ప్రజావేదిక కూలిస్తే ప్రజాధనం వృథా అయినట్టేనా..?

ఉండవల్లి ప్రజావేదిక, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన భవనం. అంచనాలు పెంచుకుని 8.9కోట్ల రూపాయలతో ఈ అక్రమ భవనాన్ని నిర్మించారని సాక్షాత్తూ సీఎం జగన్, ఐఏఎస్ ల సమావేశంలో ప్రకటించారు. భవనం ఖరీదైనదే, కానీ నిర్మాణం అక్రమమే కదా. అందుకే జగన్ ఈ బిల్డింగ్ కూల్చివేత విషయంలో కఠినంగా వ్యవహరించారు.

తీరా ఇప్పుడు కూల్చివేత పనులు జరుగుతుంటే.. ప్రజాధనం వృథా అయిపోతుందంటూ చాలామంది మొసలి కన్నీరు కారుస్తున్నారు. దాదాపు 9కోట్ల రూపాయలను బూడిదలో పోస్తున్నారంటూ, రాజకీయ కక్ష అంటూ డైలాగులు పేలుస్తున్నారు. రాజకీయ నాయకులతో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఈ వార్ నడుస్తోంది. వ్యక్తికత కక్ష సాధింపు కోసం ప్రజాధనాన్ని సీఎం జగన్ వృథా చేస్తున్నారంటూ నెగెటివ్ ప్రచారం తీసుకొస్తోంది టీడీపీ, దాని అనుకూల మీడియా.

కూల్చకుండా దాన్ని వేరే విధంగా వాడుకోవచ్చు కదా, ప్రతిపక్షనేత చంద్రబాబుకి ఇవ్వడం ఇష్టం లేకపోతే, జగనే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుకదా అనేది వీరి వితండవాదన. కొంతమంది సామాన్యులు, తటస్థులు కూడా ఈ వాదన వైపు ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్ నిర్ణయంపై వస్తున్న కామెంట్స్ దీన్ని రుజువు చేస్తున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది.

చంద్రబాబు కట్టిన అక్రమ నిర్మాణాన్ని వాడుకుంటే ఇక చంద్రబాబుకీ, జగన్ కీ తేడా ఏముంటుంది? అవినీతిని సమర్థిస్తే అది కూడా అవినీతే కదా? ఈ లాజిక్ ని ఈ మేథావులంతా ఎందుకు మర్చిపోతున్నారు. ఈ రోజు రూ.9 కోట్ల కోసం చూసుకుంటే.. రేపు కృష్ణా కరకట్ట అంతా ఆక్రమణలకు గురై వందల కోట్ల రూపాయల భవనాలు పైకి లేస్తాయి.

ప్రజావేదిక ఉంది కాబట్టే.. లింగమనేన గెస్ట్ హౌస్ సహా ఇతర అక్రమ నిర్మాణాల జోలికి అధికారులు వెళ్లలేకపోతున్నారు. ఈ ఆక్రమణలన్నీ బైటపడతాయనే చంద్రబాబు ముందుగా ప్రజావేదిక తనకు కావాలంటూ జగన్ కి లేఖ రాశారు. ఇప్పుడు తెలివిగా తన ఇల్లు ఖాళీ చేయిస్తున్నారంటూ పెడబొబ్బలు పెడుతున్నారు.

ఈరోజు ఊరుకుంటే.. రేపు కృష్ణాకు వరదలు వచ్చినప్పుడు ఈ భవనాలన్నీ కొట్టుకుపోతే పరిస్థితి ఏంటి? బిల్డింగ్ ల కోసం నదిని పూడ్చుకుంటూ వెళ్తే.. భారీ వరదలతో ప్రవాహం ఊరి మీద పడితే ఏం చేయాలి? పర్యావరణ చట్టాలకు మనమే తూట్లు పొడుస్తూ ఉంటే.. ఇక భావితరాల భవిష్యత్ ఏం కావాలి? ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే జగన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

మార్పు మొదలు కావాల్సింది ప్రజా వేదికతోనే. ప్రజాధనం వృథా అనే సమస్యే ఇక్కడ రానే రాదు. ప్రజాక్షేమం కోసం తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక అక్రమ కట్టడం కూలిపోతోంది అంతే.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments