పొన్నాల వర్సెస్‌ కోదండ: గెలిచేదెవరు.?

ఎన్నికల్లో గెలవడం సంగతి తర్వాత.. ముందంటూ జనగామ టిక్కెట్‌ రేసులో ఎవరు గెలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య మధ్య ఫైట్‌ ఆ స్థాయిలో జరుగుతోంది మరి. జనగామ టిక్కెట్‌ కోసం పొన్నాల లక్ష్మయ్య నానాపాట్లూ పడుతున్నారు. ఒకప్పుడు ఇదే పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్‌ అభ్యర్థులకు బి-ఫామ్‌లు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే టిక్కెట్‌ కోసం ఢిల్లీలో దేబిరించాల్సిన దుస్థితి.

పొన్నాల లక్ష్మయ్యతో పోల్చితే, కోదండరామ్‌ అవసరం కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు చాలా ఎక్కువ వుంది. గత కొన్నాళ్ళుగా పొన్నాల లక్ష్మయ్య రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా కన్పించడంలేదు. ఏదో 'మమ' అన్పించేస్తున్నారు.

అందుకేనేమో, కాంగ్రెస్‌ అధిష్టానం లైట్‌ తీసుకుంది. దాంతో పొన్నాల కాంగ్రెస్‌ అధిష్టానంతో డిల్లీలో చర్చలు షురూ చేశారు. అయినా, పొన్నాలకి పాపం అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరికి, 'కోదండరామ్‌తో మాట్లాడుకోండి..' అని పొన్నాలకి ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకుంది కాంగ్రెస్‌ అధిష్టానం.

ఇక, జనగామ టిక్కెట్‌ విషయమై కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి తనకెలాంటి సమాచారం రాలేదని అంటున్నారు కోదండరామ్‌. అయితే పొన్నాల వర్గం మాత్రం, జనగామ బరిలోంచి కోదండరామ్‌ తప్పుకున్నారంటూ ప్రచారం షురూ చేసేసింది. ఆ ప్రచారాన్ని ఇంకోసారి కోదండరామ్‌ ఖండించేసరికి.. పొన్నాలకి వేరేదారి లేకుండాపోయింది.

ఆయన, కోదండరామ్‌తో భేటీ అయి, బతిమాలుకుంటే అయినా జనగామ టిక్కెట్‌ దక్కుతుందో లేదో. కాంగ్రెస్‌ పార్టీలో తన పరిస్థితి ఇంత దయనీయంగా తయారవుతుందని పొన్నాల కలలో కూడా ఊహించి వుండరు. ఊహించి వుంటే, టీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్‌ వచ్చినప్పుడే ఆయన పార్టీ మారిపోయేవారే.!

పొన్నాలకు టిక్కెట్‌ దక్కకపోయినా ఆయన డిప్యూటీ సీఎం అవుతారంటూ.. ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాల నుంచి అందుతున్న లీకులు, పొన్నాల అనుచరులకు పుండు మీద కారం జల్లుతున్నట్టున్నాయి. అవును మరి, ఆ లీకులు భరోసా ఇవ్వడంలేదు.. వెటకారం చేస్తున్నట్లుగా వున్నాయన్నది పొన్నాల అనుచరుల వాదన. 

Show comments