నా సినిమానే చూడండి.. సమంతాది వద్దు

స్వయంగా నాగచైతన్య చెబుతున్న మాటిది. ఒకేరోజు విడుదలవుతున్న శైలజారెడ్డి అల్లుడు, యూటర్న్ సినిమాలకు సంబంధించి ప్రేక్షకులంతా తన సినిమానే చూడాలని అంటున్నాడు చైతూ. దీనికి చైతన్య చెప్పే లాజిక్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ మేరకు తిరుగులేని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాడు ఈ హీరో. 

"దయచేసి అంతా నా సినిమానే చూడండి ప్లీజ్. ఎందుకంటే ఈ ఏడాది నాకిది ఫస్ట్ రిలీజ్. సమంతకు సంబంధించి ఆల్రెడీ ఈ ఏడాది రంగస్థలం, మహానటి ఉన్నాయి. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి నా సినిమానే ముందు చూడండి."

సమంతకు ఆల్రెడీ సూపర్ హిట్స్ ఉన్నాయి కాబట్టి, తనకు కూడా ఓ హిట్ ఇవ్వమని ఇలా ప్రేక్షకుల్ని కోరుతున్నాడు నాగచైతన్య. మొదట తనను ఎంకరేజ్ చేసి, తర్వాత సమంత సినిమా చూడమంటున్నాడు. అంతేకాదు, కథాపరంగా ఏమాత్రం సంబంధం లేని శైలజారెడ్డి అల్లుడు, యూటర్న్ సినిమాల మధ్య ఓ మంచి కనెక్షన్ పెట్టాడు చైతూ.

"సమంత నా సినిమా చూసింది. తనకు శైలజారెడ్డి అల్లుడు బాగా నచ్చింది. నేను కూడా ఒరిజినల్ యూటర్న్ చూశాను. సినిమా చాలా బాగుంది. మా రెండు సినిమాలకు ఓ సిమిలారిటీ ఉంది. ఈ రెండు సినిమాల్లో చివరి 40 నిమిషాలు బాగా ఎంజాయ్ చేస్తారు." 

శైలజారెడ్డి అల్లుడులో చివరి 40నిమిషాల ఫ్యామిలీ డ్రామా, యూటర్న్ లో చివరి 40 నిమిషాల థ్రిల్లింగ్ ఎపిసోడ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తాయంటున్నాడు చైతూ. అయితే సమంత సినిమాతో పోలిస్తే, తన సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అంతా జాలీగా ఇంటికెళ్తారని అంటున్నాడు.

RELATED మామ, బేబి మధ్యలో నేను