ఎమ్బీయస్‌: ప్రశాంత్‌ కిశోర్‌ మమతను ముంచుతాడా?

పార్లమెంటు ఎన్నికలలో మమతకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో 39% ఓట్లు వస్తే యీసారి 43% వచ్చాయి. 22 సీట్లు వచ్చాయి. కానీ బిజెపి ఓట్లు 17% నుంచి 40% ఎగిశాయి. 18 సీట్లు వచ్చాయి. ఈ సీట్లను అసెంబ్లీ సీట్లకు తర్జుమా చేసి చూస్తే 294 స్థానాల్లో బిజెపి 121 వచ్చాయి. మరో 37 స్థానాల్లో కేవలం 2 వేల తేడాతో వెనకబడింది. అసెంబ్లీ ఎన్నికల పాటికి అది కవర్‌ చేసుకుంటే 158 సీట్లు వచ్చి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలదు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన మమత, తన స్ట్రాటజీతో తాజాగా జగన్‌కు 151 సీట్లు తెచ్చిపెట్టిన ప్రశాంత కిశోర్‌ను సలహాదారుగా నియమించుకుంది. 650 మందితో టీము ఏర్పరచుకున్న ప్రశాంత్‌ సర్వేలు నిర్వహించి తేల్చినదేమిటంటే - ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా, 20 యూనివర్శిటీలు పెట్టినా, అనేక చోట్ల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు పెట్టినా, కన్యాశ్రీ పథకం కింద (18 ఏళ్ల వయసు వచ్చేవరకు నెలకు 750 రూ.లు, అప్పుడు ఏకంగా 25 వేలు) 52 లక్షల మంది లబ్ధి పొందినా, సబుజ్‌ సాథీ పథకం (9, 10 తరగతుల విద్యార్థులకు సైకిళ్లు) కింద 40 లక్షల మంది లాభపడినా, తృణమూల్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం కట్‌ మనీ (ప్రభుత్వ పథకాల్లో, యితరత్రా పనుల్లో కమిషన్లు కొట్టడం) అంశం అని! అతని సలహా మేరకే కట్‌మనీ తిరిగి యిచ్చేయమని తన కార్యకర్తలకు మమత బహిరంగంగా పిలుపు నిచ్చిందని అంటున్నారు.

అది కొంప ముంచింది. నిజానికి కట్‌ మనీ రోగం బెంగాలంతా వ్యాపించింది. నిర్మల్‌ బంగ్లా వంటి రాష్ట్రప్రభుత్వ పథకం కింద మరుగుదొడ్లు కట్టుకోవాలన్నా, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనా వంటి కేంద్రప్రభుత్వ పథకం కింద కింద యిళ్లు కట్టుకోవాలన్నా తృణమూల్‌ కార్యకర్తలకు కమీషన్లు సమర్పించుకోవాల్సిందే. ఋణం మొదటి యిన్‌స్టాల్‌మెంటు విడుదల కాగానే వీళ్లు బ్యాంకు బయట కాపుకాసి ఒక్కో వ్యక్తి దగ్గర 10 వేల నుంచి 20 వేల దాకా వసూలు చేశారని వర్ధమాన్‌ జిల్లా గిరిజనులు చెపుతున్నారు. వాళ్ల ఆదాయం నెలకు 2-3 వేలకు మించి లేకపోవడంతో వాళ్ల యిళ్లు సగంలో ఆగిపోయాయి. ప్రభుత్వ స్కీములే కాదు, వ్యక్తిగత లావాదేవీల్లో కూడా తృణమూల్‌ వారు కలగచేసుకునేవారు.

ఓ రైతు తన కూతురు పెళ్లి ఖర్చులకై ఒక కలప వ్యాపారస్తుడికి తన యింట్లో చెట్టుని 46 వేలకు అమ్ముకున్నాడు. ఆ విషయం తెలియగానే తృణమూల్‌ వాళ్లు వ్యాపారి వద్దకు వెళ్లి డబ్బు తీసుకుని తాము 16 వేలు ఉంచుకుని తక్కినదే రైతు చేతిలో పెట్టారు. డబ్బు సరిపోక రైతు కూతురి పెళ్లి చేయలేకపోయాడు. 

ఇవే కాదు, వేరే పార్టీలను సమర్థించినా, వారికి ఓటు వేసినా వీళ్లు 15 వేల నుంచి 50 వేల దాకా జరిమానాలు విధించేవారు. కట్టకపోతే ఊరు విడిచి వెళ్లాలని హుకుం జారీ చేసేవారు. అనేక చోట్ల ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు కూడా మూయించేశారు. ఎవరైనా రియల్టర్లు స్థలం కొని యిళ్లు కడదామని వస్తే అక్కడ తృణమూల్‌ కార్యకర్తలు 'సిండికేట్‌' పేరుతో ప్రత్యక్షమై, కట్‌ మనీ అడిగేవారు. వీళ్ల కిచ్చాక మిగిలిన దానిలో కట్టాలి కాబట్టి వాళ్లు నాణ్యతపై రాజీ పడేవారు.

2017లో తృణమూల్‌ కార్యకర్తలు ఒక పెద్దమనిషి యింటి తలుపు తట్టి 'మీరు యిల్లు బాగుచేయించి పై ఆంతస్తు మళ్లీ కట్టిద్దామనుకుంటున్నారట. మాకు యివ్వాల్సింది యివ్వకుండా పని మొదలు పెట్టలేరు' అన్నారు. ఆయన పేరు సుగతో బోస్‌, సుభాష్‌ చంద్రబోస్‌ సోదరుడి మనుమడు, మాజీ ఎంపి. ఆయన మండిపడి, మీడియాకు లీక్‌ చేయడంతో తృణమూల్‌ వాళ్లు వెనక్కి తగ్గారు. 

గత నాలుగైదేళ్లగా యిలా బాధలు పడుతూ వచ్చిన ప్రజలు యిప్పుడు మమత పిలుపుతో తృణమూల్‌ వారి వెంట పడ్డారు, 'దీదీ చెప్పిందిగా, లంచం తిరిగి యిచ్చేయ్‌' అంటూ. ఇచ్చినవాళ్లు, యివ్వనివాళ్లూ అందరూ అడుగుతున్నారని, కొంతమంది యిచ్చిన దాని కంటె ఎక్కువే అడుగుతున్నారని తృణమూల్‌ వాళ్లు మొత్తుకుంటున్నారు. లంచాలు కదా, దేనికీ సాక్ష్యాలు లేవు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన తృణమూల్‌ ఎంపీ శతాబ్ది రాయ్‌ 'తిరిగి యివ్వడం అసాధ్యం, ఎందుకంటే అంతా చెయిన్‌ సిస్టమ్‌ కదా' అంది. అంటే యీ కట్‌ మనీలో కింద నుంచి పై దాకా అందరికీ వాటాలుంటాయని, అందరి దగ్గర్నుంచి వసూలు చేయడం కష్టమని తాత్పర్యం. పైగా దాన్ని ఖఱ్చు పెట్టేసి వుంటారు కదా. కానీ ప్రజలకు అదంతా అనవసరం. తృణమూల్‌ వాళ్ల యిళ్లపై దాడులు చేసి డబ్బు అడుగుతున్నారు. వారికి బిజెపి వాళ్లు తోడవుతున్నారు. కొందరు భయంతో ఊళ్లు విడిచి వెళ్లిపోయారు. మరి కొందరు పోలీసులను అడ్డేసుకుని ఆందోళనకారులను చావగొట్టిస్తున్నారు. మరి కొందరు ఎంతో కొంత తిరిగి యిచ్చేసి దణ్ణం పెడుతున్నారు. 

నిజానికి బెంగాల్‌లో కమ్యూనిస్టు పాలన పోయిన తర్వాత రౌడీలందరూ తృణమూల్‌లో చేరి ధనార్జనకు అలవాటు పడ్డారు. ఈ డబ్బు కోసం కాంగ్రెసు, లెఫ్ట్‌కు చెందిన కార్యకర్తలందరూ తమ పార్టీలు వదిలి యీ పార్టీలో చేరిపోయారు. వృద్ధులకు, మహిళలకు సాయపడే పథకాలు, 'నరేగా' పథకం దేన్నీ వదలలేదు. అర్హత లేకపోయినా అనేక పథకాల ద్వారా డబ్బులు తీసుకున్నారు. ఈ రూకబలానికి మూకబలాన్ని జోడించి, 2018 లో జరిగిన మునిసిపల్‌, పంచాయితీ ఎన్నికలలో ప్రతిపక్షాలను పోటీ చేయకుండా అడ్డుకున్నారు. మొత్తం 58,700 గ్రామసభల్లో 34% సభల్లో ప్రత్యర్థులు ఎవరూ నిలబడడానికి వీల్లేకుండా చేశారు.

గతంలో పంచాయితీ అధ్యక్షులు గ్రామ సభ, గ్రామ సంసద్‌ సభల్లో తాము చేసిన ఖర్చుల వివరాలు గ్రామస్తులకు వివరించేవారు. ఇప్పుడు అది మానేశారు. ఇలా ఆడిటింగ్‌ కూడా లేకపోవడంతో మొన్నటిదాకా సామాన్యంగా తిరిగిన తృణమూల్‌ నాయకులు గత నాలుగేళ్లలో పెద్దపెద్ద యిళ్లు కట్టేసుకున్నారు. అది చూసి ప్రజలు రగిలినా ఏమీ చేయలేక పోయారు. పార్లమెంటు ఎన్నికలలో పార్టీకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు దేహశుద్ధి చేయడానికి పూనుకున్నారు. దీనితో తృణమూల్‌కు గ్రామాల్లో ఉన్న మూలాలు కదిలిపోసాగాయి.

ఇదంతా చూసి కంగారు పడిన మమత జులై 21న కట్‌ మనీపై యూటర్న్‌ తీసుకుంది. ''కట్‌ మనీ తిరిగి యిచ్చేయమని డిమాండ్‌ చేయడానికి బిజెపికెంత ధైర్యం? ముందు వాళ్లు బ్లాక్‌ మనీ తిరిగి యిచ్చేయాలి. ఉజ్జ్వల స్కీములో తీసుకున్న కట్‌ మనీ తిరిగి యివ్వాలి. లేకపోతే మేం ఆందోళన ప్రారంభిస్తాం' అని హెచ్చరించింది. ఇలా తన సలహా చీదేయడంతో ప్రశాంత్‌ కొత్త కార్యక్రమాలు రూపొందించాడు.

'మమతా మాకు గర్వకారణం' అని ఒక ఫేస్‌బుక్‌ పేజీ పెట్టి ఆమె టీ స్టాళ్లకు వెళ్లి టీ కాచిన ఫోటోలు, మురికివాడలకు వెళ్లి పిల్లల్ని పలకరించిన ఫోటోలు పెడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే మమతకు నేరుగా చెప్పండి అనే అర్థంలో 'దీదీకే బోలో' అని జులైలో మరో ఫేస్‌బుక్‌ పేజీ తెరిపించాడు. రెండు నెలల్లోనే 4 లక్షల ఫిర్యాదులు వచ్చిపడ్డాయి. వాటిల్లో కేవలం 750 మాత్రం పరిష్కరించ గలిగారు. దానితో ఆ ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులను బదిలీ చేయాలని ప్రశాంత్‌ సూచించడం, మమత దాన్ని అమలు చేయడం జరిగాయి. దాంతో అధికారులకు మండుతోంది.

ప్రశాంత్‌ రూపొందించిన మరో కార్యక్రమం - పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్లి ఓ రాత్రి అక్కడ గడిపి, ఓటర్లను కలిసి, వాళ్ల బాధలు తెలుసుకుని బుజ్జగించి రావడం! ప్రజలు ఆగ్రహంగా ఉన్న యీ సమయంలో అలా వెళ్లడం నాయకులకు యిష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లి కాస్సేపు ఉండి, నాలుగు ఫోటోలు తీయించుకుని వచ్చేస్తున్నారు. వాటిని ప్రశాంత్‌ టీముకి పంపి, ఫేస్‌బుక్‌లో పెట్టమంటున్నారు. రవీంద్రనాథ్‌ ఘోష్‌ అనే మంత్రి ఎక్కడా అరగంటకు మించి ఉండలేకపోయాడు పాపం. అతను ఎక్కడికి వెళ్లినా బిజెపి కార్యకర్తలు 'జై శ్రీరామ్‌' నినాదంతో అతన్ని తరిమారు. ఇలాటి సంఘటనలతో తృణమూల్‌ వాళ్లు బోడి సలహాలిచ్చాడు అంటూ ప్రశాంత్‌ను తిట్టుకుంటున్నారు. ప్రశాంత్‌ను తెచ్చినది మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ. అతనంటే పార్టీ నాయకులకు గౌరవం లేదు. అందువలన అతన్ని కూడా కలిపి తిట్టుకుంటున్నారు.

