ప్ర‌జ‌లు త‌ల‌దించుకునేలా అసెంబ్లీ స‌మావేశాలు

అది ప్ర‌జాస్వామ్యానికి దేవాల‌యం లాంటి అసెంబ్లీ. ప్ర‌జ‌ల బాగోగుల కోసం చ‌ట్టాలు చేసే చ‌ట్ట‌స‌భ‌. కానీ అక్క‌డ ప్ర‌జాస‌మ‌స్య‌లు, చ‌ట్టాల‌పై చ‌ర్చ‌ల కంటే ర‌చ్చ‌లే ఎక్కువ‌. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగు మాధ్య‌మాన్ని తొల‌గించి ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్ట‌డంపై అసెంబ్లీలో గురువారం వాడీవేడీ చ‌ర్చ జ‌రిగింది. దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల‌ యుద్ధ‌మే సాగింది.
 
"ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం ఇష్టంలేక చంద్రబాబు, ఈనాడు పత్రిక, ఓ సామాజికవర్గం యుద్ధం చేస్తోంది. దీనికి ఉపరాష్ట్రపతి వెంకయ్య కూడా వత్తాసు పలుకుతున్నారు అని సీఎం వైఎస్ జ‌గ‌న్" తీవ్ర‌స్థాయిలో ధ్వజమెత్తారు.

జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు దీటుగా స్పందిస్తూ   "ఇంగ్లీషు మీడియం అమలు విషయంలో మాపై అసత్యాలు రాయించారు. మాపై తప్పుడు ప్రచారం చేయించినందుకు జగనే తలదించుకోవాలి " అని ఆవేశంతో అన్నారు.
 
చంద్రబాబు  వ్యాఖ్యలపై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు. సాక్షి పత్రికలో, ఈనాడులో ఏం తప్పు రాశారో చర్చించడానికి అసెంబ్లీ లేదన్నారు. ‘‘జగన్‌గా నేను ఏం మాట్లాడానో చెప్పండి. ఐదేళ్లు సీఎంగా ఉండి ఇంగ్లీషు మీడియం అమలు చేయనందుకు, అబద్ధాలు చెబుతున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి’’ అని మండిప‌డ్డారు.

దీని పై చంద్రబాబు అంతే  తీవ్రంగా స్పందించారు. తెలుగు భాషను రక్షించుకోవాలని ట్విటర్‌లో పెట్టిన పోస్టు గురించి ఏమంటారని ప్రశ్నించారు. ‘‘నేను కాదు.. మీరే సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజలను మోసం చేసినందుకు క్షణమాపణ చెప్పా లి. నారాయణ స్కూళ్లను ప్రమోట్‌ చేయడానికే ఇంగ్లీషు మీడియం పెట్టారని నాడు మాపై సాక్షిలో రాశారు. సాక్షిలో రాస్తే ఆయనకు సంబంధం లేదా!?’’ అని ప్రశ్నించారు.
 
‘‘ఈ మనిషికి బుద్ధీ జ్ఞానం ఉన్నాయా? కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడుతామనుకుంటున్నావా?  అని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెట్ట‌డంపై మొద‌లైన చ‌ర్చ కాస్తా ర‌చ్చ ఎలా అయ్యిందో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు సంభాష‌ణ‌లు వింటే అర్థం చేసుకోవ‌చ్చు.  సిగ్గుతో మీరు త‌ల‌దించుకోవాలంటే...కాదు కాదు మీరే త‌ల‌దించుకోవాలంటూ ప‌ర‌స్పరం తిట్టుకున్నారు.

అసెంబ్లీలో మ‌న నాయ‌కులు వాద‌సంవాద‌న‌లు చూసిన త‌ర్వాత...నిజంగా వీరిని అక్క‌డికి పంపిన ప్ర‌జ‌లే సిగ్గుతో త‌ల‌ల దించుకోవాలనే అస‌హ‌నం క‌లుగుతోంది. ఆద‌ర్శంగా న‌డుచుకోవాల్సిన నాయ‌కులు...అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తున్న ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటారనే స్పృహ కూడా లేక‌పోవ‌డం మ‌న దౌర్భాగ్యం.

మళ్ళీ దొరికిపోయి పరువు తీసుకున్న బాబు

Show comments