ఎమ్బీయస్‌: అమెరికన్‌ పూజారుల ప్రవర్తనను ఖండించిన పోప్‌

పై తరహా వార్త మీరు అనేక సార్లు చదివి వుంటారు. మహా అయితే దేశం పేరు మారుతుంది. పోప్‌ పేరు మారుతుంది. పోపులు మారినా చర్చి పూజారుల ప్రవర్తన మారదు, వారు లైంగిక అత్యాచారాలు మానరు. బాధితులు కోర్టుకు వెళితేనో, లేక ప్రభుత్వం విచారణ చేపటితేనో విషయం బయటపడుతుంది. అప్పుడు పోప్‌ గారు ఆ పూజారులు చేసినది తప్పు అని ప్రకటిస్తారు. ఈ సారి కూడా అలా ప్రకటిస్తూ గాయాలు ఎప్పటికీ మానిపోవనీ, స్పిరిచ్యువల్‌ కరప్షన్‌ (ఆధ్యాత్మిక అత్యాచారం అనవచ్చా?)కు వ్యతిరేకంగా ఉద్యమించిన బాధితుల పక్షాన నిలుస్తున్నామని, ఎంతలా క్షమాపణ కోరినా, జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఎంత ప్రయత్నించినా సరిపోదనీ పోప్‌ ఫ్రాన్సిస్‌ ఉద్ఘాటించారు, రేదర్‌ పునరుద్ఘాటించారు. ఇన్ని చెప్పారు కానీ అత్యాచారాలు చేసిన పూజారులను ఏం చేస్తారో చెప్పలేదు. చర్చిలోంచి గెంటేస్తారా, సాంఘికబహిష్కారం చేస్తారా, కోర్టుకి యీడ్చి శిక్ష విధించేట్లా చేస్తారా అన్నది చెప్పినట్లు లేదు.

తాజా విచారవ్యక్తీకరణకు కారణం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల గురించి అమెరికన్‌ గ్రాండ్‌ జ్యూరీ వారం క్రితం యిచ్చిన రిపోర్టు. చర్చి పూజారుల చేతుల్లో వేలాది మంది పసివారు లైంగిక అత్యాచారాలకు గురయ్యారని, వారిలో కనీసం వెయ్యిమందిని గుర్తించడానికి వీలుందని, ఈ అత్యాచారాలను కాథలిక్‌ చర్చి ఒక పద్ధతి ప్రకారం కప్పిపుచ్చుతోందని (సిస్టమాటిక్‌ కవరప్‌) రిపోర్టు చెపుతోంది. మసాచుసెట్స్‌ రాష్ట్రంలో పిల్లల మీద అత్యాచారాలు చేసే క్రైస్తవ పూజారుల గురించి ''ద బోస్టన్‌ గ్లోబ్‌'' 2002లో వెలువరించిన నివేదిక తర్వాత అత్యంత విశదమైన నివేదిక యిదే అంటున్నారు. ఈ మధ్యలో వాషింగ్టన్‌ ఆర్చిబిషప్‌గా గతంలో పనిచేసిన కార్డినల్‌ థియోడోర్‌ మెక్‌కారిక్‌ రాజీనామా ఘటన జరిగింది. పదవిలో ఉండగా యువ పూజారిణులను, సెమినరీ విద్యార్థినులను లైంగికంగా ఉపయోగించుకున్నాడని బయటకు రావడంతో రాజీనామా చేయవలసి వచ్చింది.

అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఒకటైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో 8 కాథలిక్‌ డికోస్‌లు (ప్రాంతాలు) ఉంటే వాటిలో 6టిని పరిశీలిస్తేనే యింతమంది తేలారు. చాలామంది బయటకు వచ్చి చెప్పలేదని, కొందరి రికార్డులు మాయమయ్యాయని, దేవుడి పేరు చెప్పి భయపెట్టో, డబ్బు ఆశ చూపించో కామాపు చేసిన కేసులు చాలా ఉంటాయని కోర్టు అంది. ఈ నివేదిక ప్రకారం 70 ఏళ్ల కాలంలో కవరప్‌ చేయడానికి ప్రయత్నించిన మతాధికారులు 300 మందికి పైగా ఉన్నారు. ఇక బలాత్కారాలు చేసినవారా కోకొల్లలు. ఒకడు ఒక బాలికను ఆసుపత్రిలో రేప్‌ చేశాడు, మరొకడు తోలు బెల్టుతో మంచానికి కట్టేసి, కొరడాతో కొట్టి అనుభవించాడు. మరొక ప్రబుద్ధుడు మైనారిటీ వెళ్లని ఒక భక్తురాలికి కడుపు చేస్తే, అతన్ని అదే పదవిలో కొనసాగించారు. అతను దగ్గరుండి ఆమెకు అబార్షన్‌ చేయించాడు.

ఎవరైనా బాధితులు గోల పెట్టగానే, లేదా కేసు పెట్టగానే పూజారులు చర్చి డబ్బు యిచ్చి సెటిల్‌మెంటు చేసుకుంటూ వస్తున్నారు. పోప్‌ గారు ఖండిస్తూనే ఉంటారు. కానీ లక్షలాది డాలర్లు చర్చి ఖాతాలోంచి చెల్లిస్తూనే ఉంటారు. కాముక పూజారులు తమ పనులు ఆపటంలేదు. అన్నిటికంటె ఘోరం బాధితుల్లో చాలామంది చిన్న పిల్లలే. పైగా పూజారుల కాముకతకు ఆడా, మగా తేడా ఉండటం లేదు. చర్చి డబ్బు యిచ్చి నోరు మూయించినా యీ సంఘటన కలిగించిన మానసిక ఆందోళన (ట్రామా) ఆ పిల్లలను జీవితాంతం వెంటాడుతుంది. పై అధికారులను చూడబోతే యిటువంటి దుర్మార్గులను వెనకేసుకుని వచ్చి, వారి పాపాలకు పరదా వేస్తూంటారు. అందువలన వాళ్లు విచ్చలవిడిగా తన అకృత్యాలు కొనసాగిస్తూ పోయారు. కొన్నాళ్లకు ఒక్కో సందర్భంలో బాగా చెడ్డపేరు వచ్చిన పూజారులను చర్చినుంచి బయటకు పంపించినా, వారిని అప్పటిదాకా వెనకేసుకుని వచ్చిన ఉన్నతాధికారులపై చర్యలు ఉండటం లేదని నివేదిక పేర్కొంది. వారు ఉద్యోగాల్లో కొనసాగడమే కాక, ప్రమోషన్లు కూడా తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్‌ ఆర్చిబిషప్‌గా ఉన్న కార్డినల్‌ డోనాల్డ్‌ వ్యూరెల్‌ గతంలో బిషప్‌గా ఉండగా ఒక అత్యాచారి పూజారిని కాపాడినవాడే అని రిపోర్టు తెలిపింది.

ఈ కథలు అమెరికాలోనే కాదు, అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. మన దేశంలో కేరళలో ఒకదాని తర్వాత మరొకటి బయటపడుతూనే ఉంటాయి. ఒకదాని గురించి క్షుణ్ణంగా చదివి రాద్దామనుకునే లోపున మరో కొత్త కేసు బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ బయటకు వచ్చే కేసులు, రానివి ఎన్ని ఉన్నాయో. పూజారి అకృత్యాన్ని బయటపెడితే దేవుడికి కోపం వచ్చి శిక్ష వేస్తాడేమోనన్న భయంతో ఎంతమంది ఆగిపోతున్నారో! బయటకు వచ్చాక చర్చి చేసే మతలబుల వలన ఎంతమంది నోళ్లు మూతపడుతున్నాయో! కేరళలో ప్రస్తుతం బిషప్‌గా ఉన్న ఫ్రాంకో ములక్కల్‌ తనను 2014 నుంచి రెండేళ్ల పాటు తనపై అత్యాచారం చేశాడని ఒకామె కేసు పెట్టింది. కేసు వదులుకుని, నోరు మూసుకుంటే 10 ఎకరాల భూమి యిస్తామని బిషప్‌ తరఫున ఫాదర్‌ జేమ్స్‌ ఎర్తయిల్‌ ఆఫర్‌ చేసిన ఆడియో టేప్‌ గత నెలలోనే బయటకు వచ్చింది. అసలు లైంగిక అత్యాచారమే హేయమైనది. అందునా పూజారి చేయడం అత్యంత నీచం. ఏ మతానికి చెందినవాడైనా సరే, పూజారిని మనం దైవానికి ప్రతినిథిగా భావిస్తాం. కాళ్లకు మొక్కుతాం. అలాటి వాళ్లు తమ పొజిషన్‌ను యిలా ఉపయోగించుకోకూడదు. పూజారులు, పూజారిణులు కలిసి శయనిస్తున్నారంటే ఒకరంటే ఒకరికి యిష్టం కావచ్చు, లైంగికేచ్ఛ కావచ్చు, పదవి కోసమో, పలుకుబడి కోసమో శయనించవచ్చు. కానీ భక్తులను, భక్తురాళ్లను లొంగదీసుకోవడం పాపం. వయసు వచ్చిన వారితో అయితే ఒక తరహా పాపం, చిన్నపిల్లలతో అయితే ఘోరాతిఘోరమైన పాపం. వాళ్లను నిట్టనిలువునా చీరేసినా తప్పు లేదు.

అటువంటి తుచ్ఛులను వెనకేసుకుని వచ్చి, వాళ్ల తప్పులు కప్పిపుచ్చుతూ, ఆ కప్పిపుచ్చడానికి భక్తుల విరాళాలను వాడుతున్న చర్చి ఎలాటి సందేశం యిస్తోంది? పాశ్చాత్య దేశాల్లో చర్చిపై సామాన్యులకు నమ్మకం తగ్గుతోందంటే తగ్గదా? నేను ఇంగ్లండులో కవెంట్రీ అనే పట్టణంలో నాలుగు నెలలున్నాను. మా యింటి పక్కనే చర్చి ఉంది. ఆదివారాలు వచ్చినా సందడి ఉండేది కాదు, అంతెందుకు క్రిస్‌మస్‌కు కూడా చడీచప్పుడూ లేదు. క్రిస్‌మస్‌కు మన దగ్గర క్రైస్తవేతరులు కూడా కాగితపు నక్షత్రాలు కట్టేసి ముగ్గుల్లో హేపీ క్రిస్‌మస్‌ రాసేసి హంగామా చేస్తారు. అక్కడ క్రిస్‌మస్‌ సందర్భంగా షాపింగ్‌, వైనింగ్‌, డైనింగ్‌ తప్ప మరే రకమైన మతపరమైన సందడీ కనబడలేదు. ఇవి గమనించైనా చర్చి ఆత్మావలోకనం చేసుకోవాలి. తప్పులు జరగకుండా అంతర్గతంగా పర్యవేక్షకులను పెట్టుకోవాలి. తప్పు చేశాడని ఫిర్యాదు రాగానే పూజారికి శిక్ష విధించాలి. కనీసం అక్కణ్నుంచి తప్పించాలి. రక్షణ కావాలంటే చర్చి ఆవరణకు వెళ్లి తీరాలని మన ఇండియన్‌ సినిమాలన్నీ చూపిస్తాయి. అనాథ పిల్లలందరినీ వదిలేసేది ఏసుక్రీస్తు లేదా మేరీమాత విగ్రహం దగ్గరే. సినిమాల్లో చర్చి ఫాదర్లందరూ నాగయ్యల్లాగ శాంతంగా మాట్లాడుతూ, అనునయిస్తూ ఉంటారు. అక్కడ పిల్లల్ని వదిలితే యింతే సంగతులు అని యీ వార్తలు భయపెడుతున్నాయి. సినిమాల్లో చూపే యిమేజిని కాపాడుకోవాలన్నా చర్చి ఏదో ఒకటి చేయాలి.

గుళ్లో పూజారిని వేశ్యాలోలుడిగా, దుర్మార్గుడిగా, అహంకారిగా చూపించిన సినిమాలు లేవా అంటే ఉన్నాయి. కానీ అవన్నీ వ్యక్తిపరమైన లోపాలుగా చూపిస్తారు. చర్చి విషయంలో యిది సంస్థాగతమైన వ్యవస్థ. హిందూ పూజారిని దండించడానికి ట్రస్టీలో, స్థానిక భక్తులో చాలు. కానీ చర్చి పూజారిని దండించాలంటే ఆ దేశ ప్రభుత్వానికి కూడా వీలు పడటం లేదు. వాటికన్‌ చొరబడి డబ్బు గుమ్మరించి, వారి తరఫున కేసులు వాదిస్తుంది. డబ్బులిచ్చి రాజీలు చేయిస్తుంది. పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తుంది. దీనికంతా అయ్యే ఖర్చు భక్తుల నుండి వసూలు చేస్తుందనే విషయం తలచుకుంటే కలుక్కుమంటుంది. తక్కినవాళ్లు ఏం చేస్తారా అని ఆలోచించి చూశాను. కంచి కామకోటి జయేంద్ర సరస్వతిపై హత్యానేరం మోపబడింది. దాన్ని ఎదుర్కోవడానికి వకీలు ఖర్చులు, కోర్టు ఖర్చులు మఠమే భరించి ఉంటుంది కదా. అది భక్తుల డబ్బేగా, లేకపోతే సన్యాసి ఐన వాడికి సొంత డబ్బు ఏముంటుంది? ఆ కేసులో సాక్షుల నందరినీ తిప్పేశారు. దానికై పలుకుబడి, భయం పని చేయనిచోట ప్రలోభాలు, డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చి ఉంటుంది. మఠానికేగా చమురు వదిలేది. పోనీ ఎవడైనా భక్తుడు పెట్టుకున్నాడనుకున్నా, మఠానికి యివ్వాలని పెట్టుకున్న డబ్బు అలా యిచ్చి ఉంటాడు. ఎలా చూసినా మఠానికి నష్టమే.

ఒక కంపెనీ ఉద్యోగి కస్టమరు పట్ల యిలా ప్రవర్తించేడనుకోండి. ఉద్యోగి చేష్టలకు కంపెనీని కూడా బాధ్యురాల్ని చేస్తూ బాధితురాలు కేసు పెట్టింది. కంపెనీ తన డబ్బు ఖర్చు పెట్టి కేసును ఎదుర్కోవాలి. ఆమెకు పరిహారం యివ్వాలి. తర్వాత ఉద్యోగి పని పట్టాలి. అతన్నుంచి పరిహారం వసూలు చేయడమో, జైలుకి పంపడమో ఏదో ఒకటి చేస్తుంది. ఇక్కడ చర్చి ఆ పని చేస్తున్నట్లు లేదు. అందుకే వాళ్లు పెచ్చుమీరి పోతున్నారు. క్రైస్తవ పూజారి వర్గం రకరకాల అవినీతికి పాల్పడుతున్న వ్యవహారాలు చాలా వెలుగులోకి వచ్చాయి. కానీ అన్నిటికంటె ఎక్కువ నేరాలు సెక్సుకి సంబంధించినవి. ఎందుకు అంటే బ్రహ్మచర్యం పాటించాలనే నియమం పెట్టడం చేతనే అని నా అభిప్రాయం. బ్రహ్మచర్యం ప్రకృతివిరుద్ధం. మతపరంగా లేక సామాజికమైన కట్టుబాట్ల పరంగా శృంగారానికి  దూరంగా ఉండమంటే మోజు మరీ పెరిగిపోతుంది. కవి చౌడప్ప అంటాడు - బ్రహ్మచారికి, సన్యాసికి, వితంతువుకు ఎప్పుడూ శృంగారంపైనే ధ్యాస ఉంటుందని. ఆ సుఖం ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండే గృహస్తులకు అంత యావ ఉండదు. వీళ్లకైతే అవకాశం మళ్లీ దొరకదేమోననే ఆత్రం ఉంటుంది.

ఏ మతాచారమైనా సరే, ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా ఉంటేనే మనగలుగుతుంది. హిందూధర్మంలో గృహస్థాశ్రమం తర్వాత సన్యాసం తీసుకోవచ్చన్నారు - అదీ భార్య అనుమతితో. యవ్వనంలో కూడా శృంగారంపై ఆసక్తి లేనివాళ్లు కోటి కొకరు ఉంటారేమో! వాళ్లు చిన్నతనంలోనే సన్యాసులవుతారు. బౌద్ధం సన్యాసి వ్యవస్థపై చాలా ఆధారపడింది. దాంతో వాళ్లు కోరికలు నియంత్రించుకోలేక పోయారు. బౌద్ధ సన్యాసులు, సన్యాసినుల మధ్య వ్యవహారాలు రచ్చకెక్కాయి. చివరకు బౌద్ధారామాలను 'లంజదిబ్బలు' అని పిలిచే స్థాయికి చేరింది. వాళ్లంటే పడని వాళ్లే ఆ పేరు పెట్టి ఉండవచ్చు. కానీ ఎంతోకొంత వాస్తవ పరిస్థితి లేకపోతే ఆ నింద నిలుదొక్కుకోదు. క్రైస్తవంలో చర్చి పూజారులు బ్రహ్మచర్యం పాటించడమనే నియమం పెట్టడం చేతనే యిలాటి ఘోరాలు ఎప్పణ్నుంచో జరుగుతున్నాయి. చర్చిలో శృంగార కలాపాల గురించి మధ్యయుగాల్లోనే పుస్తకాలు రాశారు. ఇప్పటికీ మనం రాయాల్సి వస్తోంది. చర్చి ఎప్పటికి తనను తాను సంస్కరించుకుంటుందో మరి!
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
mbsprasad@gmail.com