తృణమూల్‌ కున్న యీ యిబ్బందికర పరిస్థితి బిజెపికి అనుకూలంగా మారుతుందా అనే దానికి స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే అవినీతి అనేది తృణమూల్‌కు వ్యతిరేకాంశమైతే, అవినీతిపరులను చేర్చుకోవడం బిజెపికి వ్యతిరేకాంశంగా మారింది. బెంగాల్‌లో విస్తరించడానికి 2014లోనే అమిత్‌ షా సంకల్పించారు. కానీ మూడేళ్లయినా అనుకున్న రీతిలో పార్టీ ఎదగలేదు. దాంతో అడ్డదారి పట్టారు. మమతకు కుడిభుజంగా ఉండి, శారదా చిట్‌ఫండ్‌ స్కాములో సిబిఐ విచారణ ఎదుర్కుంటున్న ముకుల్‌ రాయ్‌ను వలవేసి 2017లో పార్టీలో చేర్చుకున్నారు. అతను తనలాగే అవినీతి ముద్ర పడిన అనేక మంది తృణమూల్‌ నాయకులను పార్టీలోకి లాక్కుని వస్తున్నాడు. తాజాగా చేరిన మాజీ మంత్రి, కలకత్తా మాజీ మేయరు శోభన్‌ చటర్జీ నారదా స్టింగ్‌ ఆపరేషన్‌లో నిందితుడు, సిబిఐ విచారణను ఎదుర్కుంటున్నవాడు. మొన్న గెలిచిన 18 మంది బిజెపి ఎంపీలలో 6గురు తృణమూల్‌ నుంచి వచ్చినవారే. వీరికి వ్యతిరేకంగా బిజెపి వీధిపోరాటాలు చేస్తూ వచ్చింది. 

ఇలాటి ఫిరాయింపులు బిజెపిలో ఎప్పటినుంచో ఉంటున్న కార్యకర్తలకు కష్టంగా తోస్తున్నాయి. బిజెపిని తృణమూలీకరణ చేసేస్తున్నారు అని బాధపడుతున్నారు. కానీ బిజెపి కేంద్ర నాయకత్వం వారి గోడు వినటం లేదు. గత డిసెంబరులో మనిరుల్‌ ఇస్లాం అనే తృణమూల్‌ ఎమ్మెల్యేని దిల్లీకి విమానంలో తీసుకెళ్లి బిజెపి జాతీయ జనరల్‌ సెక్రటరీ కైలాస్‌ విజయవర్గీయ సమక్షంలో పార్టీలో చేర్చారు. రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌తో ఒక్క మాట కూడా చెప్పలేదు. 'మనిరుల్‌ మతఛాందసవాది. ఇద్దరు బిజెపి కార్యకర్తలను చంపానని గర్వంగా ప్రకటించుకున్నవాడు.' అని అతను అభ్యంతర పెడితే అమిత్‌ షా అతన్ని కూర్చోబెట్టి 'ఇలా చేయకపోతే పార్టీ ఎదగదు' అని నచ్చచెప్పాడట. ఇప్పుడు శోభన్‌ చటర్జీని చేర్చుకోవడానికి యిలాటి కారణమే చెపుతున్నారు. 'కలకత్తాకు సమీపంలో ఉన్న ఉత్తర, దక్షిణ 24 పరగణా జిల్లాలలో పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. శోభన్‌ వంటి పలుకుబడి గల వక్త పార్టీలో చేరడం వలన అక్కడ పార్టీ బలపడుతుంది' అంటున్నారు.

ఇలా చేయడం వలన తృణమూల్‌ క్యాడర్‌ వచ్చి చేరవచ్చు కానీ, తటస్థులైన ఓటర్లు విముఖులయ్యే ప్రమాదం ఉంది. అందుకని బిజెపి హిందూత్వను ఎగదోస్తోంది. జై శ్రీరామ్‌ అనే మతపరమైన నినాదాన్ని రాజకీయాలకు వాడుకుంటోంది. ఇప్పటిదాకా మత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన బెంగాల్‌ సమాజంపై దీని ప్రభావం పడడం ప్రారంభమైంది. సోషల్‌ మీడియాలో హిందూ విద్యాధికులు ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. నిజానికి దీనికి మమత చేసిన రాజకీయాలే కారణం. రాష్ట్రంలో 27% ముస్లిములున్నారు. వారిలో కొందరు కాంగ్రెసుకు, కొందరు లెఫ్ట్‌కు ఓటేస్తూ ఉండేవారు - రెండూ సెక్యులర్‌ భావాలతో ఉండేవే కాబట్టి. కాంగ్రెసును కబళించిన మమత లెఫ్ట్‌కు మద్దతిచ్చిన ముస్లిము ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి తాయిలాలు యివ్వసాగింది.

