పవన్.. అమ్మకు.. అన్నకే చెప్పలేదు-త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్. మీడియాకు వీలయినంత దూరంగా వుండే మనిషి. అలాంటి దర్శకుడు గత మూడు రోజులుగా మీడియాతోనే వుంటున్నారు. అజ్ఞాతవాసి ఫలితం కావచ్చు, అరవింద ఫలితం కోసం కావచ్చు. గత రెండు రోజులుగా విజువల్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వూలు ఇస్తూవచ్చారు. ఈరోజు ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దొర్లిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాల్లో ఆసక్తికరమైనవి కొన్ని.

*అసలు ఫ్యాక్షనిస్టు నేపథ్యంలో సినిమా అని మొదట అనుకోలేదు. సాధారణంగా సంఘటనకు ముందు, జరిగిన తరువాత వున్న ఆసక్తి, తరువాత వుండదు. భారతంలో యుద్దకాండ తరువాత కాండలపై ఆసక్తి కనిపించదు. ఆ పాయింట్ ప్రెజెంట్ చేయాలి అనుకుని, అలా అలా ముందుకు వెళ్తే ఫ్యాక్షనిస్ట్ నేపథ్యం సెట్ అయింది.

*సినిమాలో వాడడం కోసం నేను ముందు నుంచే రాయలసీమ భాష, యాస, పద్దతుల మీద చాలా చదివాను. తెలుసుకున్నాను. రాయలసీమ భాష సొగసు, అందం కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. 

*పెనిమిటి పాట నలభైశాతం మాత్రమే హీరో మీద వుంటుంది. మిగిలినది అంతా మాంటేజ్ లోనే. ప్రోమోలో చూసినది ఆ నలభైశాతం మాత్రమే.

*పెనిమిటి పాట అలా వస్తుందని ముందుగా ప్లాన్ చేసింది కాదు. అనుకోకుండా అలా సెట్ అయింది అంతే.

*ఎన్టీఆర్ కు నాలుగయిదు సబ్జెక్ట్ లు చెబితే, ఇద్దరం కనెక్ట్ అయింది అరవింద సబ్జెక్ట్ దగ్గరే.

*సినిమా నిర్మాణానికి ఎంత వ్యయం అవుతోందన్నది నేను పట్టించుకోను. అలాగే సినిమా తీసేసిన తరువాత దాని ఫలితం గురించే పదే పదే ఆలోచించను. మహా అయితే రెండు రోజులు ఆలోచిస్తానేమో?

*ఎంత ఖర్చుచేసినా, నిర్మాత సేఫ్ అవుతున్నారు కాబట్టే, నాకు ఇంకా సినిమాలు వస్తున్నాయేమో?

*అజ్ఞాతవాసి ఫలితం తరువాత నా రెమ్యూనిరేషన్ వెనక్కు ఇచ్చారు.

*నేను నిజాయతీగా, ఓపెన్ గా వుంటాను కాబట్టే, హీరోలందరితో సాన్నిహిత్యం కుదిరిందేమో?

*వెంకటేష్ కు సరైన కథ సెట్ కావడంలేదు. ఇద్దరికీ నచ్చే కథ కోసం ప్రయత్నిస్తున్నాను.

*మహేష్ తో సినిమా ఎప్పటికి వుంటుందో తెలియదు. ఎన్టీఆర్ తో సినిమా మాదిరిగానే. చేయాలనే వుంది ఇద్దరికీ. కానీ ఇప్పటికి కానీ సెట్ కాలేదు. అదీ అంతే.

*పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడే. కానీ మేం సినిమాలు, రాజకీయాలు మాట్లాడుకోం.

*పవన్ నాకు చెప్పి రాజకీయాల్లోకి వెళ్లలేదు. నా ఇంటికి వచ్చి, నా ఆశీర్వాదం తీసుకుని, కండువా కప్పించకుని వెళ్లలేదు. ఆయన వాళ్ల అమ్మ, అన్నకే చెప్పలేదు. నాకు చెబుతాడా? భలే అడిగారే.. మీరు.

*రాజకీయాల్లోకి వెళ్లండి.. వెళ్లొద్దు అన్న సలహాలు నేను ఎందుకు ఇస్తాను. అస్సలు ఎవ్వరికీ ఇవ్వను. ఎందుకంటే టాప్ హీరోలు అయ్యారు అంటే వాళ్లలో ఆ శక్తి, స్టామినా వున్నట్లే కదా? వాళ్లకు ఏ దశలోనూ సలహాలు అక్కరలేదు.

