అత్యధ్భుతమైన కథ వుంటే తప్ప ఎవ్వరూ అర్జెంట్ గా డేట్ లు ఇచ్చే పరిస్థితి లేదు. పూరి దగ్గర లైన్ లు వుంటాయి కానీ కథలు కాదు. వాస్తవం మాట్లాడుకుంటే ఇస్మార్ట్ శంకర్ కూడా గొప్ప కథ కాదు. విక్రమార్కుడు సినిమాకు సైన్స్ అండ్ టెక్నాలజీ జోడించినట్లు లేదా డాన్ సినిమాకు మోడరన్ వెర్షన్ తీసినట్లు తయారైన కథ. అది కూడా హాలీవుడ్ కథ నుంచి తెచ్చిన ఐడియా. సినిమాలో మిగిలిన వ్యవహారాలు పక్కనపెట్టి, కేవలం కథ గురించి మాట్లాడుకుంటే చాలా వీక్ అని క్లియర్ గా తెలుస్తుంది. పూరి మీద వున్న కంప్లయింట్ నే అది. ఆయన కథ మీద ఎక్కువ శ్రద్ద పెట్టరు అని.

చాలాకాలంగా కాస్త పేరున్న హీరో, పేరున్న డైరక్టర్ దగ్గర నుంచి ఫక్తు మసాలా సినిమా రాలేదు. అదే ఇస్మార్ట్ శంకర్ అదృష్టం. అందువల్ల హీరోలు కూడా పూరి పక్కాగా బ్యాక్ అయ్యారా లేదా అన్నది చూస్తారు. అందులో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏం నడుస్తోంది అంటే పెద్ద హీరోలు డైరక్టర్లను గుడ్డిగా నమ్మడంలేదు. ఫుల్ స్క్రిప్ట్ అడుగుతున్నారు. అది బాగాలేదంటే పక్కన పెడుతున్నారు. రంగస్థలం అంత పెద్ద హిట్ ఇచ్చినా, మహేష్ స్క్రిప్ట్ నచ్చక సుకుమార్ ను లైన్ లో వెనక్కు పెట్టారు. బాలయ్య కూడా బోయపాటిని లైన్ లో వుంచింది అందుకే అన్న వార్తలు వున్నాయి.

అందువల్ల పూరి కూడా ఇఫ్పుడు సూపర్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటేనే సరైన చాన్స్ వస్తుంది. లేదూ అంటే మళ్లీ సెకండ్ లైన్ హీరోలు ఎవరితో ఒకరితో సినిమా చేయాల్సిందే. కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. ఈ హిట్ ను పూరి తనకు కూడా ఉపయోగపడేలా చూడాలనుకుంటారు. కొడుకును హీరోగా నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనపై వుంది. ఇప్పటికే ఓ సినిమా అనౌన్స్ చేసి రెడీ గా వుంది. అందువల్ల ఇప్పుడు ఆయన మళ్లీ అటు వెళ్లినా ఆశ్చర్యంలేదు.

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..