2012లో ప్రభుత్వ ఖజానా నుంచి 25 వేల మంది ఇమామ్‌లకు రూ.2500, 19 వేల మంది ముయెజ్జిన్లకు రూ.1000 నెల జీతాలు యిస్తానంది. కలకత్తా హైకోర్టు ఆ ఆదేశాన్ని కొట్టివేస్తే వక్ఫ్‌ బోర్డు ద్వారా యివ్వసాగింది. దీనికై ఏడాదికి రూ.126 కోట్లు ఖర్చవుతోంది. 2012లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బజెట్‌ను 73% పెంచింది. ముస్లిము యువతకు ఉద్యోగాలివ్వడానికి ప్రతి జిల్లాలో ఎంప్లాయ్‌మెంట్‌ బ్యాంకులు తెరిచింది. 

ఇవన్నీ పళ్ల బిగువున సహిస్తూ వచ్చిన హిందువులు యిప్పుడు విజృంభిస్తున్నారు. రాజకీయంగా వారిని ఏకం చేసి, ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి బిజెపి సకలయత్నాలు చేస్తోంది. దీనివలన బెంగాల్‌ సమాజం మతపరంగా చీలిపోతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవటం లేదు. జై శ్రీరామ్‌ అనే నినాదంతో రాజకీయ ఉద్యమాలు నడుపుతోంది. మతాన్ని వేదికగా చేసుకుంటున్న బిజెపిని ఎదుర్కోవడానికి  మమత సంస్కృతిని అస్త్రంగా చేసుకుంటోంది. ప్రతి దానికీ జై బంగ్లా అంటోంది. బిజెపిని ఉత్తరాది పార్టీగా ప్రస్తావిస్తూ, అందుకే కాళీ, దుర్గా అనకుండా శ్రీరామ్‌ అంటున్నారు అని ఎత్తి చూపుతోంది. అమిత్‌ షా యిటీవల హిందీకి అనుకూలంగా చేసిన స్టేటుమెంటు కూడా బెంగాలీలకు రుచించే ప్రకటన కాదు. 'ప్రతి భారతీయుడు మాతృభాషతో పాటు హిందీ కూడా నేర్చుకుని తీరాలి' అంటున్న అమిత్‌, హిందీ మాతృభాషగా కలవారికి 'మీరూ మరో భారతీయ భాష నేర్చుకోండి, కనీసం పొరుగు రాష్ట్రపు భాషైనా నేర్చుకోండి' అని చెప్పటం లేదు. వాళ్లు ఇంగ్లీషు కూడా నేర్చుకోవటం లేదు, నేర్చుకోనక్కర లేకుండా పరీక్షలన్నీ హిందీలోనే ఏర్పాటు చేశారు మన పాలకులు. ఇతరులు మాత్రం మూడు భాషలు నేర్వాల్సి వస్తోంది. వారిలో బెంగాలీలు కూడా ఉన్నారు. వాళ్లు హిందీ గొప్పదంటే ఛస్తే ఒప్పుకోరు.

