పోల'రణం': అక్కడ మాటలు.. ఇక్కడ మంటలు.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైద్రాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఐదేళ్ళు దాటినా, విభజన సమస్యలు ఇంకా చాలావరకు అలానే వున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్ళించడం సహా అనేక అంశాలపై చర్చ ఈ భేటీ తాలూకు అసలు ఉద్దేశ్యం.

మరోపక్క, పోలవరం ప్రాజెక్టుపై మీడియాలో రచ్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ నేత ప్రకాష్‌కీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకీ ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. కాటన్‌ బ్యారేజీలో 2 టీఎంసీల నీళ్ళు కూడా నిల్వ వుండే అవకాశం లేదనీ, అయినా ఆ బ్యారేజీ కారణంగా ఉభయ గోదావరి జిల్లాలు ఎన్నో ఏళ్ళుగా సస్యశ్యామలమయ్యాయనీ, అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే తప్పేంటని ప్రకాష్‌ ఒకింత అత్యుత్సాహంతో నోరు జారేశారు. దానికి రఘురామ కృష్ణంరాజు కౌంటర్‌ గట్టిగానే ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఉద్దేశ్యం గోదావరి జిల్లాలకు నీటిని అందించడం మాత్రమే కాదనీ, విశాఖ వరకూ గోదావరి నీటిని తరలించాలన్నది ఆ ప్రాజెక్టు అసలు ఉద్దేశ్యమని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రకాష్‌, రఘురామ కృష్ణంరాజు మధ్య వాగ్యుద్ధం గట్టిగానే జరిగింది.

మరోపక్క, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ విషయమై కొంత అత్యుత్సాహం చూపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందిగా తాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికిసూచించాననీ, తన ప్రతిపాదనకు జగన్‌ అంగీకరించారనీ కేసీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే. పోలవరం ప్రాజెక్టు విషయమై మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌కి అభ్యంతరాలున్నాయి. ఎలా ఆ ప్రాజెక్టుని అడ్డుకోవాలన్నదానిపై టీఆర్‌ఎస్‌ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున కోర్టులో పిటిషన్లు కూడా దాఖలై వున్నాయి.

అయితే, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని వైఎస్‌ జగన్‌ తాకట్టు పెట్టేలా, పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గించడానికి ఒప్పుకుంటారని అనుకోలేం. లోపల.. అంటే, ప్రగతి భవన్‌లో పోలవరం ప్రాజెక్టు అంశం చర్చకు వస్తుందన్నది నిర్వివాదాంశం. మరి, చర్చ సందర్భంగా కేసీఆర్‌కి వైఎస్‌ జగన్‌ కౌంటర్‌ ఇచ్చారా.? లోపల ఏం జరిగిందో తెలియాలంటే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెదవి విప్పాల్సిందే. 

Show comments