పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌: ఎన్నికల స్టంటేనా.!

దేన్నయినా రాజకీయం చేయడం మన రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని రాజకీయ పార్టీలూ చేసేది అదే. సర్జికల్‌ స్ట్రైక్స్‌ పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ చేసిన రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక, తీవ్రవాదాన్ని రూపుమాపేశామంటూ బీజేపీ చెప్పుకుందిగానీ, అత్యంత దారుణమైన తీవ్రవాద ఘటనలు నరేంద్రమోడీ హయాంలోనే జరిగాయి.

ఇక, ఇప్పుడు పుల్వామా ఘటన విషయమై రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ఎన్నికల ముందర దాడి ఎందుకు జరిగింది.? ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలున్నా 70కి పైగా వాహనాలు గల కాన్వాయ్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లను తరలించాల్సిన అవసరమేమొచ్చింది.? అంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. 'రాజకీయ అవసరాల కోసం మోడీ ఏమైనా చేస్తారు..' అంటూ మమత పేల్చిన బాంబు ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైంది.

తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం, మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని సమర్ధించారు. 'అధికారం కోసం గోద్రాలో అల్లర్లు సృష్టించిన ఘనుడు' అంటూ నరేంద్రమోడీపై మండిపడ్డారు చంద్రబాబు. 'గోద్రా' ఘటన తర్వాత చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు నినదించారు. హైద్రాబాద్‌లో మోడీని అడుగుపెట్టనివ్వబోననీ సెలవిచ్చారు. కానీ, ఏం జరిగింది.? 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తుపెట్టుకుని, మోడీకి ఘనంగా ఆహ్వానం పలికారు.. నాలుగేళ్ళు నరేంద్ర మోడీతో చంద్రబాబు 'రాజకీయ సంసారం' నడిపారు.

ఒక్కటి మాత్రం నిజం.. పుల్వామా ఎటాక్‌కి సంబంధించి చాలా 'సెక్యూరిటీ లాప్సెస్‌' వున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే ప్రాంతంలో దాడి జరగడం, ఒకేసారి పెద్ద సంఖ్యలో సైనిక వాహనాల కాన్వాయ్‌కి అనుమతివ్వడం.. ఇదంతా పలు అనుమానాలకు తావిస్తోంది. 'రక్తం మరిగిపోతోంది..' అంటూ, పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న నరేంద్రమోడీ సర్కార్‌, గడచిన నాలుగేళ్ళలో పొరుగుదేశం పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం కారణంగాన మారణ కాష్టంగా మారిన కాశ్మీర్‌లో ఎలాంటి చర్యలు చేపట్టారన్నదానిపై సమాధానం చెప్పడంలేదాయె.

చిత్రమేంటంటే, ఇదే కాశ్మీర్‌లో బీజేపీ, నిన్న మొన్నటిదాకా అధికారం పంచుకుంది. ప్రస్తుతం కాశ్మీర్‌ రాష్ట్రపతి పాలనలోనే వుంది. ఈ పరిస్థితుల్లో మోడీ సర్కార్‌ 'దేశభక్తి' అంటూ ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చి ఉపయోగం లేదు. పాకిస్తాన్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని రెట్టింపు చేయడం, అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడ్తామనడం.. ఇవన్నీ పాత, పనికిమాలిన మాటలుగానే భావించాలేమో.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?