బీజేపీలో కొత్త పదవి, అసలు పార్టీలో ఉంటారా?

గత ఎన్నికల ముందేమో అధికారాన్ని ఇస్తే చాలు.. ఐదు కాదు,  పది కాదు.. పదిహేనేళ్ల పాటు ఏపీకి ప్రత్యేకహోదా అని కమలనాథులు గట్టిగా ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో బీజేపీ నేతలు ఈ పాట పాడారు. తీరా అధికారం దక్కించుకున్నాకా ముగ్గురూ కలిసి ఏపీకి పంగనామాలు పీకారు. ఇలా నిలువునా మోసం చేసి దగా చేసి.. ఇప్పుడు ఒక్కోరు ఒక్కో మాటతో ఎన్నికలకు రెడీ అవుతున్నారు.

ఎన్నికల ముందేమో హోదా అని.. ఎన్నికల తర్వాత హోదా ఎందుకు? హోదాతో ఏమొస్తుంది అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. వాళ్ల హామీలకు తనది పూచీ అని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు ఏవో కొత్త కబుర్లు చెబుతున్నాడు.

అదలా ఉంటే.. ఏపీ బీజేపీ కొత్తగా ఏపీ ప్రజల కోసం మెనిఫెస్టోని తయారు చేస్తోందట! దీంట్లో అనేక మందిని సభ్యులుగా ప్రకటించారు. అయినా గత ఎన్నికల నాటి హామీలకే దిక్కు లేకుండా చేసింది బీజేపీ. అధికారం సంపాదించుకుని సైతం మోసం చేసింది. ఇప్పుడు మళ్లీ మెనిఫెస్టో అంటోంది.

ఇక మరో విశేషం ఏమిటంటే.. ఈ మెనిఫెస్టో కమిటీలో మొదటి పేరు దగ్గుబాటి పురందేశ్వరి. ఈమె నాయకత్వంలో ఏపీ ప్రజల కోసం  రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మెనిఫెస్టో తయారు చేస్తారట. అయినా.. పురందేశ్వరి బీజేపీని వీడుతుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 

తనయుడి రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె బీజేపీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆమెను మెనిఫెస్టో కమిటీలో నియమించినట్టుగా ఉన్నారు. ఆమె పార్టీని వీడకుండా చేసేందుకే ఈ పదవిని కొత్తగా ఇచ్చారా! ఈ పదవితో ఆమె బీజేపీలోనే ఉండిపోతుందా?