హైదరాబాద్ దాటి వెళ్లబోతున్న పవన్!

హరిహర వీరమల్లు సినిమా హైదరాబాద్ లో జరుగుతోంది. వినోదాయశితం రీమేక్ షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే. త్వరలోనే మొదలుకాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కోసం కూడా హైదరాబాద్ లోనే సెట్ వేస్తున్నారు. ఇలా పవన్ హైదరాబాద్ దాటి బయటకు వెళ్లడం లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే.

పవన్ సినిమాలతో పాటు రాజకీయాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఏపీలో రాజకీయాలు చేస్తూ, హైదరాబాద్ లో షూటింగ్ లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో హైదరాబాద్ వీడి మరో ప్రాంతానికి వెళ్లాలంటే కాస్త ఇబ్బందే. రాజకీయాలకు దూరం జరగాల్సి ఉంటుంది. అందుకే పవన్ హైదరాబాద్ కదలరు. కానీ ఈసారి కదలక తప్పేలా లేదు.

త్వరలోనే సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు పవన్. మాఫియా కాన్సెప్ట్ తో, ముంబయి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రాబోతోంది. దీని కోసం సుజీత్ అండ్ టీమ్ ముంబయిలో కొన్ని లొకేషన్లు కూడా చూసొచ్చింది. సో.. ఆ షూటింగ్ కోసం పవన్ హైదరాబాద్ వదిలి ముంబయి వెళ్లక తప్పదన్నమాట.

ప్రస్తుతానికైతే ఓజీ షూటింగ్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. ఏప్రిల్ నెలలో ఓ షెడ్యూల్ జరుగుతుంది. ఆ తర్వాత ముంబయి షెడ్యూల్ ఉంటుంది.

Show comments