తీవ్ర జాతీయవాదంతో నెగ్గుకుని వస్తున్న బిజెపి ఉపజాతీయవాదం (ప్రాంతీయవాదం) అంటే ఉలిక్కిపడుతుంది. దక్షిణాదిన దానికి ఆ సమస్య ఎదురవుతోంది. మమత కారణంగా తూర్పున కూడా అదే పరిస్థితి వస్తుందేమోనని దాని భయం. తమ రాష్ట్రం పేరును 'బంగ్లా'గా మారుస్తానని మమత అంటే అందుకేలాగుంది, అడ్డుపడింది. నిజానికి దాని పేరులో 'పశ్చిమ' అనేది అనవసరం - తూర్పు బెంగాల్‌ అనేది లేనేలేదు కాబట్టి! కానీ పేరు మార్పు అనగానే బెంగాలీ ఫీలింగు ఎగసిపడుతుందేమోనని బిజెపి భయం. బెంగాల్‌లో పొరుగు రాష్ట్రాల వారు చాలామంది నివాసం ఉంటారు. వారిలో బిహారీలు, యుపి వారు బిజెపికి ఓటేస్తున్నారని మమతకు అనుమానం వచ్చింది. వారిని ఆకట్టుకోవడానికి వారి పండగ అయిన 'ఛాత్‌'కు సెలవు ప్రకటించింది. దీనితో బాటు 30 లక్షల మంది నామశూద్ర కులాల వారిని మెప్పించడానికి వారి గురువులు హరిచంద్‌, గురుచంద్‌ ఠాకూర్ల పేర యూనివర్శిటీ గత ఏడాదే పెట్టింది. 

మమత జై బంగ్లాకు ప్రతిగా మోదీ 'సోనార్‌ బంగ్లా' నినాదాన్ని ఎత్తుకున్నారు - బెంగాల్‌కు పాత వైభవాన్ని తిరిగి తెస్తాం, బెంగాల్‌లో కూడా ఎన్‌ఆర్‌సి (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌) తెచ్చి ముస్లిము వలసదారులను తరిమేస్తాం, పరిశ్రమలు తెచ్చేస్తాం, యువతకు ఉద్యోగాలు యిచ్చేస్తాం... వగైరా వాగ్దానాలతో! దేశం మొత్తంలో మేక్‌ ఇన్‌ ఇండియా విఫలమైంది, ఉద్యోగాలు ఆవిరై పోయాయి. బెంగాల్‌ అంటే పారిశ్రామికవేత్తలకు వణుకు. అయినా బిజెపి ధారాళంగా హామీలు యిచ్చేస్తోంది. నిజానికి రాబోయే ఎన్నికలలో బెంగాల్‌ యువతే ఎవరు నెగ్గాలో నిర్ణయించే శక్తిగా మారబోతున్నారు. మమత హయాంలో  కేంద్రం నుంచి పంచాయితీలకు వచ్చిన నిధులు దుర్వినియోగం కావడంతో ఉద్యోగాలు దొరకక గ్రామీణ యువత కేరళ, ముంబయి, సూరత్‌ వంటి ప్రదేశాలకు తరలిపోతున్నారు. 

మమత, బిజెపి యిద్దరి విధానాలు నచ్చని తటస్థులు, యువతీయువకులు యిప్పుడు లెఫ్ట్‌ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలలో చాలా మంది లెఫ్ట్‌ మద్దతుదారులు మమతకు బుద్ధి చెప్పాలని బిజెపికి ఓటేసినా, 7% మంది ఓటర్లు మాత్రం లెఫ్ట్‌కే ఓటేశారు. బిజెపిని ఎదుర్కోవడానికి తనతో కలిసి రావాలని మమత యీ మధ్య లెఫ్ట్‌ పార్టీలకు పిలుపు నిచ్చింది కానీ లెఫ్టిస్టు యువత మాత్రం మమతతో తలపడడానికే సిద్ధపడ్డారు. 2011లో తృణమూల్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సిపిఎం విద్యార్థి యూనియన్లయిన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రాటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డివైఎఫ్‌ఐ)లలో సభ్యత్వం 16 లక్షల దాకా తగ్గింది. ఉద్యోగాలిస్తానని తృణమూల్‌ ఆఫర్‌ యివ్వడంతో వీళ్లంతా అటు మొగ్గారు. అయితే అలా జరగకపోవడంతో నిరాశ చెందారు. 2012-18 మధ్య తాము 77 లక్షల మందికి ఉద్యోగాలు యిచ్చామని మమత ప్రకటించడం వారికి ఆగ్రహం కలిగించింది. 'మేము నెల్లాళ్లపాటు 22 జిల్లాల్లో తిరిగి శాంపుల్‌ సర్వే చేస్తే 10 లక్షల మంది నిరుద్యోగులు, తమ అర్హతకు తగిన ఉద్యోగం చేయనివారు కనబడ్డారు.' అంటున్నారు విద్యార్థి నాయకులు. 

నిరుద్యోగ సమస్యపై తృణమూల్‌ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సెప్టెంబరు 13న హౌడాలో నిరసన ప్రదర్శన చేద్దామని 12 వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపు నిస్తే 40 వేల మంది వచ్చారు. 7 వేలకు మించి రారని మేమనుకున్నాం అంటూ నిర్వాహకులు నివ్వెరపోయారు. వామపక్షాల్లో కొత్త ఉత్సాహం కలిగింది. పోలీసులు ప్రదర్శనకారులపై విరుచుకు పడ్డారు. 60 మంది గాయపడ్డారు, 22 మంది అరెస్టయ్యారు. దీని తర్వాతే సెప్టెంబరు 21 న జాదవ్‌పూర్‌ యూనివర్శిటీలో ఎబివిపి సదస్సుకి వచ్చిన బిజెపి మంత్రి బాబుల్‌ సుప్రియోపై వామపక్ష విద్యార్థులు దాడి చేసి అతన్ని కొట్టారు. బెంగాల్‌లో యూనివర్శిటీలలో హింసాత్మక ఘటనలు సాధారణం. వైస్‌ ఛాన్సలర్‌ అనుమతి యిస్తే తప్ప పోలీసులు ప్రవేశించరు. అనుమతిస్తే విద్యార్థులు ఊరుకోరు. ఏం చేయాలా అని తటపటాయిస్తూండగానే రాష్ట్ర గవర్నరు, యూనివర్శిటీ ఛాన్సలర్‌ ఐన జగదీప్‌ ధన్‌కర్‌ (బిజెపి నాయకుడే) ఆపద్రక్షకుడి స్టయిల్లో తను స్వయంగా పోలీసులను వెంటపెట్టుకుని వచ్చి మంత్రిని కాపాడి, తన కారులో బయటకు తీసుకుపోయాడు. ఆ తర్వాత 'జై శ్రీరామ్‌', 'భారత్‌మాతా కీ జై' అనే నినాదాలు యస్తూ ఎబివిపి సభ్యులు యూనివర్శిటీ ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. గవర్నరు చర్య తమ ప్రభుత్వాధికారాన్ని దెబ్బ తీయడమే అని మమత మండిపడింది. పోనుపోను యిలాటివి ఎన్ని జరుగుతాయో చూడాలి.

2020 జులైలో 99 మునిసిపాలిటీలలో, 7 నగర కార్పోరేషన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో 127 మునిసిపాలిటీలలో తృణమూల్‌ 125 కైవసం చేసుకుంది. ఇప్పుడా పరిస్థితి లేదు కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో నెగ్గి తీరాలి. ఆ ఎన్నికలలో బిజెపితోనే కాదు, లెఫ్ట్‌తో కూడా పోరాడవలసి వస్తే మమత ఎన్నో ఉపాయాలు పన్నాల్సివుంది. దీనికి గాను సరైన సలహాదారులు కావాలి. ఆమె చుట్టూ భజనపరులు ఉన్నారు. ఒకవేళ నిజంగా మంచి సలహా చెప్పినా, 'వీడు రేపు బిజెపిలో దూకేస్తున్నాడేమో, కావాలని తప్పుడు సలహా చెపుతున్నాడేమో' అనే సందేహం ఆమెకు కలిగే ప్రమాదం ఉంది. అందువలన ఆమెకు ప్రశాంత్‌ వంటి ప్రొఫెషనల్‌ అవసరం ఉంది. కానీ పార్టీలో యితర నాయకులకు అది అర్థం కావటం లేదు. వాళ్లు ప్రశాంత్‌ టీముతో సహకరించటం లేదు. దానితో విసిగిన ముగ్గురు టీము సభ్యులు మేం తప్పుకుంటాం అని చెప్పేశారట. కానీ ప్రశాంత్‌ బెంగాల్‌ను ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే యిప్పటిదాకా అతను విజయం సాధించిన కేసులన్నీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్లవే (నీతీశ్‌ తప్పించి). ఇది అధికారంలో ఉండి అప్రతిష్ఠ మూట కట్టుకున్న సందర్భం. ఇక్కడా నెగ్గితే గొప్పే. అయితే 'నేను' అని తప్ప 'మేము' అనలేని మమత అహంభావం, మూర్ఖత్వం, చంచలత్వం కారణంగా ఎన్నికల దాకా వీళ్ల బంధం కొనసాగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2019)
mbsprasad@gmail.com

Show comments