నాన్న పేరు మార్చార‌నే అక్క‌సు!

హెల్త్ యూనివ‌ర్సిటీకి త‌న తండ్రి ఎన్టీఆర్ పేరు తొల‌గించార‌ని ఆయ‌న కూతురు, బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రి ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అక్క‌సుతో ఉన్నారు. ఆ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌కుండా ఇత‌రేతర అంశాల్ని తెర‌పైకి తెచ్చి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పురందేశ్వ‌రి ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. పురందేశ్వ‌రి విమ‌ర్శ‌ల వెనుక ఉద్దేశాన్ని ప‌సిగ‌ట్ట‌లేని ప‌రిస్థితిలో జ‌నం లేరు.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ పురందేశ్వ‌రి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. కేవ‌లం జ‌గ‌న్‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్క డానికే ఆమె మీడియా ముందుకొచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పేర్లు మార్చ‌డంపై ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి లేద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో స‌మ‌స్య‌లేవీ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. మద్య‌నిషేధమ‌ని మ‌హిళ‌ల‌ను మోస‌గించార‌ని ఆమె విమ‌ర్శించారు.

రాష్ట్రానికి ఒక్క‌టంటే ఒక్క ప‌రిశ్ర‌మ కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని పురందేశ్వ‌రి విమ‌ర్శించారు. పారిశ్రామిక వేత్త‌లు పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకుంటున్నార‌ని ఆమె ఆరోపించారు. ఇలా టీడీపీ రోజూ చేసే ఆరోప‌ణ‌లే ఇవాళ పురందేశ్వ‌రి నోట వెలువ‌డ్డాయి. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌ట్టు ప్ర‌త్యేక హోదా ఏపీకి ఇస్తే ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని ప‌దేప‌దే జ‌గ‌న్ చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌య‌మై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా, ప్ర‌స్తుతం పాల‌కుడిగా జ‌గ‌న్ అనేక‌మార్లు విజ్ఞ‌ప్తి చేశారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం...ముగిసిన అధ్యాయ‌మ‌ని పురందేశ్వ‌రితో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు మాట్లాడారు. ఇప్పుడు ఏపీకి పరిశ్ర‌మ‌లు రావ‌డం లేద‌ని, ఉన్న‌వి పోతున్నాయ‌ని విమ‌ర్శంచ‌డం వెనుక ఎవ‌రి క‌ళ్లలో ఆనందం చూడ‌డానికో పురందేశ్వ‌రి చెబితే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. మేడ‌మ్ గారూ... వినిపిస్తోందా? 

Show comments