పవన్ కవాతులో కొట్టుకుపోయిన శ్రీకాకుళం

ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేక అభిమానం అన్నారు
తన సినిమాల్లో శ్రీకాకుళం యాసకు అందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు
ఉత్తరాంధ్రకు తను దత్తపుత్రుడనని చెప్పుకున్నారు
ఇప్పుడు అదే శ్రీకాకుళం తుపానులో చిక్కుకుంటే కనిపించకుండా పోయారు

తిత్లీ తుపాను తర్వాత ఉత్తరాంధ్ర విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తాను వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసి ఇక ఆ వ్యవహారాన్ని అంతటితో గాలికి వదిలేశారు జనసేనాని. తన ట్వీట్ల వర్షంలో కవాతుకి ఇచ్చిన ప్రాధాన్యం కనీసం ఉత్తరాంధ్ర బాధితులకు ఇవ్వలేదన్నది వాస్తవం.

కవాతు పాట రాసినోళ్లకి, మ్యూజిక్ ఇచ్చినోళ్లకి జేజేలు కొట్టి సినిమా బుద్ధిని మరోసారి బైటపెట్టుకున్న పవన్.. కనీసం ఉత్తరాంధ్రకు అంగా నిలబడండి అంటూ ఓ ట్వీట్ చేసిన పాపాన పోలేదు. పైగా శ్రీకాకుళం జనాలకు అండగా నిలిచిన జనసైనికులకు కృతజ్ఞతలు చెప్పి, నెటిజన్ల ఆగ్రహానికి మరింత గురయ్యారు.

కొత్త పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, కొత్త నేతల చేరికతో జోష్ మీదున్న పవన్ కి ప్రస్తుతం ఉత్తరాంధ్ర కష్టాలు కనపడటం లేదు. నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ తరహాలో ఉత్తరాంధ్రలో కూడా మరో ఉద్యమం పుడుతుందంటూ గతంలో కాకమ్మ కబుర్లు చెప్పిన పవన్, ఇప్పుడు అదే ఉద్యమాల జిల్లాను నిర్లక్ష్యం చేశారు.

ఎక్కడ పర్యటిస్తే ఆ ప్రాంతానికే పవన్ మాటలు, చేతలు పరిమితమవుతాయనే విమర్శల్ని జనసేనాని మరోసారి నిజంచేసి చూపించారు. తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇదేదో ప్రతిపక్షాల పొలిటికల్ స్టేట్ మెంట్ కాదు. సామాన్య ప్రజల కళ్లకు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితి.

ఇలాంటి టైమ్ లో పవన్ శ్రీకాకుళం ప్రజానీకాన్ని ఓదార్చనక్కర్లేదు, వాళ్ల కోసం తను రంగంలోకి దిగి సహాయం కూడా చేయనక్కర్లేదు. కనీసం ప్రభుత్వ వైఫల్యాన్నయినా ఎండగట్టాలి కదా. ఇదే ఇప్పుడు శ్రీకాకుళం యువత కోపానికి కారణం.

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్, ఇలాంటి టైమ్ లో ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు స్పందిస్తారంటూ సోషల్ మీడియాలో శ్రీకాకుళం యూత్ పవన్ పై భగ్గుమంటోంది. అటు జనసేనాని మాత్రం వీటితో సంబంధం లేకుండా కవాతు కోసం ప్రిపేర్ అవుతున్నారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments