పోటీ ఇచ్చేలా వున్నాడుగా

బన్నీ, మహేష్, రజనీ లాంటి హేమా హేమీల సినిమాలు సంక్రాంతికి వస్తుంటే కళ్యాణ్ రామ్ కూడా బరిలోకి దిగుతున్నాడు. ఏమిటా ధైర్యం అనుకుంటే,  ఇదే సమాధానం అన్నట్లు గా ఆ సినిమా టీజర్ వచ్చింది. పక్కాగా సినిమాలో విషయం వుంది. ఆ విషయం సంక్రాంతి సీజన్ కు పక్కాగా సూట్ అవుతుంది అన్నట్లుగా వుంది. గత కొన్నేళ్లుగా సంక్రాంతికి ఏదో ఒక మీడియం రేంజ్ సినిమా రావడం, హిట్ కొట్టడం జరుగుతోంది.

ఎంత మంచివాడవురా సినిమాకు ఆ లక్ వున్నట్లు కనిపిస్తోంది. శతమానం భవతి లాంటి మాంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా అందించిన సతీష్ వేగ్నిశ డైరక్షన్ లో తయారవుతున్న ఈ సినిమాకు కాస్త మంచి పాయింట్ నే దొరికినట్లు కనిపిస్తోంది. ఓ గుజరాతీ సినిమా ఆధారంగా తయారవుతోందని వినికిడి.

టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేసారు. కళ్యాణ్ రామ్ విసిరిన టీజర్ లాస్ట్ పంచ్ కూడా బాగుంది. టీజర్ కట్ కోసం పక్కాగా ప్లాన్ చేసుకుని, సీన్లు, డైలాగులు మిక్స్ చేసిన తీరు బాగుంది. మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ అధినేతలు, శివలెంక కృష్ణ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.