*పవన్ స్పీచ్ లు మీరే రాసారని అంటారేంటీ.. నాకు నా స్క్రిప్ట్ లు రాయడానికే బద్దకం.

*బన్నీతో సినిమా ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.

*ప్రేక్షకుల ఆలోచనా ధోరణి కాలానుగుణంగా మారుతుంది. ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్లు అనిపిస్తోంది. అందుకే కొత్త తరహాగా చెప్పడానికి ధైర్యం చేస్తున్నారు అంతా. నేను కూడా.

*ప్రతి సినిమా చూస్తాను. థియేటర్లలో చూస్తాను. ఈ మధ్య నాకు నచ్చినవి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, కంచరపాలెం, రంగస్థలం, ఆర్ఎక్స్ 100. ఇలా కొన్ని వున్నాయి. హిట్ అయిన సినిమాల పేర్లే నేను చెప్పడం లేదు. హిట్ అయిన సినిమాల పేర్లు కొన్ని వదిలేసాను కూడా. అలా అని దీన్ని మళ్లీ ఇస్యూ చేయకండి.

*నిజానికి మీడియా ముందుకు రావడం నాకు పెద్ద ఇష్టం వుండదు. కెమేరాలు చూస్తే పారిపోతాను. కానీ ఈసారి ఎన్టీఆర్ బలవంతం చేసి ఇంటర్వూల్లో కూర్చోపెట్టారు.

*దేవీశ్రీప్రసాద్ తో చేయకపోవడానికి పెద్దగా రీజన్ లేదు. ఆయన నాకు ఇప్పటికీ మిత్రుడే. కానీ నాకు నేను మార్పు కోరుకుంటున్నాను. అలా అని దేవీ రొటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడని అనడం లేదు. అలా ఇస్తే హిట్ ఎందుకు అవుతాయి? అనిరుధ్ సమయానికి రాక అ..ఆ సినిమా విక్కీతో చేసాను. అందుకే అజ్ఞాతవాసి అనిరుధ్ కు ఇచ్చాం.

కానీ తెలుగుకు ఇంకా సెట్ కావడానికి టైమ్ పడుతుందని గమనించి, ఈ సినిమా థమన్ కు ఇచ్చాను. అనిరుధ్ నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు. మళ్లీ అతనితో కచ్చితంగా చేస్తాను.

*థమన్ సంగీత దర్శకుడి కన్నా ఇంకా ఎక్కువ అని చెప్పాలి. అతనికి సినిమాల మీద వున్న పరిజ్ఞానం ఎక్కువ. అతనిలో సినిమాకు, సంగీతానికి అతీతమైన విషయం చాలా వుంది.

*నేను రాత్రి ఎగ్జయిట్ అయి, రాసి పెట్టిన స్టోరీ పాయింట్లు తెల్లవారి సిల్లీగా అనిపించి, చింపేసన సంఘనటలు చాలా వున్నాయి. ఖలేజా ఇప్పటికీ బాగుందని చాలా మంది అంటారు. కానీ నాకు తెలిసి, అది నాకు ఓకె కాదు.

*పదహారు ఏళ్లలో పది సినిమాలు అనకండి. నాకు నా బద్దకం గుర్తుకు వస్తుంది. ఆ విషయంలో నేను బాగా లేజీ.

*నేను ఆత్మ బంధువు అని అనడం ఎన్టీఆర్ గొప్పదనం. నిజానికి ఆయన ముందుకు రాకపోతే, ఈ సినిమా సమ్మర్ కు వెళ్లిపోయేది. ఆయన ఇంట్లో విషాద సంఘటన జరగగానే నేను, నిర్మాత సైలంట్ గా సినిమాను సమ్మర్ కు తీసుకెళ్దాం అని డిసైడ్ అయిపోయాం.

కానీ చిత్రంగా మర్నాడే ఎన్టీఆర్ ఫోన్ చేసి, అయిదో రోజు నుంచి షూటింగ్ కు వస్తున్నా, నిర్మాత ఇబ్బంది పడకూడదు అని చెప్పారు. మేము వద్దన్నా ఆయన ముందుకే వచ్చారు.