పవన్ ముసుగూ తొలగిపోతోంది

ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక్కొక్కరి ముసుగూ తొలగిపోయి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు పట్ల వారికి వున్న అభిమానం, ఆయనతో వారికి వున్న అనుబంధం బయట పడుతూ వస్తోంది. ఇప్పటికే పరుచూరి అశోక్ బాబు, హీరో శివాజీ దగ్గర నుంచి జేడి లక్ష్మీనారాయణ వరకు తెలుగుదేశం పంచన చేరుతూ వస్తున్నారు. వీళ్లంతా గతంలో జగన్ ను అధికారంలోకి రాకుండా ఏదో విధంగా తమ చేతనైన సాయం చేసిన వారే. ఇప్పుడు ఈ జాబితాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరిపోతున్నట్లు కనిపిస్తోంది.

రాజమండ్రి లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం ఆద్యంతం తెలుగుదేశం తరచు వినియోగించే పాయింట్లతోనే సాగింది. పైగా పొరపాటున కూడా గతంలో ఆయన లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలు కానీ, రాజధాని భూముల వ్యవహారం కానీ, ఇసుక తదితర అవినీతి ఆరోపణలను కానీ గుర్తు చేసుకోలేదు. ఒక్క మాట కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే విదంగా మాట్లాడుకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఇక తెలుగుదేశం సదా ప్రవచించే విషయాలను ఎలా వల్లె వేసారు అంటే.. కేసిఆర్ కు జగన్ కు దోస్తానా? మోడీకి జగన్ కు దోస్తానా? ఆంధ్రుల ఆత్మగౌరవానికి కేసిఆర్ తో ఇబ్బంది? లాంటి పాయింట్ల చుట్టూ సాగడం విశేషం.

ఇప్పటికే ఎవరు సర్వే చేసినా, అది ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా, జనసేన విషయంలో మాత్రం అన్ని సర్వేలు ఒకటే చెబుతున్నాయి. సింగిల్ అంకె ఓట్ల శాతం మాత్రమే ఆ పార్టీకి వస్తుందని. ఇది తెలిసి కూడా ఇంకా జనసేనను జనాలకు దూరం చేస్తున్నట్లు కనిపిస్తోంది పవన్ వాలకం చూస్తుంటే. 

ఏది ఏమైనా పవన్ వల్ల తెలుగుదేశం అనుకూల పత్రికలకు మాత్రం రేపు ఏ విధంగా జగన్ ను తిట్టాలా? అనే బాధ తీరింది. రేపు ఫస్ట్ పేజీలో పవన్ చేత జగన్ ను తిట్టిస్తారు అన్నమాట.