జనసేనలో గ్రూపులు.. నిజం ఒప్పుకున్న పవన్

అభిమానం అనే పునాదుల మీద నిర్మించిన జనసేన పార్టీలో అవకతవకలు జరుగుతున్నాయని, అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫ్యాన్స్ ఇగోలు పక్కనపెట్టాలని పవన్ పదేపదే చెబుతున్నప్పటికీ, గ్రూపు రాజకీయాల ఊసెత్తలేదు. ఎట్టకేలకు తన పార్టీలో కూడా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని పరోక్షంగా అంగీకరించారు పవన్.

"పార్టీలో కొద్దిమంది గ్రూపులు కట్టి రాజకీయాలు చేద్దామంటే అర్థం చేసుకోలేని అవివేకిని కాదు. సమర్థతతో హ్యాండిల్ చేసే సత్తా ఉన్నవాడిని. కాబట్టి నాకు భయాల్లేవు. నేను లేకపోతే పార్టీ కూలిపోద్ది అనే బెదిరింపులకు లొంగను. నేను అన్నదమ్ములు, ఆడపడుచుల్ని నమ్ముకొని వచ్చినవాడ్ని. నా జనసైనికుల్ని నమ్ముకున్నాను. నన్ను నమ్ముకొని వేలాది మంది యువకులు ముందుకొచ్చారు. వాళ్లను వదిలి గ్రూపుల్ని పట్టించుకోవాలా?"

ఇలా జనసేన పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు పవన్. ఈ వ్యాఖ్యల బట్టిచూస్తే పార్టీలో మనుషులే ఎవరో పవన్ ను బెదిరించినట్టుగా స్పష్టమౌతోంది. అయితే వాళ్లు ఎవరనే విషయాన్ని మాత్రం జనసేనాని బయటపెట్టలేదు. కొందరు వ్యక్తుల ఇగోలు మాత్రం పట్టించుకోనని ప్రకటించారు.

"నేను మనుషుల్ని, వాళ్ల ఇగోల్ని పట్టించుకోను. ఫలానా నాయకుడు లేకపోతే పార్టీ ఏమైపోద్ది అనే భయం నాకులేదు. నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం నిలబడతాను. కొన్ని అవకతవకలున్నాయి. అక్కడక్కడ గ్రూపిజం కూడా ఉంది. వాటిని నేను పట్టించుకోను. ఎంతో చాకిరి చేసి, డబ్బులు వెదుక్కొని మరీ పార్టీ పెట్టాను. వాళ్ల ఇగోలు పట్టించుకోవాలా.. ప్రజల కష్టాలు పట్టించుకోవాలా?"

జనసేన పునాదుల్ని మరిచిపోయే నాయకులు తనకు అక్కర్లేదని అంటున్నారు పవన్. యువత శ్రమను గుర్తించాలని, పదవిని అధికారంగా కాకుండా, బాధ్యతగా ఫీలయ్యే నాయకులు కావాలని అంటున్నారు.

"ప్రతి నాయకుడికి నేను చెప్పేది ఒకటే. దయచేసి మన పునాదుల్ని మరిచిపోవద్దు. జనసైనికుల్ని మరిచిపోతే ఎలా. గ్రూపులు కట్టేముందు ఒకసారి జనసైనికుల గురించి ఆలోచించండి. యువత శ్రమను గుర్తించే ఏకైక పార్టీ జనసేన."

రాత్రికి రాత్రి ముఖ్యమంత్రిని అయిపోవాలనే ఆశ తనకు లేదంటున్నారు పవన్. రాజకీయాల్లో, ప్రజల ఆలోచన ధోరణిలో మార్పువస్తే అదే పదివేలు అంటున్న పవన్.. ఓట్లు, పోలింగ్ పర్సంటేజీపై తనకు ఏమాత్రం భయంలేదని స్పష్టంచేశారు.

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments