పవర్ వైఖరి వెనుక...?

ఉన్నట్లుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒక్కో వ్యవహారాన్ని ఆయన టచ్ చేస్తున్నారు. ఇప్పటివరకు చిరకాలంగా ఆయన తెలంగాణ వ్యవహారాలను చూసీ చూడనట్లు, పట్టీ పట్టనట్లు వదిలేసారు. అలాంటిది ఒక్కసారిగా పవన్ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

ముందుగా నల్లమల సమస్య అయిన యురేనియం వెలికితీత మీద స్పందించారు. యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గళాలకు మద్దతుగా నిలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావుతో భేటీ అయ్యారు. పవన్ అపాయింట్ మెంట్ లేకుండా, రావాలా? వద్దా? అవైలబుల్ గా వుంటారో? వుండరో తెలుసుకోకుండా హనుమన్న వెళ్లి వుండరు కదా?

అలాగే టాలీవుడ్ లో చిరకాలంగా వున్న సినిమా కళాకారుల ఇళ్ల సమస్యపై ఆ మధ్య స్పందించారు. లేటెస్ట్ గా సినిమా జనాలు కొందరితో భేటీ అయ్యారు. సినిమా కళాకారులకు స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

మొత్తంమీద చూస్తుంటే పవన్ కళ్యాణ్ మెల్లగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నట్లే వుంది. చంద్రబాబు దాదాపు విఫలమయ్యారు. హైదరాబాద్ వదిలేసి వెళ్లడమే కాకుండా,  ఆ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల తరువాత ఇక్కడి రాజకీయాలు కూడా వదిలేసారు. ఎన్టీఆర్ భవన్ దాదాపు ఏ విధమైన రాజకీయ కార్యకలాపాలు లేకుండా వుండిపోయింది.

ఇలాంటి నేపథ్యంలో పవన్ తెలంగాణ వ్యవహారాల్లో యాక్టివ్ కావడం చూస్తుంటే, తెరవెనుక ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. అయితే తెలంగాణలో ప్రజా వ్యతిరేకత ఏమాత్రం అన్నా వుంది అన్న సంగతి పసిగట్టి పవన్ ముందుకు దూకుతూ వుండాలి. లేదా పవన్ వెనుక నుంచి ఎవరో ముందుకుతోసే కార్యక్రమం జరుగుతోందన్న అనుమానం కలగాలి.

రాబోయే కాలంలో పవన్ వైఖరిని బట్టి ఈ విషయం పై కాస్త క్లారిటీ వస్తుంది.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం