ఇది ‘చంద్ర’సూచన కాదు.. నమ్మండి ప్లీజ్!

ఇలాంటి నిర్ణయం వలన పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయో ఏమో ఇంకా క్లారిటీలేదు. కానీ పరువు పోవడం మాత్రం గ్యారంటీ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయినా సరే.. కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడానికి తెలుగుదేశం ఒక నిర్ణయానికి వచ్చేసింది. తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, ఆల్రెడీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోను చేశారని మాట్లాడారని వార్తలొస్తున్నాయి. అలాగే సీపీఐ వారితోనూ కూడా తెదేపా ఒక విడత భేటీలు ఆదివారం చోటు చేసుకున్నాయి. మొత్తానికి కాంగ్రెస్, సీపీఐ పార్టీలతో కలిసిన కూటమిలో తెలుగుదేశం ఉంటుందనే సంగతి ఖరారే!

అయితే ఇక్కడే.. పరువు పోకుండా కాపాడుకోవడం ఎలాగనే విషయంలో తెలుగుదేశం నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ తో జట్టుకట్టినందుకు, ఏం చేస్తే తమను ఎవ్వరూ నిందించకుండా ఉంటారో.. వారికి తోచడంలేదు. కాంగ్రెస్ పతనం కళ్ల జూడాలనే కోరికతోనే ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు వారి మోచేతి నీళ్లు తాగడానికి, వారు విదిలించిన సీట్లలో పోటీచేసి భవిష్యత్తును కాపాడుకోవడానికి ఆరాటపడుతుండడం.. దౌర్భాగ్యం అని పార్టీలోనే దెప్పిపొడుపులు వినిపిస్తున్నాయి.

ఇదంతా ఒకఎత్తు అయితే.. ఈ పొత్తు నిర్ణయం వలన చంద్రబాబు ఇమేజి డ్యామేజీ కాకుండా ఉండడానికి  కూడా తెదేపా చాలా కష్టపడుతోంది. వ్యూహాత్మకంగా.. చంద్రబాబు శనివారమే.. ఎన్నికలు ఎదుర్కొనే వ్యూహాలను మీరే నిర్ణయించుకోండి అని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ పొత్తు నిర్ణయం వెలుగులోకి వచ్చాక.. అలాంటి నిర్ణయం తెలంగాణ స్థానిక పార్టీ నాయకుల ఆలోచనే అని, చంద్రబాబు సూచన ఎంతమాత్రమూ కాదని రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం నాయకులు అడక్కపోయినా సరే చాటి చెప్పుకుంటున్నారు.

ఏపీ హోంమంత్రి చినరాజప్ప అనంతపురంలో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. స్థానిక నాయకుల చొరవతోనే ఆ పొత్తులు ఏర్పడుతున్నాయంటున్నారు. ఆ పొత్తులకు ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని కూడా చెప్పుకుంటున్నారు. అవును మరి.. సంబంధం ఉన్నదంటే.. ఏపీలో కాంగ్రెస్ ను ఛీత్కరించుకునే కోట్లాది మంది జనం.. తెలుగుదేశాన్ని కూడా భూస్థాపితం చేసేస్తారనే భయం వారికి ఉన్నది మరి!

RELATED 105 నియోజకవర్గాల్లో సర్వే...!